
రాంబాంబులు
మా రాంబాబుగాడు హడావుడిగా బయటి నుంచి వచ్చాడు.
మా రాంబాబుగాడు హడావుడిగా బయటి నుంచి వచ్చాడు. వచ్చీరావడంతోనే... ‘‘ఆ శ్రీహరికోట సైంటిస్టులతో మాట్లాడే మార్గం ఏదైనా ఉందా?’’ అని అడిగాడు. ‘‘ఇప్పుడు వాళ్లెందుకురా అని అడిగాను నేను. ‘‘మార్స్ మీదికి మరింత చవగ్గా రాకెట్‌ను పంపించేందుకు అవసరమైన డీజిల్ తీసేందుకు షార్ట్‌కట్ కనిపెట్టా’’ అన్నాడు వాడు. ‘‘అదెలా? అసలు రాకెట్‌లో డీజిల్ వాడరేమో?’’ ‘‘బయోడీజిల్‌ను జెట్రోఫా అనే మొక్క నుంచి తీస్తారట. మొక్కపేరులో ‘జెట్’ అనే మాట ముందే ఉంది కాబట్టి దాన్ని రాకెట్‌జెట్స్‌కు ఇంధనంగా వాడవచ్చు. సైంటిస్టులు ఉన్నది ఎందుకు? మనం ఐడియా చెబుతాం. దాన్ని అందుకొని, అల్లుకుపోయి మరింత పరిశోధించాల్సింది వాళ్లే కదా?’’ అన్నాడు వాడు.
‘‘ఇంతకూ నువ్వు కనిపెట్టిన ఐడియా ఏమిట్రా?’’ అడిగాను నేను. ‘‘ఏం లేదు... కందిపప్పు నుంచి ఇంధనం తీస్తే అది స్పేస్‌లోకి మరింత దూరం తీసుకెళ్తుందేమోనని నా ఐడియా’’ అన్నాడు. ‘‘రాకెట్‌లా ఉందిరా నీ ఐడియా... ఇలాగైతే మార్స్ మీదకి ఏం ఖర్మ, డెరైక్ట్‌గా శనిగ్రహం వరకు పంపవచ్చు.’’ వ్యంగ్యంగా అన్నాన్నేను. ‘‘మరి... నా ఐడియాలంటే ఏమనుకున్నావు. మొన్న మా ఇంటి పక్కావిడ వచ్చి వాళ్లాయనని తెగ తాగుతున్నాడని చాలా బాధపడింది. తాగుడు చిచ్చుబుడ్డి లాంటిదని చెప్పా. మొదట జివ్వున వెలుగులు చిమ్మినట్టే ఉంటుంది. కానీ అది లివర్‌కు చిచ్చుపెడుతుందని చెప్పా. నా మాటలకు ఆయన బుర్ర భూచక్రంలా గిర్రున తిరిగింది. అంతే... చిచ్చుబుడ్డిలో చిచ్చును పొయ్యిమీదకూ... బుడ్డీని వాళ్లు బుజ్జిగాడు కాల్చే తారాజువ్వను నేరుగా ఆకాశంలోకి పంపడానికీ ఉపయోగించారు తెల్సా’’ అన్నాడు వాడు. ‘‘అబ్బా!’’ అన్నాను నేను.
‘‘కొన్ని బాంబులు చీదేశాయని మాట ఎందుకు అంటారో పరిశోధించి తెలుసుకున్నా. ఎందుకంటే వాటిపై నీళ్లు పడి వాటికి జలుబుచేస్తుంది. దాంతో అవి చీదేస్తాయి. అంతేకాదురా... కొన్ని పదాలు బాంబుల నుంచి పుట్టాయేమోనని నాకు డౌటు’’ అంటూ ఔటు పేల్చాడు. దాంతో నేను... ‘‘సెలవివ్వురా...!’’ అన్నాను. వాస్తవానికి నా ఉద్దేశం ఏమిటంటే మాటలకు బ్రేకిచ్చి నాకు సెలవివ్వమని. కానీ వాడు ఇంకా చెప్పమన్నట్టుగా అర్థం చేసుకొని ఇంకా రెచ్చిపోయాడు.‘‘బాంబులు పేలగానే కలిగే ఫీలింగ్‌కు బెంబేలు అన్న పదం ఒనమాటోపోయెటికా అని నా ఉద్దేశం. అంటే శబ్దాన్ని బట్టి వచ్చిన మాట అని అర్థం’’ అన్నాడు వాడు. ‘‘బాగుందిరా... నీ వ్యుత్పత్తి బాగుంది. నీ మాటలకూ, నీ ఫ్రెండ్‌షిప్‌కూ మధ్య గోలీసోడాకూ, దాని ఓపెనర్‌కూ మధ్య రబ్బర్‌లా నలిగిపోతున్నాను’’ అన్నాన్నేను.
‘‘అన్నట్టు... టైమ్‌కు గుర్తు చేశావ్... ఆ శబ్దం అచ్చం కీచుపిట్ట బాంబులా ఉంటుందిరా’’ అన్నాడు వాడు.‘‘ఒరేయ్... నీ ఫ్రెండ్‌షిప్ వల్ల నేనూ తెగ లాభపడిపోతున్నాను. నీ ఐడియాలు ఆ టైమ్‌కు చేదుగా ఉన్నా... చక్కెర ఉన్నవాడికి కాకరలాగా ఉపయోగపడతాయి’’ అన్నాను. ‘‘కాకర అంటే గుర్తొచ్చింది. ఎన్ని టపాసులు కొన్నా అన్నింటినీ వెలిగించడానికి కాకరపువ్వొత్తి ఉండాల్సిందే. ప్రతి దాన్నీ వెలిగించే గుణం దానిలో ఉంటుంది’’ అన్నాడు మా రాంబాబు. ‘‘ నీ ఐడియాలు విన్న తర్వాత తెలిసిందిరా... వాటని క్రాకర్స్ అని ఎందుకంటారో. నీ ఆలోచనల్లా అవి కాంతిలోనే వింతవింత లైట్స్ విరజిమ్ముతుంటాయి’’. ‘‘ఇప్పుడు దారిలోకి వచ్చావ్...’’ అంటుండగా అసలు విషయం చెప్పాన్నేను. ‘‘క్రాకర్స్ అంటే నీకు ఉన్న క్రాక్... మాకు కర్స్ అని అర్థం’’ అంటూ రివ్వున అక్కడి నుంచి వెళ్లిపోయాను.
- యాసీన్