నా ప్రయాణం...సస్యశ్యామలం! | Soliloquy rivers article | Sakshi
Sakshi News home page

నా ప్రయాణం...సస్యశ్యామలం!

Published Tue, Jan 13 2015 10:40 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

నా ప్రయాణం...సస్యశ్యామలం!

నా ప్రయాణం...సస్యశ్యామలం!

గమనం
నదుల స్వగత కథనం

 
మనిషి... తాను సౌకర్యంగా జీవించడానికి నదిని ఆసరా చేసుకున్నాడు.
భూగోళాన్ని సస్యశ్యామలం చేస్తున్న నది పుట్టిన చోటు నుంచి సాగరంలో
కలిసే వరకు సాగే ప్రయాణమే ఈ ‘గమనం’. నదుల స్వగత కథనాల సుమహారం.

 
నేను భూమ్మీదకు ఎప్పుడొచ్చానో తెలియదు. కాని ఇప్పటిదాన్ని మాత్రం కాదు. భూమి పుట్టిన కొన్నేళ్లకు నేనూ పుట్టాను. హిమాలయాలకంటే ముందు నుంచి భారతమ్మ ఒడిలో నేనున్నా. మధ్యభారతంలో తూర్పు నుంచి పశ్చిమంగా సాగే నా గమనానికి వింధ్య, సాత్పూర పర్వత శ్రేణులే సాక్ష్యం. నేను ప్రయాణించే దారంతా సస్యశ్యామలమేనని గుర్తు చేసుకుంటే గర్వంతో పరవళ్లు తొక్కాలనిపిస్తుంది. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ! నా పేరు ఒక సంస్కృతం పదం. దానికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేది అని అర్థం. మనదేశంలో ఉన్న పెద్దనదుల వరుసలో ఐదోదాన్ని. మధ్యప్రదేశ్‌లోని మయికాల్ పర్వతసానువుల్లోని అమర్‌కంటక్ కొండల్లో నర్మదాకుండ్ అని చిన్నతటాకం ఉంది. అది నా పుట్టిల్లు. అక్కడి నుంచి నేను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా 1312 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాను. నా గమనంలో నాకు తోడయ్యే చిన్న, పెద్ద నదులన్నీ కలిపితే నా సహప్రయాణికుల సంఖ్య 41. సాత్పూర పర్వతశ్రేణుల మధ్యగా 22 నదులు, వింధ్య శ్రేణుల గుండా మిగిలినవి నన్ను కలవడానికి వస్తాయి. వాటిలో ఖేర్, షక్కర్, దూధీ, తవా దక్షిణం నుంచి, గంజాల్, హిరణ్, బర్నా, చోరల్, కరమ్, లోహార్ నదులు ఉత్తరం నుంచి వచ్చి నాకు తోడవుతున్నాయి. సుకన్య, శిక్త నదులు ఖాంద్వా పీఠభూమి దాటాక నాతో కలుస్తాయి.నేల మీద కొండల మధ్య, లోయల్లోకి క్రమంగా గుంభనంగా ప్రయాణించే నేను పునాసా మీదుగా పడమరగా వెళ్లి గుజరాత్ రాష్ట్రం బారుచ్‌కు చేరువలో గల్ఫ్ ఆఫ్ కాంబాట్ దగ్గర అరేబియాలో కలుస్తాను.


నా పేరు చెప్పే ముందు మరికొన్ని సంగతులు కూడా చెబుతాను. స్కంద, వాయు పురాణాల్లో నన్ను రేవాఖండం అన్నారు. క్రీ.శ రెండవ శతాబ్దంలో టాలమి అనే విదేశీ రచయిత తాను రాసిన పెరిప్లస్ అనే రచనలోనూ నన్ను ప్రస్తావించాడు. ఆది శంకరాచార్యుడు తన గురువు గోవింద భగవత్పాదుల వారిని నా ఒడ్డునే కలుసుకున్నాడు. కనోజ్ చక్రవర్తి హర్షవర్ధనుడి మీద చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి గెలిచిందీ నా తీరాన్నే. లయ కర్త ఈశ్వరుడు కఠోర తపస్సు చేసినప్పుడు ఆయన దేహం నుంచి వెలువడిన స్వేదం ఒంటి నుంచి నేల మీదకు జారి మడుగులా మారి క్రమంగా ప్రవాహమైందని, నేను పుట్టిన ప్రదేశాన్ని అమర్‌కంటక్ అంటే ఈశ్వరుని కంఠంగా కవులు అభివర్ణించారు. నర్మదీయ బ్రాహ్మణులు నన్ను మాతృదేవతగా కొలుస్తారు. నా ప్రవాహంలో ప్రతి నీటి బొట్టూ మరొకరికి ప్రయోజనకారి అయితే చాలనుకుంటాను. అందుకే నా మీద ఎన్ని డ్యామ్‌లు, రిజర్వాయర్లు కడుతున్నా ఆనందంతో పులకించి పోతుంటాను. నా మీద, నా ఉపనదుల మీద కట్టిన డ్యామ్‌ల లెక్క చూసుకుంటే 30 పెద్ద, 135 మధ్యస్థ, దాదాపుగా 3000 చిన్న ఆనకట్టలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ వ్యవసాయం కోసమే. కొన్ని బహుళార్థ సాధకాలు, కొన్ని కేవలం విద్యుత్తు కోసమే ఉద్దేశించినవి. ఇందిరా సాగర్, సర్దార్ సరోవర్, మహేశ్వర్ డ్యామ్, మాన్ డ్యామ్, గోయి, జాబాట్, మతియారి, రాణీ అవంతీబాయ్ సాగర్, బర్నా, తవా, శుక్త, కర్జన్, బర్గి... ఇలా ఎన్నో.

నా ఒడ్డున విస్తరించిన అడవులు దేశంలోకే పెద్దవి. వేల ఏళ్ల నాటి టేకు చెట్లయితే... నింగికి, నేలకు మధ్య వారధిగా మారాలనుకుంటున్నాయో ఏమో అలా అలా పెరుగుతూనే ఉన్నాయి. వాటికి ఇన్నేళ్లలో ఏ రోజూ నీటికి కొదవ చేయలేదు నేను. అందుకే చెట్లన్నీ దట్టంగా విస్తరించాయి. రకరకాల జంతువులకు, పక్షులకు, మొక్కలకు నిలయంగా మారాయి. బంధవ్‌ఘర్, పన్నా, సంజయ్ నేషనల్ పార్కు, మాండ్లా ప్లాంట్ ఫాజిల్ నేషనల్ పార్కు, డిండోరి నేషనల్ పార్క్, పాచ్‌మడి బయోస్ఫియర్ రిజర్వ్, సాత్పూర నేషనల్ పార్కులుగా వాటికి నామకరణాలయ్యాయి, ఆసియాలోకెల్లా ప్రసిద్ధి చెందిన కన్హా నేషనల్ పార్కు నా ఒడ్డునే ఉంది. ఇక్కడ మన జాతీయ మృగం పులి ఠీవిగా సంచరిస్తుంటే నా ఉపనదులు హాలోన్, బంజార్‌లు ఒదిగి ఒదిగి అడవి మధ్యగా ప్రవహిస్తూ వచ్చి నాలో కలుస్తాయి. నా తీరంలో లెక్కలేనన్ని నివాస ప్రాంతాలు వెలిశాయి. మహేశ్వరీ చేనేత చీరలంటే దేశంలోని ప్రతి మగువా మనసు పారేసుకుంటుంది మరి. అంతటి నైపుణ్యం ఎలా వచ్చిందో కాని ఈ చీరలు చాలా తేలికగా ఉంటాయి. అటు ఎండకాలంలో హాయినిస్తూ, చలికాలంలో చలిని దూరనీయకుండా వెచ్చదనాన్నిస్తాయి.

ఇక నా తీరాన ఉన్న కొండలు నాకు అండగా నిలుస్తుంటే వాటి మధ్యలో బాఘ్ గుహలు, భేదాఘాల్, భీమ్‌బెట్క గుహలు కూడా వాటికవే ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భీమ్‌బెట్క పాండవ ద్వితీయుడి పేరుతో వచ్చింది. రాజ్యం పోగొట్టుకున్న తర్వాత వాళ్లు కొంతకాలం నా ఒడ్డున సేదదీరుతూ ఈ గుహల్లో కాలం గడిపారు.

పాండవులు నివసించారన్న మాటేంటి అసలు మనిషి మొదట జీవించింది ఇక్కడే. 15, 000 ఏళ్ల క్రిందట ఆదిమానవులు ఈ గుహల్లో జీవించారు. అప్పుడు వాళ్లేసిన బొమ్మలు ఇప్పటికీ ఉన్నాయి. నా కోసం వచ్చినప్పుడు వాటిని కూడా చూడండి. ఆ గుహలనిప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటున్నారు.    

సముద్రానికి ఎగువన 1057 మీటర్ల ఎత్తులో పుట్టిన నేను మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రలో అడుగుపెట్టి గుజరాత్‌లో ‘గల్ఫ్ ఆఫ్ కాంబాట్’ చేరేసరికి వేగం తగ్గి 24 కిలోమీటర్ల మేర విస్తరించి నెమ్మదిగా సాగరంతో సంగమిస్తున్నాను. ఇక్కడే నాతోపాటుగా సబర్మతి నది కూడా అరేబియాలో కలుస్తుంది. ఇంకో సంగతి తెలుసా నాతోపాటు పశ్చిమంగా ప్రవహించే మరో రెండు నదులు మాహి, తపతి కూడా ఇక్కడే సాగరసంగమం చేస్తాయి. ఇంత చెప్పాక నా పేరు నా నోటితోనే చెప్పమంటారా? ఇప్పటికే మీకు తెలిసుంటుంది. అయినా చెప్తాను... ఇప్పటి దాకా మీతో ఇంత నర్మగర్భంగా మాట్లాడిన నా పేరు నర్మద. ద గివర్ ఆఫ్ ప్లెజర్.

ప్రెజెంటేషన్: వాకా మంజులారెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement