చైనా రాజధాని బీజింగ్‌లో ఎం.ఎం.ఎ. పోటీలు జరుగుతున్నాయి. ఎం.ఎం.ఎ అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’. శనివారం రితు ఫొగాట్, నామ్ హీ కిమ్ బరిలోకి దిగారు. ఇద్దరి మధ్య జరుగుతున్నది ‘టెక్నికల్ నాకౌట్’ పోటీ. రితు ఇండియా అమ్మాయి. నామ్ హీ కిమ్ దక్షిణ కొరియా అమ్మాయి. కుస్తీ మొదలైంది. మూడంటే మూడే నిముషాల్లో ఆట తేలిపోయింది. ఫలితం ఏమై ఉంటుంది? బరి బయట ప్రేక్షకులలో కూర్చుని ఉత్కంఠగా ఆట చూస్తున్నవారికి ఎలాగూ కళ్లెదుటే ఫలితం తెలిసిపోతుంది. అయితే ప్రేక్షకులలో కూర్చొని, ఆట చూడకుండా సెల్‌ఫోన్ చూసుకుంటున్న వారికి కూడా తెలిసిపోయింది!! ఎలా? అకస్మాత్తుగా ఎ.ఆర్.రెహమాన్ గొంతు.. ‘వందే మాతరం’ అని ఉవ్వెత్తున ఎగసింది.
అర్థమైపోదా.. రితు గెలిచిందని!! ఎం.ఎం.ఎ. ఆడటం రితుకూ ఇదే మొదటిసారి. అందులోని ‘ఆటమ్‌వెయిట్’ కేటగిరీలో పాల్గొని మూడు నిముషాల్లో ప్రత్యర్థిని నాకౌట్ చేసేసింది! 49, అంతకన్నా తక్కువ బరువు ఉన్నవారు ఆటమ్ వెయిట్ కేటగిరీలో ఆడతారు. రితు ఇప్పుడు గెలిచింది ఎం.ఎం.ఎ. లోని ‘వన్ చాంపియన్‌షిప్’ని! 2016 కామన్‌వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచి తొలిసారి ప్రపంచ క్రీడారంగం దృష్టిలో పడిన రితు ఈ ఏడాది ఫిబ్రవరిలో కుస్తీకి స్వస్తి చెప్పి, ఎం.ఎం.ఎ. ఫైటర్ అవడం కోసం శిక్షణ తీసుకుంది. రింగ్‌లోంచి బయటికి వచ్చాక రితు అన్నమాట : ‘‘వందశాతం ఇస్తానన్నాను. ఇచ్చాను’’ అని!
ఇస్తానన్నాను.. ఇచ్చాను
Published Mon, Nov 18 2019 3:43 AM | Last Updated on Mon, Nov 18 2019 3:43 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment