
చెరలో... నాలుగేళ్లు... లక్ష నరకాలు!
నాలుగు సంవత్సరాల క్రితం సోమాలియాలోని కోస్తా పట్టణం హరార్దెరె సమీపంలో ఓ నౌక కెప్టెన్‌తో సహా ఏడుగురు భారతీయ నావికులను సముద్రపు దొంగలు కిడ్నాప్ చేశారు. సమీపంలోని అడవుల్లో అష్టకష్టాలు పెట్టారు. సుదీర్ఘ చర్చల తరువాత పక్షం రోజుల క్రితం వారిని విడుదల చేశారు. ‘సముద్రపు దొంగలు డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇచ్చారా? తక్కువ ఇచ్చారా? అసలు ఎంత ఇచ్చారు?’ అనే విషయాలు వివరంగా తెలియకపోయినా, ఆ నాలుగు సంవత్సరాల్లో బందీలు ఎదుర్కొన్న బాధలు తెలిశాయి. వారి మాటల్లోనే కొన్ని విషయాలు...
‘‘నాలుగు సంవత్సరాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాం. మా ముఖాన నాసి రకమైన బియ్యం పడేసేవారు. కూరగాయలేమీ ఉండేవి కాదు. ఆ బియ్యాన్నే ఉడకబెట్టుకొని తినేవాళ్లం. ఇక నీళ్ల గురించి చెప్పనక్కర్లేదు’’ అని గతాన్ని కన్నీళ్ల మధ్య గుర్తు తెచ్చుకున్నాడు మన్జీత్‌సింగ్. ఆహారమే కాదు వస్త్రాల గురించి కూడా పట్టించుకునే వారు కాదు సముద్రపు దొంగలు. పాత లుంగీలు, చిరిగిన బనియన్లు, టీషర్ట్‌లు ఇచ్చేవాళ్లు. అవి ఒక్కసారి ధరిస్తే, పూర్తిగా పాడైన తరువాతగానీ వేరేవి ఇచ్చేవాళ్లు కాదు.
ఇక అండర్‌వేర్‌ల ఊసే ఉండేది కాదు. తమ పాత బనీయన్‌నే అండర్‌వేర్‌గా కుట్టుకునేవారు. కారణం తెలియదుగానీ సోమాలియా సముద్రపు దొంగలు సిక్కులు అంటే మండిపడేవారు. ఆ భయంతోనే చండీఘడ్‌కు చెందిన సోహన్‌సింగ్ తన మతం ఏమిటన్నది తెలియకుండా దాచడానికి ప్రయత్నించేవాడు. ‘‘నేను హిందువును’’ అని చెప్పుకున్నా దొంగలు బలవంతంగా అతడి గడ్డాన్ని తీయించారు. ఆ సంఘటన తనను ఎంతో బాధకు గురి చేసిందని చెబుతాడు సోహన్‌సింగ్.
ఒకవైపు 55 డిగ్రీల ఉష్ణోగ్రత, మరోవైపు నైలాన్ దుస్తులు...అమ్మో...ఆ బాధ మాటలకు అందదు’’ అంటూ ఆ నరకప్రాయమైన అనుభవాలను ప్రస్తావించాడు జోసెఫ్. బతుకు మీద ఒకే ఒక ఆశ ఏమిటంటే ఆరు నెలలకొకసారో, సంవత్సరానికి ఒకసారో కుటుంబసభ్యులతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం. అయిదు నిమిషాలకు మించని ఆ ఫోన్ సంభాషణ మాట్లాడినట్లు ఉండేది కాదు. మాట్లాడనట్లూ ఉండేది కాదు. తాము ఇంకా సజీవంగా ఉన్నామని లోకానికి తెలియజేయడానికే అలా ఫోన్‌లో మాట్లాడించేవారు.
‘‘వారి మాటలకు ఎదురు చెప్పినా, అసహనంగా కనిపించినా చేయి చేసుకునేవారు. క్రూరత్వం గురించి కథల్లో చదవడం, సినిమాల్లో చూడడం తప్ప నిజజీవితంలో చూడడం ఇదే’’ అంటాడు 45 ఏళ్ల భీమ్‌సేన్. నౌకలో ఈయన ఎలక్ట్రికల్ ఆఫీసర్. ‘‘ఇప్పటి వరకు మిమ్మల్ని బాధ పెట్టింది చాలు. ఇక రేపో మాపో విడుదల చేస్తాం’’ అన్నప్పుడల్లా బందీల కళ్లలో వేల వసంతాలు వెల్లివిరిసేవి. అలా నాలుగు సంవత్సరాల్లో ఎన్ని ఆశలు పెట్టారో! ‘‘మానసిక, శారీరక హింసల మధ్య నలిగి పోతూ చివరి ఆశను కూడా వదులుకున్నాం’’ అని చేదు గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు జోసెఫ్. బందీలైన నావికులను చేతులు వెనక్కి కట్టి, చావ బాదుతూ ఫోటోలు తీసేవారు. వాటిని నౌక యజమానికి పంపి- ‘‘డబ్బులు పంపించకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది’’ అని బెదిరించేవారు.
భారత ప్రభుత్వ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సోమాలియా ప్రభుత్వం సముద్రపు దొంగలతో అనేక దఫాలుగా జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. మొన్న అక్టోబర్ 30న బందీలు విడుదలయ్యారు. కెన్యా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ కెక్యూ-202లో వారు స్వదేశానికి చేరుకున్నారు. తమ కోసం కళ్లలో ఒత్తులు వేసుకొని నిరీక్షిస్తున్న కుటుంబసభ్యులను సుదీర్ఘకాలం తరువాత కలుసుకున్నారు. కథ సుఖాంతమైంది.
‘‘ఆ నరకపు రోజులను పూర్తిగా మరిచిపోండి’’ అన్నారు ఒక సైకాలజిస్ట్ అప్పటి బందీలలో ఒకరైన భాస్కరన్‌తో. భాస్కరన్ నోటి నుంచి అయితే సమాధానం రాలేదుగాని, అతడి కళ్లు చెబుతున్నాయి...‘అది ఇప్పట్లో సాధ్యపడే విషయమేనా?’ అని.