ఇద్దరు కూతుళ్లు..  తప్పు నాన్నా | Ram Vilas Paswan for remark against Rabri Devi | Sakshi
Sakshi News home page

ఇద్దరు కూతుళ్లు..  తప్పు నాన్నా

Published Fri, Jan 18 2019 1:08 AM | Last Updated on Fri, Jan 18 2019 8:41 AM

Ram Vilas Paswan for remark against Rabri Devi - Sakshi

తండ్రి పేరు రొనాల్డ్‌ ఫెంటీ. కూతురి పేరు రాబిన్‌  రిహానా ఫెంటీ. తండ్రికి ఎంటర్‌టైన్‌మెంట్‌ బిజినెస్‌ ఉంది. ‘ఫెంటీ ఎంటర్‌టైన్‌మెంట్‌’. కూతురికి బ్యూటీ బిజినెస్‌ ఉంది. ‘ఫెంటీ బ్యూటీ’. ఈ పేర్లు, బిజినెస్‌ పేర్లు అలా ఉంచితే.. రిహానాకు గాయనిగా, బిజినెస్‌ ఉమన్‌గా, దౌత్యవేత్తగా, డాన్సర్‌గా, పాటల రచయిత్రిగా మంచి పేరుంది. ఆ పేరు ఆమె ఫెంటీ బిజినెస్‌ బ్రాండ్‌ వాల్యూని అమాంతం పెంచేసింది. ఫెంటీ లిప్‌స్టిక్‌లు, ఫెంటీ లోదుస్తులు అంటే అమ్మాయిలకు పిచ్చి. ఫెంటీ అనే ఇంటి పేరు ఈ కూతురికి ఆ తండ్రి ఇచ్చిందే అయినా, తన ‘ఫెంటీ’ బ్రాండ్‌ పేరును తండ్రి అతడి ఎంటర్‌టైన్‌మెంట్‌ బిజినెస్‌కి వాడుకోవడం రిహానాకు నచ్చలేదు. ఆమెకు మాటైనా చెప్పకుండా, ఆమె పేరు చెప్పి కోటీ యాభై లక్షల డాలర్ల ‘టాలెంట్‌ హంట్‌’ టూర్‌ డీల్‌ కుదుర్చుకున్నాడు. ‘మా అమ్మాయి వచ్చి పెర్‌ఫార్మ్‌ చేస్తుంది’ అని మాట కూడా ఇచ్చేశాడు.

‘‘అదేంటి డాడీ..’’ అంటే, ‘‘రెండు బిజినెస్‌లూ మనవే కదమ్మా’’ అన్నాడు. రిహానాకు తండ్రి తీరు నచ్చలేదు. ‘‘ఇంటి పేరు మీరిచ్చిందే కావచ్చు. బ్రాండ్‌ పేరు నేను సంపాదించుకున్నది నాన్నా’’ అంది. అని ఊరుకుంటుందనే అనుకున్నాడు ఆ తండ్రి. కానీ ఆ కూతురు కోర్టుకు వెళ్లింది. తన తండ్రి తన బ్రాండ్‌ నేమ్‌ను వాడకుండా నిరోధించాలని రిహానా కేస్‌ ఫైల్‌ చేసింది. ఈ బార్బడోస్‌ గాయని ఆస్తుల ప్రస్తుత విలువ 26 కోట్ల డాలర్లు. ఆస్తుల విలువ ఎంతని కాదు, మనిషిగా మన విలువ ఎంతో అది ముఖ్యం అంటోంది రిహానా! ఇంకో అమ్మాయి పేరు ఆశ. ఆ అమ్మాయి తండ్రి పేరు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌. కేంద్ర మంత్రి. లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు. ఆ తండ్రికి వ్యతిరేకంగా ఈ కూతురు బిహార్‌ రాజధాని పాట్నాలో ధర్నాకు కూర్చుంది. ‘‘పాశ్వాన్‌ తక్షణం క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్‌ చేసింది. నాన్న కదా అనుకోలేదు.

‘పాశ్వాన్‌’ అనే అనింది! ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు కొందరు మహిళలతో కలిసి వచ్చి లోక్‌ జనశక్తి పార్టీ ఆఫీసు బయట ఆశా బైఠాయించింది. ‘‘పాశ్వాన్‌.. క్షమాపణ చెప్పండి’’ అనే ప్లకార్డ్‌ ఆమె చేతిలో ఉంది. ఆర్జేడీ నాయకురాలు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని ‘అంగూఠా ఛాప్‌’ అని కామెంట్‌ చేశారు పాశ్వాన్‌. చదువులేని మనిషి అని అర్థం ఆ మాటకు. ఆ మాట నచ్చలేదు ఆశాకు. తండ్రి అనడం అసలే నచ్చలేదు. ‘‘ఇది ఒక మాజీ ముఖ్యమంత్రిని మాత్రమే అవమానించడం కాదు, నాతో సహా రాష్ట్రంలోని మహిళలందర్నీ అవమానించడమే’’ అని ఆశా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్‌ ఇస్తూ ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆర్జేడీ పార్టీ వ్యతిరేకించింది. ‘‘వాళ్లకు నినాదాలివ్వడం, చదువురాని వాళ్లను ముఖ్యమంత్రిని చెయ్యడం మత్రమే తెలుసు’’ అని ఎవర్నీ పేరు పెట్టి అనకుండా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాశ్వాన్‌ విమర్శించారు.

‘‘ఇలా అనడం తప్పు. రబ్రీదేవికి పాశ్వాన్‌ క్షమాపణ చెప్పాలి’’ అన్నది ఆశా డిమాండ్‌. కూతురు డిమాండ్‌ చేసింది కదా అని పాశ్వానేమీ రబ్రీదేవికి అపాలజీ చెప్పలేదు. బహుశా ఆ వివాదం పార్టీ ఆఫీసు నుంచి పాశ్వాన్‌ ఇంటికి మరలి ఉండాలి. పాశ్వాన్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు. ఉష, ఆశ ఆయన మొదటి భార్య రాజ్‌కుమారి కూతుళ్లు. ఇంకో కూతురు ఈష, కొడుకు చిరాగ్‌ రెండో భార్య రీనా సంతానం. ఆశా భర్త అనిల్‌ సాధు. 2015లో బిహార్‌లోని బొచ్ఛాన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లోక్‌ జన శక్తి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొన్ని నెలలకు ఆర్జేడీలో చేరి, ఆ పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు అయ్యారు. లాలూ ప్రసాద్‌ అడిగితే కనుక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తన తండ్రిపై పోటీగా హాజీపూర్‌ బరిలో నిలిచేందుకు ఆశ సిద్ధంగా ఉన్నారు. గట్టి అమ్మాయే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement