
మార్సిజం
ఎగిరి ఏ లోకాన ఉన్నాడో మన అంగారక యంత్రుడు, సెప్టెంబర్ నాటికి మార్స్‌ని చేరుకుంటాడని శాస్త్రవేత్తల అంచనా. చేరుకోవాలని ఇస్రోచైర్మన్ ప్రార్థన.
ఎగిరి ఏ లోకాన ఉన్నాడో మన అంగారక యంత్రుడు, సెప్టెంబర్ నాటికి మార్స్‌ని చేరుకుంటాడని శాస్త్రవేత్తల అంచనా. చేరుకోవాలని ఇస్రోచైర్మన్ ప్రార్థన. అంతా సక్రమంగానే ఉన్నా, ఏమో దైవకృప వక్రంగా చిన్న వంపు తిరిగినా, ఇంత శ్రమా వృథా అవుతుందని ముందే ఆయన వెంకన్నని వేడుకుని వచ్చినట్లున్నారు.
శాస్త్రజ్ఞులు, దైవజ్ఞులు ఎవరి తోవలో వారు తిరుగుతూ ఉంటారని అనుకుంటాం. అందుకే వారు అప్పుడప్పుడు డాక్టర్ కె.రాధాకృష్ణన్‌లా కక్ష్య తప్పడం మనకు వింతగా, విపరీతంగా అనిపిస్తుంటుంది. తప్పేం లేదు. అంగారక ప్రయాణానికీ, ఆధ్యాత్మిక ప్రయాణానికీ స్టీరింగ్ ఒక్కటే. తపన! అవతల ఏముందో తెలుసుకోవడం అంగారకం. అవతల ఎవరున్నారో తెలుసుకోవడం ఆధ్యాత్మికం. మరి తెలుస్తుందా? తెలియడం ముఖ్యం కాదు. తెలుసుకోవాలనుకోవడం ముఖ్యం.
మనుషులు చూడండి. పైపైకి ఎగబాగడానికి ఎంతగా తపిస్తున్నారో! ముప్పై వేల ఉద్యోగం నుంచి డెబ్బై వేలకు. అర ఎకరం నుంచి ఆరు ఎకరాలకు. అద్దె ఇంటి నుంచి సొంత డ్యూప్లెక్స్‌కు. ఇండియా నుంచి యు.ఎస్.కు. భూగ్రహం నుంచి అంగారక గ్రహానికి.
శాస్త్ర పరిశోధనలను అలా ఉంచండి. మామూలు మనుషులు కూడా మార్స్ మీదకు వెళ్లడానికి ఉత్సాహపడుతుండడం చూస్తుంటే అందరూ ఏ ఆధ్యాత్మిక ఆవరణంలోనో పరిభ్రమిస్తున్నట్లు అనిపిస్తుంది! ‘మార్స్ వన్’ ప్రాజెక్టు 2024లో ఇద్దరు మగవాళ్లను, ఇద్దరు ఆడవాళ్లను అంగారకుడి మీదకు తీసుకెళుతోంది. ఈలోపు అనేక రకాల పరీక్షలు పెట్టి అంతిమంగా ఆ నలుగురు అదృష్టవంతులను ఎంపిక చేస్తారు. ‘మార్స్ వన్’ అనేది ఈ ప్రయాణాన్ని ప్లాన్ చేసిన నెదర్లాండ్స్ ప్రైవేటు సంస్థ. ఇప్పటికి రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలోంచి తొలివిడత వడపోతలో వెయ్యి మంది ఔత్సాహికులను ఎంపిక చేశారు. అలా ఎంపికైన వారిలో అమెరికన్లు, కెనడియన్లు, ఇండియన్లు, రష్యన్లు ఎక్కువ మంది ఉన్నారు. సరే, వెళ్లినవాళ్లు తిరిగి భూమికి ఎప్పటికి చేరుకుంటారు? ఎప్పటికీ చేరుకోరు. అక్కడే ఒక కాలనీ ఏర్పాటు చేసుకుని. అందులోనే ఉండిపోతారు. వన్ వే టికెట్ అన్నమాట!
మార్స్‌లో భూవాతావరణం ఉండదు. కొద్దిగా గాలి ఉంటుంది కానీ అది పీల్చుకోడానికి అనువైనది కాదు. తాగడానికి నీళ్లుండవు. ధ్రువప్రాంతాలో, అదీ మట్టిదిబ్బల అడుగుభాగాన గడ్డకట్టి ఉండే మంచు ఏ విధంగానూ వాడకానికి పనికొచ్చేది కాదు. ఇక తిండి. ఆ ఊసే ఎత్తొద్దు. రేడియేషన్ అత్యధికంగా ఉంటుంది. ‘చచ్చిపోతున్నాం బాబోయ్’ అని అరిచినా భూమి నుంచి అందే సహాయం ఏదీ ఉండదు.
మరి అక్కడికి వెళ్లి ఏం చేస్తారు? అక్కడ ఉండి ఏం చేస్తారు? ఇదే ప్రశ్న ఒక బిబిసి విలేఖరి అడిగితే మార్స్ ప్రయాణానికి దర ఖాస్తు చేసుకున్న ఇండియన్ ఒకరు ఏమన్నారో తెలుసా? ‘‘భూమి కూడా అంతే కదా! ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? కారు ఆక్సిడెంట్‌లో నేను పోయినా పోవచ్చు. అలా నిరర్థకంగా మరణించడం నాకు ఇష్టం లేదు’’ అని!!
మనిషి ఎన్ని విధాల ఎంత ఎత్తుకు ఎదిగినా అంతిమంగా కూడా అతడు చేరుకోవలసినదేదో అంతకన్నా ఎత్తులో కవ్విస్తూనే ఉంటుంది. ఏమిటది? ఛేదించాలనుకున్న శాస్త్ర విజ్ఞానమా? సాధించాలనుకున్న దైవసాన్నిధ్యమా? లేక రెండూ కలిసే దారిలో ఏ అనుగ్రహమూ లేక రాలిపడే ఉల్కలా పొందే విశ్వైక్యమా? ఏమైనా ఇప్పటి తరానిది మార్సిజం. దైవమూ, శాస్త్రమూ కలగలిసిన సమతూక సిద్ధాంతం.