ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికులను నెల రోజుల పాటు అలరించిన ప్రపంచ కప్ తుది దశకి చేరుకుంది. ఈ నెల రోజుల్లోనూ దాదాపు ప్రతి జట్టూ పోటీలో నిల్చేందుకు.. కప్ దక్కించుకునేందుకు హోరాహోరీగా పోరాడినా కొన్ని సార్లు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రారంభంలోనే డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ నిష్ర్కమించగా.. వరల్డ్ కప్‌కి ఆతిథ్యమిస్తున్న బ్రెజిల్‌పై సెమీ ఫైన ల్స్‌లో జర్మనీ ఘనంగా గెలిచింది. ఇలాంటి పరిణామాలకు ఆయా టీమ్స్ వ్యూహాలే కారణం. ఎందుకంటే.. మ్యాచ్ జరిగే గంటన్నర సమయంలో సత్తా చాటాలి. గోల్స్ చేయాలి. ప్రత్యర్థిపై గెలుపొందాలి. పటిష్టమైన వ్యూహాలతోనే ఇదంతా సాధ్యపడుతుంది. అలాగే పొదుపు.. పెట్టుబడులైనా పక్కా ప్రణాళిక ఉంటేనే, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ దూసుకెడితేనే లక్ష్యాలను (గోల్స్) సాధించగలిగేది. ఇందుకోసం ఫుట్‌బాల్ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అలాంటివే కొన్ని...
ఫుట్‌బాల్ టీమ్‌లో ఉండే 11 మంది ఆటగాళ్లు ఒక్కొక్కరూ ఒక్కొక్క పాత్ర పోషిస్తుంటారు. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లే బాధ్యత కొందరిదైతే.. వారికి సహాయం అందించే బాధ్యత మరికొందరిది. గోల్‌పోస్ట్‌ను కాపాడుకునే బాధ్యత గోల్‌కీపర్‌ది. విజయ సాధనలో వీరందరూ కీలకమే. ఇలా ప్రత్యేకమైన కూర్పుతో.. ప్రత్యర్థి జట్టుపై గెలుపు సాధించేందుకు ఒక్కొక్క టీమ్ ఒక్కొక్క వ్యూహం ప్రకారం ముందుకెడుతుంది. కొన్నిసార్లు దూకుడుగాను.. మరికొన్ని సార్లు రక్షణాత్మకంగాను ఆడుతూ పరిస్థితికి తగ్గట్లు వ్యూహం మార్చుకుంటూ ఉంటుంది.
ఆర్థిక ప్రణాళిక సాధన కూడా ఇలాంటిదే. ఫుట్‌బాల్ టీమ్‌లో రకరకాల ప్లేయర్స్ ఉన్నట్లుగానే మన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో కూర్పులో కూడా వైవిధ్యం ఉండాలి. పెట్టుబడులకు సంబంధించి ఫిక్సిడ్ డిపాజిట్లనీ, షేర్లనీ, రియల్ ఎస్టేట్ అనీ వివిధ రకాల సాధనాలు ఉన్నాయి. వీటిలో ఎఫ్‌డీల్లాంటివి రక్షణాత్మకమైనవి కాగా షేర్లులాంటివి కాస్త రిస్కీ సాధనాలు.
లక్ష్యాలను సాధించడంలో ఇవన్నీ కూడా కీలకపాత్ర పోషిస్తాయి. దేనికదే ప్రత్యేకం. అలాగని పోర్ట్‌ఫోలియోను మరీ షేర్లతో నింపేసినా.. లేదా పూర్తిగా ఎఫ్‌డీలపైనే ఆధారపడినా ఆశించిన ఫలితాలను దక్కించుకోలేం. కాబట్టి..ఫుట్‌బాల్ టీమ్‌లాగానే పోర్ట్‌ఫోలియో కూర్పు ముఖ్యం. ఎంత మేర రిస్కు భరించగలం అన్నదాని ఆధారంగా ఏయే సాధనాల్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేయడం అన్నది ఆధారపడి ఉంటుంది.
సమయం కీలకం..
ఫుట్‌బాల్ మ్యాచ్ గంటన్నరలో అయిపోతుంది. ఆ గంటన్నరలో ఫలితం తేలకపోతే.. మరికాస్త సమయం మాత్రమే ఉంటుంది. మొత్తం వరల్డ్ కప్ టోర్నమెంటు ఒక నెలరోజుల్లో ముగిసిపోతుంది. కానీ, ఈ టోర్నమెంటు కోసం టీమ్స్ ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేస్తాయి. ఎన్నెన్నో వ్యూహాలు రూపొందించుకుంటాయి. పెట్టుబడుల తీరు కూడా ఇలాంటిదే. ఉన్న కాస్త సమయంలోనూ రిటైర్మెంట్ వంటి అవసరాలకు కావాల్సిన డబ్బు సమకూర్చుకోవాలంటే దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. ధరల పెరుగుదలను మించి సంపదను వృద్ధి చేసే పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాలి. ఇందుకోసం పోర్ట్‌ఫోలియోలో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటికి కొంతైనా చోటు కల్పించాలన్నది నిపుణుల సూచన. అయితే, ఎవరో చెప్పారని గుడ్డిగా పోకుండా వాటి గురించి క్షుణ్నంగా తెలుసుకునేందుకు కాస్తంత కసరత్తు చేస్తేనే సత్ఫలితాలు ఉంటాయి.
అనుకోని పరిస్థితులకు సంసిద్ధంగా..
ఎంత కసరత్తు చేసి, ఎంతగా సిద్ధం అయినా.. కొన్ని సార్లు ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటికి తగ ్గట్లుగా అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. కోస్టారికా జట్టుతో జరిగిన పోటీలో నెదర్లాండ్స్ కోచ్ చేసినదిదే. నిర్ణీత సమయంలో ఫలితం రాకపోవడంతో పెనాల్టీ షూటవుట్ తప్పనిసరైంది. ప్రత్యర్థి దాడుల నుంచి గోల్‌పోస్ట్‌ను రక్షించుకునే క్రమంలో ప్రధాన గోల్‌కీపర్‌ని పక్కనపెట్టి రెండో గోల్‌కీపర్ క్రూల్‌ను రంగంలోకి దింపాడు నెదర్లాండ్స్ కోచ్. ప్రధాన గోల్‌కీపర్ కన్నా క్రూల్ ఎత్తు రెండంగుళాలు ఎక్కువ ఉండటమే ఇందుకు కారణం. ఇదే మ్యాచ్‌లో టర్నింగ్‌పాయింట్ అయింది. ఏకంగా 2 గోల్స్‌ని ఆపి నెదర్లాండ్స్‌ను సెమీఫైనల్స్‌కి చేర్చడంలో క్రూల్ కీలకపాత్ర పోషించాడు. పెట్టుబడుల తీరూ అప్పుడప్పుడు ఇలాగే ఉంటుంది.
మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన చేతిలో లేని అంశాల కారణంగా కొన్ని సార్లు ఎదురుదెబ్బలు తగలొచ్చు. కాబట్టి, ఎప్పుడైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అప్పటిదాకా అమలు చేసిన ప్రణాళికను సవరించుకుని, కొత్త వ్యూహం అమలు చేయగలిగేలా సంసిద్ధంగా ఉండాలి.
పోర్ట్‌ఫోలియోలు ఇలా..
ఫుట్‌బాల్ టీమ్‌లో స్ట్రైకర్స్, మిడ్‌ఫీల్డర్స్, డిఫెండర్స్ అని ప్లేయర్స్ ఉంటారు. టీమ్‌లు ఎటాకింగ్ అనీ డిఫెండింగ్ అనీ రకరకాల వ్యూహాలు పాటిస్తుంటాయి. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోకి దీన్ని అన్వయించుకుంటే.. యుక్తవయస్సులో వారికి ఒకలాగా .. మధ్యవయస్కులకు ఒకలాగా .. రిటైర్మెంట్‌కి దగ్గర్లో ఉన్న వారికి ఒకలాగా ఉంటుంది. వయస్సు, ఎంత రిస్కు తీసుకోగలం అన్న దాన్ని బట్టి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో ఆధారపడి ఉంటుంది.
యుక్తవయస్సులో ఉన్న వారు కాస్తంత ఎక్కువ రిస్కు తీసుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. ఒకవేళ ఏదైనా నష్టం వచ్చినా, మళ్లీ తేరుకుని నిలదొక్కుకునేందుకు వారికి సమయం ఉంటుంది. కాబట్టి యుక్తవయస్సులో ఉన్నవారు.. ఎటాకింగ్ ధోరణిలో తమ పోర్ట్‌ఫోలియోలో సింహభాగం షేర్లు, ఫండ్స్ లాంటి వాటికి కేటాయించవచ్చు. వాటికి ఊతంగా ఉండేందుకు కొంత మొత్తాన్ని సురక్షితమైన సాధనాలకు కేటాయించవచ్చు. అదే మధ్యవయస్కులూ.. మరీ ఎక్కువ రిస్కు తీసుకోవడానికి ఇష్టపడని వారూ పోర్ట్‌ఫోలియో సమతూకంగా ఉండేలా చూసుకోవచ్చు.
షేర్లూ, బాండ్లూ, ప్రావిడెంట్ ఫండ్ లాంటివాటికి తలా కాస్త నిధులు కేటాయించవచ్చు. ఇక రిటైర్మెంట్‌కి దగ్గరగా ఉన్న వారు, రిస్కును అస్సలు ఇష్టపడని వారు సురక్షితమైన సాధనాలకు మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చుకోవచ్చు. దీని వల్ల పెట్టుబడులకు పెద్దగా నష్టం ఉండదు. అలాగని భారీ రాబడులూ ఉండవు.
పక్కా వ్యూహంతో లాభాల గోల్స్
Published Fri, Jul 11 2014 10:49 PM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM
Advertisement