సున్నితమైన చర్మానికి మేకప్ వద్దు...
పిల్లలు ఉండేదే అందంగా! కానీ, వారిని వేడుకలకు ఇంకాస్త ముద్దుగా తయారుచేయడానికి అమ్మానాన్నలు ఉత్సాహం చూపిస్తారు. దుస్తులు, ఇతర అలంకరణ వస్తువుల మాటెలా ఉన్నా పిల్లల చర్మానికి హాని కలిగించే రసాయనాలు వాటిల్లో దాగి ఉంటున్నాయి. పిల్లలకు హాని కలిగించే అలాంటి ఉత్పత్తులను సాధ్యమైనంత వరకు వారికి దూరంగా ఉంచడం శ్రేయస్కరం...
చర్మకాంతి
పిల్లల మేను నిగారింపుతో ఉంటుంది. ప్రత్యేకించి మేకప్‌లు అవసరం లేదు. కానీ, తల్లి మేకప్ చేసుకుంటూ పిల్లలకూ ఆ సౌందర్య సాధనాలను ఉపయోగిస్తుంటారు. దీని వల్ల చిన్నవయసులోనే వారి చర్మం రఫ్‌గా మారే అవకాశం ఉంది. ఆ ఉత్పత్తులు పడక చర్మ సమస్యలు వస్తాయి.
ఫేసియల్స్
పన్నెండేళ్ళ వయసు దాటిన నాటి నుంచి పిల్లలకు ఫేసియల్స్ అవసరం అని కొంతమంది అపోహపడుతుంటారు. దీంతో సౌందర్యశాలల్లో ఫేసియల్స్ చేయించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఫేసియల్స్‌కి వాడే క్రీములు, ఇతర మర్దనలు, ఆవిరి... వల్ల చిన్నవయసులోనే చర్మం పొడిబారడం, మొటిమల సమస్య పెరగడం, త్వరగా ముడతలు రావడం జరుగుతుంది. అందుకని కౌమారదశ దాటేంతవరకు ఫేసియల్స్ చేయించకూడదు. అది కూడా వైద్యుల సలహాలు తీసుకొని, వారి చర్మతత్త్వానికి సరిపడ చికిత్సలు ఎంచుకుంటే మేలు.
పోషకాహారం
స్వీట్లు, ఇతర జంక్‌ఫుడ్‌ను పిల్లలు అమితంగా ఇష్టపడుతుంటారు. వీటినే ఎక్కువగా తీసుకునే పిల్లలను ఆరోగ్యపరమైన సమస్యలు బాధిస్తుంటాయి. ఈ ప్రభావం వీరి మేని చర్మంపైనా పడుతుంది. విటమిన్ ‘ఇ’ అధికంగా ఉండే బాదం పప్పులు, గుడ్డు, ‘సి’ విటమిన్ లభించే పండ్లు.. రోజూ తీసుకునే ఆహారంగా తప్పక ఇవ్వాలి. ఆరుబయట ఆటలను ప్రోత్సహించడం వల్ల పిల్లల్లో ఎదుగుదల మెరుగ్గా ఉండి, చర్మ నిగారింపు కూడా బాగుంటుంది.
- డా. షాను, చర్మవైద్య నిపుణురాలు