ఆమె ఓ ఆర్కిటెక్ట్. లక్షల రూపాయలు ఆర్జించే అవకాశం ఉన్న తన కెరీర్‌కే పరిమితమై పోకుండా భావితరాలకు విలువైన నీటి బొట్టును ఒడిసిపట్టి అందించేందుకు జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. తరిగిపోతున్న జలసంపదను పది కాలాల పాటు నిల్వచేసేందుకు వినూత్న డిజైన్లు రూపొందించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ననలు పొందారు. ప్రధాని సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణకు అర్హత సాధించిన ఏడుగురిలో ఒకరిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమే కల్పనా రమేశ్.
హైదాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు కల్పనా రమేష్. సాహె (సొసైటీ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్) సంస్థను స్థాపించి దశాబ్దకాలంగా వర్షపునీటి సంరక్షణకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు.
ప్రధాని దృష్టి
నేను రూపొందించిన వర్షపు నీటి సంరక్షణ డిజైన్లు, చేపడుతున్న అవగాహన కార్యక్రమాలపై సోషల్ మీడియా వేదికగా కొన్ని గ్రూపులకు చెందినవారు దేశవ్యాప్తంగా ఆయా గ్రూపుల్లో పోస్ట్ చేయడంతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ట్యాగ్‌చేశారు. దీంతో ప్రధానమంత్రి కార్యాలయ ‘మై గౌ’ సైట్ సీఈఓ మార్చి 6న నాకు ఫోన్‌చేసి పీఎం సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణకు మీరు అర్హత సాధించారని చెప్పడంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. ఈ గుర్తింపు నా బాధ్యతను మరింత పెంచింది. నేరుగా ప్రధాని నరేంద్రమోడీకి సంబంధించిన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సైట్లలో నేను సమాచారాన్ని పొందుపరిచే అవకాశం ఉండదు. మైగౌ సైట్ సీఈఓకు సమాచారం చేరవేస్తే వారు నేను అందించే సమాచారాన్ని పరిశీలించి నా తరఫున ఆయా సైట్లలో నేను కోరిన సమాచారాన్ని పోస్ట్‌చేస్తారు. ఈ విధానంలో నా ఆలోచనలు, డిజైన్లు కోట్లాదిమందికి చేరతాయని సంతోషంగా ఉంది.
విస్తృత అవగాహన
గత మూడేళ్లుగా వర్షపునీటి సంరక్షణపై 150కి పైగా అవగాహన కార్యక్రమాలు, 50 ప్రత్యేక చర్చాగోష్ఠులు నిర్వహించాం. తాజాగా హైదరాబాద్‌లోని సిల్వర్‌ఓక్ విద్యాసంస్థలో 6–8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వాననీటి సంరక్షణపై రెండునెలలు క్లాస్‌రూమ్‌లో, మరో రెండు నెలలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాం. వాళ్లు వెళ్లి ఇళ్లు, కాలనీల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవలే మజీద్ బండ (కొండాపూర్) ప్రాంతంలో కొడికుంట చెరువును మా సాహె సంస్థ దత్తతకు తీసుకుంది. ఈ చెరువులోకి వర్షపునీరు చేరే ఇన్‌ఫ్లో ఛానల్స్‌ను ప్రక్షాళన చేస్తోంది. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇళ్లు, కార్యాలయాల విస్తీర్ణం, నిర్మాణ డిజైన్లను బట్టి వాననీటి సంరక్షణ పిట్స్‌ను మేము డిజైన్ చేస్తున్నాం. నా స్వస్థలం బెంగళూరు. ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ చేశాను. విద్యాభ్యాసం అక్కడే సాగింది. కానీ గత 20 ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో ఉంటున్నాం. ఇప్పుడు ఇదే నా ఓన్‌సిటీ. ఇక్కడే వర్షపునీటి సంరక్షణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాను. నా భర్త రమేష్ లోకనాథన్‌ది సాఫ్ట్‌వేర్ రంగం. ఆయన సహాయ సహకారాలు కూడా నాకెంతగానో ఉన్నాయి.
వర్షపు నీటి నిల్వపై క్షేత్రస్థాయిలో పిల్లలకు అవగాహన
భవిష్యత్ లక్ష్యం
‘చినుకు.. చినుకు ఒడిసిపట్టు.. భావితరాలకు దాచిపెట్టు’ అన్న నినాదంతో వర్షపునీటిని ఒడిసిపట్టే కృషిలో నిర్విరామంగా పనిచేస్తున్నాను. భవిష్యత్‌లో నా సేవలు, డిజైన్లు ప్రధాని సోషల్‌మీడియా అకౌంట్ల ద్వారా కోట్లాదిమందికి చేరనున్నాయి. ఈ జలయజ్ఞంలో ప్రతీ భారతీయుడు భాగస్వామి కావాలన్నదే నా లక్ష్యం.. నా స్వప్నం. కాంక్రీట్ మహారణ్యంలా మారిన నగరాల్లో వర్షపునీటిలో 80 శాతం వృథా అవుతోంది. ఇందులో 50 శాతం ఒడిసిపట్టినా నీటి కరువు ఉండదన్నదే నా నిశ్చిభిప్రాయం’’అని ముగించారు కల్పన. – ఏసిరెడ్డి రంగారెడ్డి, సాక్షి, హైదరాబాద్
నీటి బ్యాంకు!
ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో తక్కువ ఖర్చుతో వర్షపునీటిని సంరక్షించుకోవచ్చు. ఇంటి పైకప్పుపై కురిసిన వర్షపునీటిని నేరుగా కింద ఉన్న నీటి సంపులో నింపుకోవాలి. ఇలా ఇంటి విస్తీర్ణాన్ని బట్టి 30 వేల నుంచి లక్ష లీటర్ల వరకు నిల్వచేయవచ్చు. ఇది నిండిన తరవాత ఓవర్‌ఫ్లో అయ్యే నీటిని ఎండిన బోరుబావిలోకి మళ్లిస్తే మీకు ఏడాదికి సరిపడా జలబ్యాంక్ అందుబాటులో ఉంటుంది. ట్యాంకర్ కష్టాలు లేకుండా చూసుకోవచ్చు. ఏడాదికి సుమారు 35–45 రోజుల పాటు వర్షం తప్పక కురుస్తుంది. ఇందుకోసం ఒకసారి రూ.15–రూ.25 వేల వరకు ఖర్చు చేస్తే సరిపోతుంది. ఉదా.. వెయ్యి చదరపు అడుగుల భవనం రూఫ్‌టాప్‌పై పడిన వర్షపు నీటిని ఒడిసిపడితే 70 వేల లీటర్ల జలబ్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి వందరోజుల పాటు సరిపోతాయి. ఇక 2000 చదరపు అడుగుల భవనానికి 1.40 లక్షల లీటర్లు, 3000 చదరపు అడుగుల భవనంపై కురిసిన నీటి ద్వారా 2.10 లక్షల లీటర్లు, 4000 చదరపు అడుగుల భవనానికి 2.80 లక్షల లీటర్ల జలబ్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు. కల్పన
Comments
Please login to add a commentAdd a comment