
ఆంధ్రోద్యమం
ఆంధ్రోద్యమానికి నాంది గుంటూరులో జరిగిన ఒక చిన్న సంఘటన అని చరిత్రకారులు చెబుతారు.
ఆంధ్రోద్యమానికి నాంది గుంటూరులో జరిగిన ఒక చిన్న సంఘటన అని చరిత్రకారులు చెబుతారు. 1911లో గుంటూరు సబ్‌జడ్జి ఒకాయన కోర్టులో దఫేదారు ఉద్యోగానికి అర్హత గల తెలుగువాళ్లు ఎందరో ఉన్న తన స్వంతవూరు కుంభకోణం నుండి ఒక తమిళుడిని పిలిపించి ఇచ్చాడట. దాంతో ఒళ్లు మండిన కొందరు విద్యావంతులైన యువకులు ఆంధ్రోద్యమానికి బీజం వేశారట.
ఆనాటి పరిస్థితులను ఒకసారి పరిశీలిద్దాం
బ్రిటిష్ పాలనలో దేశమంతా పరుల కింద అణుగుతుంటే మన తెలుగువాళ్ల స్థితి ఇంకొక మెట్టు కిందే. ఇక నిజాం పాలనలోని తెలంగాణలో పరిస్థితి ఇంకా పదిమెట్లు కిందననే చెప్పాలి. నైజాం రాష్ట్రం జనాభాలో 65 శాతం తెలుగువారైతే ఉన్నతోద్యోగులలో మనవాళ్లు నామమాత్రంగా కూడా లేరు.
1914లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో రాసిన వివరాలు ఇలా ఉన్నాయి: ‘నిజాం రాష్ట్రంలో తెలుగువాళ్లు సామాజికంగా ఏ మాత్రమూ ఎదిగినట్లు కనిపించరు. హైకోర్టు జడ్జి పదవికి ఒక్క తెలుగువాడిని కూడా నియోగించలేదు. పెద్ద ఉద్యోగాలలో అయితే లేనే లేరు. చివరికి హైకోర్టు వకీళ్లలో కూడా ఉన్నారనేది అనుమానమే. 1895లో స్థాపించిన లెజిస్లేటివ్ కౌన్సిళ్లలో ఇంత వరకూ ఒక్క తెలుగువాడికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వబడలేదు’
ఒక సభగానీ సంఘంగానీ పెట్టుకుని తమ సమస్యలను చర్చించేందుకు, భావ వ్యక్తీకరణకు స్వేచ్ఛ లేదు. కనీసం ఒక గ్రంథాలయమో, పాఠశాలో స్థాపించాలంటే అనుమతి లేదు. ప్రభుత్వ కార్యకలాపాలే కాదు, గ్రామాల్లో వ్యవహారాలు కూడా ఉర్దూ, మరాఠీలలో జరిగేవి. 1921లో తెలంగాణ తెలుగువారిలో అక్షరాశ్యత 3 శాతం కంటే తక్కువ.
తెలంగాణతో పోలిస్తే కోస్తా, సీడెడ్ జిల్లాలలో పరిస్థితి కాస్త మెరుగే. వ్యవసాయం, నీటిపారుదల సౌకర్యాలు, రోడ్లు, రైలు మార్గాలు కాస్తో కూస్తో అభివృద్ధి చెందాయి. చదువు సంధ్యలకి అవకాశాలు పెరిగాయి. యూనివర్సిటీ మద్రాసులో ఉన్నా ప్రతి పట్టణంలో ఉన్నత విద్యాలయాలు వెలిశాయి. కానీ ఆంధ్రులకి ఉద్యోగావకాశాలలో చిన్నచూపు ఎదుర్కోక తప్పదు. ఉన్నతోద్యోగాలలో తమిళులదే ప్రాబల్యం. అసలు ఆంధ్రులు వెనుకబడ్డజాతి అనే భావన ఆనాటి తెలుగువాళ్ల రాతల్లో కూడా కనిపిస్తుంది.
ఏప్రిల్ 15, 1911 హిందూ పత్రిక ‘లెటర్స్ టూ ది ఎడిటర్’లో ‘తెలుగువాళ్లు వెనుకబడ్డవాళ్లా’ అనే శీర్షికతో వెలువడ్డ ఉత్తరం ఒకటి మొట్టమొదటిసారి తెలుగువారి పరిస్థితిని సంఘంలోని విద్యావంతుల దృష్టికి తెచ్చింది. తమిళుల్లోలాగా తెలుగువారిలో ప్రఖ్యాతి చెందిన వ్యక్తులు లేరని, ఆంధ్రులకి ఒక సంస్కృతీ, నాగరికత లేవని, ఒక తమిళ పెద్దాయన అన్న మాటలకి కోపం వచ్చి రాసిన ఉత్తరం అది. దానికి స్పందిస్తూ దేశాభిమాని పత్రికలో చల్లా శేషగిరిరావు అనే యువకుడు ఉద్యోగాలలో తమిళుల ఆధిక్యతని స్టాటిస్టిక్స్ ద్వారా వివరించాడు. అందులో వివరాలు కొన్ని ఇలా ఉన్నాయి.
దాంతో కొంచెం అగ్గి రాజుకుంది. అదే సంవత్సరం డిసెంబర్లో బ్రిటిష్ సామ్రాట్, ఢిల్లీ దర్బారులో హిందీ మాట్లాడే బీహారుకి ప్రత్యేక రాష్ట్రం సమంజసమే అంటూ వైస్రాయ్‌కి సిఫారసు చేశారు. దానితో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సమంజసమే కదా అనే భావన బలపడసాగింది. అంతే. సంవత్సరం తిరగకుండా ఆంధ్రమహాసభ ఆవిర్భవించింది. అయితే ఒకేసారి తెలుగువారందరిలో ఏకాభిప్రాయం వచ్చిందనలేము. ప్రత్యేకరాష్ట్రం వద్దన్న ప్రముఖులూ ఎందుకొచ్చిందిలే అని మిన్నకున్నవారూ తమిళులతో మనకు పోటీయా అనుకున్న నిరాశావాదులూ ఉన్నారు. ఈ మధ్యలో జాతీయోద్యమం రంధిలో ఆ విషయమే దాదాపు మర్చిపోయారు. అప్పుడప్పుడూ ఊపొచ్చినా తెలుగు జిల్లాల నుండి మద్రాసుకు వచ్చే ఆదాయాన్ని వదులుకోలేని ప్రభుత్వం నుండి అనేక ఆటంకాలు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం ప్రత్యేక తెలుగు రాష్ట్రానికీ స్వాతంత్రానికీ ముడి పెట్టి వాయిదాలు వేసి వేసి చివరకు పొట్టి శ్రీరాములు ఆత్మర్పణ వల్ల ఆంధ్రరాష్ర్టం 1953లో వచ్చింది.