
పుణ్యప్రాప్తికి చిరునామా తరావీహ్ నమాజ్
రమజాన్ కాంతులు
ఆచరణకు అసలు ప్రేరణ అల్లాహ్, ఆయన ప్రవక్త (స)ను విశ్వసించడం. అయితే ఈ లక్షణంతో చేసే సదాచారాలన్నీ విశ్వాసం, చిత్తశుద్ధితో చేసినట్టే అవుతుంది. ఇక హదీసు భావం ఏమిటంటే, ఎవరయితే అల్లాహ్‌ను, ఆయన ప్రవక్త(స)ను విశ్వసించామని, వారు చూపించిన మార్గాన్ని ఎంచుకున్నామని, ఖుర్ ఆన్, హదీసుల్లో తరావీహ్ నమాజు చేయడం పుణ్యప్రదం అని పేర్కొనడం జరిగింది కాబట్టి ఆ పుణ్యాన్ని పొందేందుకు తరావీహ్ నమాజ్ చేస్తున్నానని భావించి చేస్తే అలాంటి వారు గతంలో చేసిన పాపాలు క్షమించబడతాయి.
అయితే తరావీహ్‌కు సంబంధించి కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొందరు రమజాన్ రాగానే చాలా ఉత్సాహంగా తరావీహ్ నమాజు చేస్తారు. వారి ఉత్సాహం కొద్ది రోజులు మాత్రమే కనబడుతుంది. . ఆ తరువాత మానేస్తారు. మరికొందరు ఐదారు రోజుల్లోనే ఖుర్‌ఆన్‌ను పూర్తిగా వింటారు.
ఇక తమకు తరావీహ్ నమాజు చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. ఇలాంటి వారు గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, ఇక్కడ రెండు సున్నత్‌లు వేర్వేరుగా ఉన్నాయి. ఖుర్‌ఆన్‌ను పూర్తిగా తరావీహ్ నమాజ్‌లో వినడం ఒక సున్నత్. రమజాన్ మాసం మొత్తం తరావీహ్ నమాజ్ చేయడం మరో సున్నత్. అంటే ఐదారు రోజుల్లో తరావీహ్ నమాజ్ చేసి మానేసిన వారు ఒక సున్నత్‌ను మాత్రమే పాటించి, మరో సున్నత్‌ను వదిలి పెడుతున్నారన్నమాట. ఎవరయితే ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారో లేదా పనుల వల్ల ఒకేచోట తరావీహ్ నమాజు చేయలేకపోతుంటారో అలాంటివారు కొన్ని రోజులలో ఖుర్‌ఆన్‌ను పూర్తిగా తరావీహ్‌లో వినాలి. ఆ తరువాత ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తరావీహ్ నమాజు చేస్తుండాలి. ఇలా రెండు సున్నత్‌లు కూడా ఆచరించినట్టే అవుతుంది. పనులకు కూడా భంగం కలగదు. పుణ్యం ప్రాప్తిస్తుంది. రమజాన్ మాసంలోనే కాదు... తరావీహ్ నమాజ్ వీలున్నప్పుడల్లా చేయడం పుణ్యప్రదం.