
జుబేదా, అలీ
అలీబాబానా! ఈ బాబా ఎవరు! ఊర్కే.. రైమింగ్ కోసం. మరి.. ఆ ఇరవై ఆరు?! టైమింగ్ కోసం. అలీకి పెళ్లై ఇరవై ఆరేళ్లయింది. అలీ ఒక్కరికే పెళ్లవడం ఏంటి? ఆవిడేమైపోయారు! ఉన్నార్లెండి.. పేరుకు ఇద్దరు అయినా.. ఒకరిగా.. ఒకరికొకరుగా ఉంటారు మరి. నవ్వులు అన్నారు.. అవేమిటి.... వాటికీ రైమింగ్, టైమింగ్ ఉందా? అవి ఉంటే సినిమా అయ్యేది. లేవు కాబట్టే.. చక్కటి దాంపత్యం అయింది. చదవండి.. మీ కోసం అలీ దంపతుల ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.
►ఈ 23తో మీ పెళ్లయి 26ఏళ్లు పూర్తవుతోంది. ఇన్నేళ్ల వైవాహిక జీవితం ఎలా గడిచింది?
అలీ: తెలియలేదు. 26 ఏళ్లుగా నీతో (భార్యని ఉద్దేశిస్తూ) కాపురం చేస్తున్నానా? అనిపిస్తోంది.
జుబేదా: అమ్మతో ఇన్నేళ్లు కలిసి ఉంటున్నారంటే మీకు అవార్డు ఇవ్వాలి నాన్నా అని మా పెద్దమ్మాయి అంటుంది (నవ్వుతూ).
అలీ: బేసిక్‌గా నాకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మా అమ్మ అంటే చాలా చాలా ఇష్టం. మా పెద్దక్క పేరు ఫాతిమా. తమ్ముడు నిద్రపోతున్నాడు కదా అని ఆవిడ ఉదయాన్నే నన్ను నిద్రలేపకపోయి ఉంటే నేను సినిమాల్లోకి వచ్చేవాడిని కాదు. మా అమ్మ తర్వాత అమ్మ మా పెద్దక్క. అందుకే మా ఆవిడకి ముందే చెప్పాను.. మనకు కొడుకు పుట్టినా, కూతురు పుట్టినా మా అక్క పేరు మొదట కానీ చివర కానీ ఉంటుంది అని. మాకు ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది. ‘ఫాతిమా’ అని పేరు పెట్టాం.
►మరి అలీగారు తన అక్క పేరు పెడతానంటే మీరు వెంటనే ఓకే అన్నారా?
జుబేదా: నాకు పదో తరగతి పూర్తవ్వగానే పెళ్లయిపోయింది. పిల్లలకు ఈ పేరు పెట్టాలనే సొంత ఆలోచన లేదు. మా అత్తగారు, మా ఆయన ఏది చెబితే అదే. ముఖ్యంగా అత్తగారు ఏం చెప్పినా నా మంచికే అనుకునేదాన్ని. పెళ్లికి ముందు మా అమ్మగారింట్లో నేను వంటగదిలోకి వెళ్లింది లేదు. ‘వంటతో మొగుడిని కొంగుకి కట్టేసుకోవచ్చు... నేర్చుకో’ అని మా అత్తగారు వంట నేర్పారు. పెద్దవాళ్ల దగ్గర ఎలా ఉండాలి? భర్తను ఎలా చూసుకోవాలి? వంటివన్నీ ఆమే నేర్పారు. మా అత్తగారు అలా అన్నీ చెప్పారు కాబట్టే ఈరోజు హాయిగా ఉన్నాను అనుకుంటున్నాను.
►ఇంతకీ అత్తగారు చెప్పినట్టు భర్తను కొంగున ముడేసుకున్నారా?
అలీ: మొదట్లో మా అమ్మ అంటే తనకు భయం ఉండేది. నేనన్నా భయమే. ఓ పదేళ్ల తర్వాత నాకు భయం మొదలైంది (నవ్వులు).
►26 ఏళ్లు అత్తగారితో ఉన్నారు. ఇప్పుడు ఆమె లేరు. ఎలా అనిపిస్తోంది?
జుబేదా: మా అత్తగారికి ముగ్గురు కూతుళ్లు ఉన్నప్పటికీ నన్ను కూడా ఓ కూతురిలా చూసుకున్నారు. నిజం చెప్పాలంటే మా అమ్మ దగ్గర నేనేమీ నేర్చుకోలేదు. అత్తగారి దగ్గర నేర్చుకున్న విషయాలతో మిగతా జీవితం గడిపేస్తాను. ఆవిడ మా మధ్యలేకపోయినా ఉన్నట్లుగా అనుకుంటా.
అలీ: మా పెళ్లయిన కొత్తలో ఎన్ని రోజులు అవుట్‌డోర్ షూటింగ్ ఉన్నా ఆలోచించకుండా వెళ్లిపోయేవాడ్ని. ఇప్పుడు పది రోజులు అవుట్ డోర్ షూటింగ్ అంటే వెళ్లడానికి ఆలోచిస్తున్నాను. అమ్మానాన్నలు ఉన్నారనే ధైర్యం, దీమాతో వెళ్లేవాడిని. ఇప్పుడు ఇద్దరూ లేరు. తనకు నేను, నాకు తను. మా ఇద్దరికీ మా ముగ్గురు పిల్లలు.
►మీ పెళ్లికి ముందు పెళ్లి చూపులేవీ జరగలేదట?
జుబేదా: పెళ్లయ్యేవరకూ మావారు నన్ను చూడలేదు. మా అత్తగారే నన్ను సెలెక్ట్ చేశారు.
అలీ: అమ్మాయి మీకు నచ్చిందా? అని మా అమ్మానాన్నని అడిగాను. నచ్చిందన్నారు. పెళ్లి చేసుకున్నాను. మా పెళ్లి జనవరి 23న అయితే ఫిబ్రవరి 11న ‘యమలీల’ ఓపెనింగ్. ఏప్రిల్ 28న సినిమా విడుదల. మా అమ్మానాన్న అత్తయ్య, మామయ్య అందరం కలసి సినిమా చూశాం. మంచి టాక్. అప్పటి వరకూ నాకు 30–40 శాతం ఫాలోయింగ్ ఉండేది. ఆ సినిమా తర్వాత 200 శాతం ఫాలోయింగ్ వచ్చింది. డ్యాన్స్, ఫైట్స్, ఎమోషన్... అలీ ఇవన్నీ బాగా చేయగలడని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డిగారు గ్రహించి నన్ను హీరోగా పెట్టి ‘యమలీల’ తీశారు. ఆ తర్వాత 53 సినిమాల్లో హీరోగా చేశాను. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ ఐదు భాషల్లో కలిపి 1100 సినిమాలకు పైగా కమెడియన్‌గా చేశాను.
►అలీగారి అక్కచెల్లెళ్లను, తమ్ముళ్లను మీరు బాగా చూస్తారు. మరి మీ తోడబుట్టినవాళ్లను?
జుబేదా: ప్రతి పండగకి మా రెండు వైపుల బంధువులందరూ కలుస్తాం. తన ఫ్యామిలీ వాళ్లనే చూసుకోవాలనే మనస్తత్వం కాదు ఆయనది. అందర్నీ ఒకేలా చూస్తారు. నా తోడబుట్టినవాళ్లను కూడా మావారే చదివించారు. వాళ్లు మంచి పొజిషన్‌లో ఉన్నారంటే మావారే కారణం. నా మొదటి తమ్ముడు మావారికి మేనేజర్‌గా చేస్తున్నాడు. రెండోవాడు చెన్నైలో ఎల్ అండ్ టీ కంపెనీలో మంచి పొజిషనల్ ఉన్నాడు. మూడోవాడు నాన్న బిజినెస్ చూసుకుంటున్నాడు. మా తమ్ముళ్లు మా ఆయన్ని బావలా కంటే నాన్నలానే చూస్తారు.
►నటుడిగా మంచి పేరు, డబ్బు సంపాదించుకున్నారు. మీ చిన్నప్పుడు మీ నాన్నగారు టైలర్‌గా చేసేవారు. బాల్యం ఎలా ఉండేది?
అలీ: మా అమ్మానాన్నలకు మేం ఆరుగురు సంతానం. మా నాన్నగారు టైలర్. మాకు బట్టలకు కొరత లేదు. మాకు నెలకోసారి కొత్తబట్టలు. సాధారణంగా ముస్లిమ్స్ అంటే నాన్–వెజ్ తింటారు. మా అమ్మానాన్న వారంలో మూడు నాలుగు రోజులు పిల్లలకు నాన్–వెజ్ పెట్టాలనుకునేవారు. నాన్నగారికి ఆదాయం బాగానే ఉండేది. దాంతో మాకు తిండికీ బట్టకూ కొరత ఉండేది కాదు. ఇక నా భార్య వచ్చిన తర్వాత ఇంటికి పెద్ద కోడలిగా ఆడపడుచులను, మరుదులను బాగా చూసుకుంటూ వచ్చింది. మా అమ్మ చనిపోయినా నా తమ్ముళ్లు అమ్మ తర్వాత అమ్మ వదిన ఉంది కదా అనుకుంటున్నారు.
►మీ పిల్లల గురించి?
అలీ: నా పెద్ద కూతురు ఫాతిమాకి డాక్టర్ అవ్వాలని కోరిక. నేను యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు మా అమ్మానాన్న ప్రోత్సహించారు. ఇప్పుడు నేను, మా ఆవిడ తనకు సపోర్ట్ చేస్తున్నాం. థర్డ్ ఇయర్ చదువుతోంది. కొడుకు అబ్దుల్ సుభాన్. మా నాన్నగారు చనిపోయిన పదేళ్లకు నేనో ట్రస్ట్ ఏర్పాటు చేశాను. మే 10న ట్రస్ట్ స్థాపించా. అప్పటికి మా ఆవిడ గర్భవతి. మే 12 మధ్యాహ్నం జనరల్ చెకప్‌కి వెళ్తే వెంటనే ఆపరేషన్ చేశారు. అబ్బాయి పుట్టాడు. అందుకే మా నాన్నగారి పేరు (అబ్దుల్ సుభాన్)ని వాడికి పెట్టా. ఆ ట్రస్ట్ ఇంకా నడుపుతున్నాను. ప్రతి రంజాన్‌కి 3 లక్షల రూపాయిలు తీసి పక్కన పెడతాను. సహాయం చేస్తాను.
జుబేదా: మొదటి పాప పుట్టినప్పుడు నాకు థైరాయిడ్ సమస్య వచ్చింది. ఇక పిల్లలు పుట్టరు అన్నారు. నమాజ్ చేశాం. పదేళ్ల తర్వాత పిల్లాడు పుట్టాడు. 8వ నెలకే పుట్టాడు బాబు. బాబు పరిస్థితి కష్టం అన్నారు. అందుకే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోలేదు. ఆ తర్వాత మూడో పాప పుట్టింది
►చిన్నప్పటినుంచి సినిమాలు చేస్తూ ఇప్పటికీ బిజీగా ఉన్నారు కదా.. కొంచెం రిలాక్స్ అవ్వాలి అనిపించడంలేదా?
అలీ: ఈ లైఫ్ నేను ఊహించలేదు. అందుకే రిలాక్సేషన్ గురించి ఆలోచించడంలేదు. అయితే మనకి ఒక వయసు ఉన్నప్పుడు ఎంత కష్టపడినా ఏం కాదు. వయసొచ్చాక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రాత్రే ఎందుకు నిద్రపోవాలని నిశ్చయించారంటే పగలంతా కష్టపడతాం. మన అవయవాలకు కూడా రెస్ట్ కావాలి. ఎక్కువ కష్టం పెడితే రిపేర్ రావచ్చు. ఎందుకు రిపేర్ తెప్పించుకోవాలి? అనుకుంటాను. అందుకే ముందే డే షూట్ ఎన్ని రోజులు, నైట్ షూట్ ఎన్ని? అని క్లియర్‌గా అడిగి తెలుసుకుంటాను. నేను మెంటల్లీ ప్రిపేర్ అవుతాను. ఇంట్లో చెప్పేస్తాను.
►ఒకసారి ఏదో పేపర్‌లో మీవారు రెండో పెళ్లి చేసుకున్నారని వచ్చిన వార్త చూసి, కంగారుపడ్డారట.. ఆ విషయం గురించి?
జుబేదా: పెళ్లయిన తర్వాత మా అమ్మవాళ్లు నన్ను తీసుకెళ్లారు. అప్పట్లో తారా సితార అనే మ్యాగజీన్ వచ్చేది. అందులో షూటింగ్ విశేషాలు, ఇంకా సినిమాల విశేషాలు చాలా వచ్చేవి. ఆ పత్రికలోనే అలీకి, శుభశ్రీకి పెళ్లయిందనే వార్త చదివాను. అయితే అది సినిమా సీన్ అని కింద ఉంది. అది చదవలేదు. ముందు మా నాన్నగారు చదివి బాగా కంగారు పడిపోయారు. నిన్ను ఇటు తీసుకురాగానే అక్కడ పెళ్లి చేసుకుంటున్నాడా? అని అన్నారు. నువ్వు వెంటనే బట్టలు సర్దుకో.. ఇంటికి వెళ్లు అన్నారు. నేనూ కంగారు పడ్డాను.
ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగానే మావారే డోర్ తీశారు. నిన్నే కదా వెళ్లావ్. అప్పుడే వచ్చేశావేంటి? అని అడిగారు. అదేం పట్టించుకోకుండా శుభశ్రీ ఎక్కడ? అని ఇల్లంతా వెతికాను. ఏంటి? వెతుకుతున్నావు అని అడిగారాయన. ‘పేపర్‌లో చూశాను.. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని’ అంటే, సరిగ్గా చదివావా? అని అడిగి ఆ పేపర్ చూపించారు. అప్పుడు షూటింగ్‌లో పెళ్లి సీన్ అని చదివి, నవ్వుకున్నాం. అయితే ఇంటికి వచ్చేటప్పుడు బస్‌లో ‘అంతే.. నా లైఫ్ అయిపోయింది’ అని ఏడుస్తూ కూర్చున్నాను. ఆయన మీద నమ్మకం లేక కాదు. ‘యాక్టర్‌ని చేసుకుంటున్నావు.. జాగ్రత్త’ అని పెళ్లికి ముందు నా ఫ్రెండ్స్ అన్నారు. ఆ మాటల ప్రభావంతోనే భయపడ్డా.
►కొందరు హీరోయిన్ల గురించి అలీగారు చేసిన కామెంట్స్‌కి సోషల్ మీడియాలో విమర్శలు రావడం గురించి...
అలీ: ‘మా ఆయన స్టేజ్ మీద మాట్లాడే మాటలు కేవలం నవ్వించడానికే. దీన్ని నవ్వుగా తీసుకోవాలి తప్ప మా ఆయన్ను నవ్వులపాలు చేయకండి’ అని జుబేదా ఆ విమర్శలకు సమాధానం చెప్పింది. ఇన్ని తెలివితేటలు తనకెలా వచ్చాయా అని ఆశ్చర్యపోయా.
జుబేదా: మావారు స్త్రీలను ఎంత గౌరవిస్తారో నాకు తెలుసు. అలాంటి ఆయన మీద ఇలాంటి కామెంట్స్ రావడంతో బాధపడ్డాను. చంద్రుడికి ఒక మచ్చలాగ ఈ కామెంట్స్ వచ్చాయి.
అలీ: సోషల్ మీడియాలో కంట్రోల్ లేదు. ఇప్పుడేం మాట్లాడాలన్నా కొలతలు పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది.
జుబేదా: ఏం మాట్లాడితే ఏం అవుతుందో అని తక్కువ మాట్లాడేస్తున్నారు. ఆయన కామెడీని నేను మిస్ అవుతున్నాను.
►దాదాపు 20 ఏళ్లు టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత వైయస్సార్‌సీపీలో చేరడానికి కారణం ఏంటి?
1999లో టీడీపీలో చేరాను. నాకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా లైఫ్ ఇచ్చింది రామానాయుడుగారు. ‘రేయ్.. నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను. ప్రచారానికి రావాలిరా’ అన్నారాయన. అలాగే గురువుగారు.. వస్తున్నాం అని వెళ్లాను. కంభంపాటి రామ్మోహన్‌రావుగారు అని ఉన్నారు. ఆయన మాకు ఇన్‌చార్జ్. ఆయన మమ్మల్ని 15 రోజులు తిప్పారు. అప్పుడు టీడీపీ కమ్ బీజేపీ రెండూ మిక్స్ ఉండేది. అప్పుడు బాబ్రీ మసీదు ప్రాబ్లమ్ వస్తే, ‘బీజేపీ కలిసి ఉన్న టీడీపీకి నువ్వెందుకు ప్రచారం చేస్తున్నావు?’ అని చాలామంది మస్లిమ్‌లు నా మీద రివర్శ్ అయ్యారు. ‘నేను బీజీపీ తరఫున రాలేదు. వచ్చింది టీడీపీ తరఫున.. అపార్థం చేసుకోవద్దు’ అని చెప్పాను. నేనేదో పెద్దది ఆశించలేదు. అరే.. షూటింగ్ మానుకుని వచ్చాడు అనే గుర్తింపు లేదు.
ఒక మనిషిని ఇంతలా వాడుకుంటారా? అని బాధ కలిగింది. 2004లో మళ్లీ రమ్మంటే వెళ్లాను. అప్పుడూ గుర్తింపు లేదు. అప్పుడే రాజశేఖర రెడ్డిగారు అద్భుతమైన మెజారిటీతో గెలిచారు. ఆ సమయంలో ఏవీయస్‌గారికి ఆరోగ్యం బాగా లేకపోతే నేను, జయసుధగారు, సీసీ రెడ్డిగారు, ఎన్. శంకర్‌గారు.. రాజశేఖర రెడ్డిగారిని కలిశాం. చీఫ్ మినిస్టర్ ఫండ్ నుంచి వెంటనే 3 లక్షలు ఇచ్చారు. మేం టీడీపీ అని తెలుసు. అయితే తనను నమ్ముకుని వచ్చారు కాబట్టి ఇచ్చారు. అదే లక్షణం జగన్‌మోహన్‌రెడ్డిగారికి వచ్చింది. ఎందుకు ఇంకా టీడీపీలో కంటిన్యూ అవ్వాలి అనుకున్నాను. 2015లో నెక్ట్స్ సీఎం మీరే అని జగన్‌గారితో అన్నాను. ఒకసారి తిరుపతి వెళుతుంటే, ఫ్లయిట్‌లో కలిశాం. 2017 డిసెంబర్ 29న నా స్నేహితుడు శ్రీను వాళ్ల అబ్బాయి ఎంగేజ్‌మెంట్‌కి వెళుతుంటే, ఫ్లయిట్‌లో జగన్‌గారు ఉన్నారు.
అప్పుడు తీసిన మా ఫొటో సోషల్ మీడియాలో బాగా తిరిగింది. దాంతో వైసీపీలో చేరుతున్న అలీ అని వార్త వచ్చింది. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా చాలామంది చాలా మాట్లాడారు. నేను వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు. సంస్కారం అడ్డొచ్చింది. వన్ ఫైన్ డే.. వైసీపీ కండువా కప్పుకున్నాను. అదే రోజు సాయంత్రం ఎలక్షన్ కోడ్ వచ్చింది. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అన్నారు కదా.. అందుకని కావలి నుంచి ప్రచారం మొదలుపెట్టాను. నేను ప్యాకేజీ మాట్లాడుకున్నానని అన్నారు. కానీ ఏదీ ఆశించి ఈ పార్టీలోకి రాలేదు. ఈ వ్యక్తి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఉద్దేశం. నేనెప్పుడూ ఏ పార్టీ నుండి ఏమీ ఆశించలేదు. నాక్కావల్సింది కొంచెం గౌరవం, మర్యాద అంతే.
►మీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా సాగడానికి కారణాలు? ఏమైనా సలహాలు?
జుబేదా: భర్త అంటే మా ఆయనలా ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఇద్దరూ ఒకేసారి కోపం తెచ్చుకోకూడదు. నాకు కోపం వస్తే ఆయన సైలెంట్ అయిపోతారు. ఆయనకు కోపం వస్తే నేను సైలెంట్ అయిపోతా. మా గొడవల్ని మా బెడ్‌రూమ్ దాటి బయటకు రానివ్వలేం. ‘కోపం వస్తే రూమ్‌లోకి వెళ్లి గొడవపడదాం. కానీ పిల్లల ముందు ఎప్పుడూ వాదించుకోవద్దు’ అని నాతో చెబుతుంటారు.
అలీ: రూమ్‌లోకి వెళ్లాక భార్యాభర్త కరాటే చేస్తారో జూడో చేస్తారో మీ ఇష్టం (నవ్వుతూ). క్షణికావేశం కాపురం చెడగొడుతుంది, కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. అందుకే సర్దుకుపోవాలి.
జుబేదా: భార్యాభర్తల మధ్య గొడవ గంటా రెండు గంటల్లో ముగిసిపోవాలి. రోజుల తరబడి సాగదీయకూడదు. అది మంచిది కాదు.
– డి.జి. భవాని