
నేటి భారతంలో వందల ౖమైళ్ళ దూరం సైతం వలస కూలీలు కాలి నడకన పోతున్నారు. ఈ దయనీయ స్థితిని నేటి కవులు చాలా మంది వచన కవితలలో రాశారు. ఒకరిద్దరు పద్యాలు కూడా రాశారు. కింద ఒక ఉత్పలమాల పద్యం చూడండి.
ఉ. డప్పి జనించె వ్రేళులపుటంబులు పొక్క దొడంగె గోళ్ళలో
జిప్పిల జొచ్చె నెత్తురులు చిత్తము నాకు గడున్ వశంబు గా
దప్పుర మిచ్చ టచ్చటను నాసల వచ్చితి నెంత దవ్వొకో
యిప్పటి భంగి నొక్కడుగు నేగెడు దానికి నోర్వ నెమ్మెయిన్
(బాగా దప్పిక పుట్టింది; వేళ్ళకొసలు పొక్కులు పొక్కాయి; గోళ్ళనుండి నెత్తురులు చిప్పిలుతున్నాయి; నామనసు నాకు వశం కావడం లేదు; ఆ (నా) ఊరు ఇక్కడెక్కడో అనుకొని వచ్చాను, ఎంత దూరం ఉందో కదా; ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్క అడుగు కూడా వేసే ఓపిక లేదు.)
వలస కూలీలు భగభగమండే రోడ్ల మీద నడవలేని స్థితిని నేటి పద్య కవి ఎవరో చక్కగా వర్ణించినట్లుగా ఉంది కదా! కానీ ఇది మహాభారత విరాటపర్వం ప్రథమాశ్వాసంలోని 148వ పద్యం. పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం పూర్తి చేసుకుంటారు. ధౌమ్యుని అశ్రమంలో ఉన్నారు చివరిగా. అక్కడనుండి విరాట రాజు పాలించే మత్స్య దేశపు రాజధాని విరాట నగరానికి పోయి, అక్కడ ఒక సంవత్సరం అజ్ఞాతవాసం గడపాలని అనుకుంటారు.
ధౌమ్యుని ఆశీస్సులు, రాజకొలువులో ఎలా మెలగాలి అని చెప్పిన హితోక్తులు విని ద్రౌపదితో సహా బయలుదేరారు. కనీసం ఐదువందల మైళ్ళు నడవాలి. మధ్యలో ఏ నగరం తగలకుండా అడవి మార్గంలోనే నడవాలనుకుంటారు. రెండుమూడు రోజులు నడిచే సరికే కుసుమ కోమలి ద్రౌపది ఒక్క అడుగు కూడా వేయలేనంతగా అలసిపోయి కూలబడింది. అలాంటి స్థితిలో ఉన్న ద్రౌపదిని మహాకవి తిక్కన వర్ణించిన పద్యం ఇది. కాని 900 సంవత్సరాల తర్వాత ఈనాటి వలస కూలీల దుస్థితిని వర్ణించడానికి నూరు శాతం ప్రతి అక్షరం పనికి వచ్చిన పద్ధతిలో ఉంది కదా.
ఏమి చిత్రము. ఏమి మన కవుల శక్తి. అలాంటి ద్రౌపదిని చూచి ధర్మరాజు నకుల సహదేవులకు చెబుదామనుకుని, వారు కూడా అలసి ఉండటంతో అర్జునుడిని పిలిచి ద్రౌపది ఇక నడవలేదు, కానీ ఇక్కడ విడిది చేద్దామన్నా కుదరదు, కాబట్టి ఆమెను నీవే ఎత్తుకో అని చెప్తాడు. అలా ద్రౌపదిని మోసుకొని పోయారు వారు. కాని నేటి మన వలస కూలీలను మోయడానికి ఏలినవారే వాహనాలు ఏర్పాటు చేయాలి.
-ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి