
డే అండ్ నైట్ షిఫ్ట్‌లతో సమస్యగా ఉంది
నా వయసు 30 ఏళ్లు. ఐటీ ఇండస్ట్రీలో నైట్ షిఫ్ట్, డే షిఫ్టుల్లో పనిచేస్తున్నాను. ఇటీవల నాలో చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోంది. ఏ అంశంపైనా దృష్టి నిలపలేకపోతున్నాను. తగిన సలహా ఇవ్వగలరు. – సమీర్, హైదరాబాద్
మీలా పగలూ, రాత్రీ పనిచేసేవాళ్లు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ అనే సమస్యతో బాధపడుతుంటారు. రాత్రి, పగలు మార్చిమార్చి పనిచేయాల్సి రావడంతో సర్కేడియన్ రిథమ్ దెబ్బతిని ఆ షెడ్యూల్స్‌కు అనుకూలంగా మీ దేహం మారలేకపోవడంతో వచ్చే సమస్య ఇది. షిఫ్ట్‌లలో పనిచేసేవారు రోజుకు సగటున నాలుగు గంటల కంటే తక్కువగా నిద్రపోతుంటారు. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో కొద్దిపనికే తీవ్రంగా అలసిపోతుంటారు. పని సామర్థ్యమూ తగ్గుతుంది.
ఇలాంటి కొందరు ఏడెనిమిది గంటలపాటు నిద్రపోయినా వాళ్లకు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ రావచ్చు. తరచూ నైట్ షిఫ్టులుగా, డే షిఫ్టులుగా మారేవాళ్లలో మీరు చెబుతున్న లక్షణాలైన కోపం రావడం, తీవ్రమైన అలసట, త్వరగా ఉద్వేగాలకు లోనుకావడం వంటివి ఈ సమస్య వచ్చిన వారిలో కనిపిస్తుంటాయి. పగటివేళ నిద్రమత్తుతో జోగుతూ ఉండటం, నిద్రపట్టడంలో ఇబ్బంది, నిస్సత్తువ, దృష్టికేంద్రీకరణ సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలూ కనిపిస్తాయి.
ఒక్కోసారి వారు చేసే తప్పులకు భారీమూల్యం చెల్లించాల్సి రావచ్చు. అనారోగ్యాల బారిన పడటం ఎక్కువ కావచ్చు. ఈ సమస్య నివారణ కోసం పనిచేసే సమయంలో కెఫిన్ ఉండే కాఫీ వంటివి తక్కువగా తీసుకోవడం, నిద్రపోయే సమయాల్లో పరిసరాలు నిశ్శబ్దంగా ఉంచుకోవడంతో పాటు వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. షిఫ్ట్ వర్క్ డిజార్డర్‌తో బాధపడేవారికి కృత్రిమ వెలుగులో ఉంచే చికిత్స ప్రక్రియ అయిన బ్రైట్ లైట్ థెరపీ, మెలటోనిన్ మందులతో స్లీప్ మాడిఫికేషన్ థెరపీ వంటివి అందుబాటులో ఉన్నాయి.
మంచి నిద్ర కోసం చేయాల్సినవి ఇవే...
నాకీమధ్య నిద్ర బాగా తగ్గింది. టాబ్లెట్లు వాడకుండా స్వాభావికంగా నిద్రపట్టే మార్గాలు చెప్పండి. – సుమనశ్రీ, విశాఖపట్నం
రాత్రి వేళల్లో మీరు నిద్రించే వ్యవధి తగ్గినా, ఆ మర్నాడు పగలంతా ఉల్లాసంగా ఉన్నప్పుడు మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మంచి నిద్ర కావాలనుకునే వాళ్లు ఈ కింది సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అవి... ∙పొగతాగే అలవాటును పూర్తిగా మానేయాలి ∙నిద్ర సమయంలో గదిలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి ∙సాయంత్ర వేళల నుంచి కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకండి ∙రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి ∙ప్రతీ రోజూ ఒకే నిర్ణీత వేళకి నిద్రపొండి ∙
పగటి పూట చిన్న కునుకు (పవర్ న్యాప్) మాత్రమే చాలు. ఎక్కువసేపు నిద్రపోవద్దు ∙గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది ∙పుస్తకం చదువుతుంటే వెంటనే నిద్రపడుతుందంటారు. కానీ... నిద్రకు వుుందు పుస్తకాలు చదవద్దు ∙నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. దాంతో నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు. అందుకే వుద్యం తాగాక నిద్ర వచ్చినా మెలకువ తర్వాత అలసటంతా తీరిపోయిన రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు.
- డాక్టర్ రమణ ప్రసాద్ ,కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment