ఇదో లోకం!
ఫొటో తీయడం కోసం మేకల్ని చెట్టు మీద పెట్టారా లేక ఫొటోషాప్‌లో ఇలా క్రియేట్ చేశారా అని అనుమానం వస్తోంది కదూ! అవి రెండూ కాదు. నిజంగానే మేకలు చెట్టు మీదికెక్కి ఆకులు తింటున్నాయి. మొరాకోలోని కొన్ని ప్రాంతాల్లో అర్గాన్ అనే చెట్లు పెరుగుతాయి. సంవత్సరమంతా కాసే ఈ చెట్టు పండ్లు, ఆకులు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయట. చాలా రుచిగా కూడా ఉంటాయట. దాంతో మేకలు ఇలా చెట్లు ఎక్కి మరీ మేస్తుంటాయన్నమాట!
అర్మేనియా దేశంలోని స్కూళ్లలో ఆరేళ్ల వయసు నుంచే పిల్లలకు చెస్ ఆడటం నేర్పిస్తారు. అది అక్కడ మ్యాన్‌డేటరీ. చెస్ నేర్పించడం వల్ల పిల్లల మెదళ్లు బాగా పదునెక్కుతాయని వాళ్ల ఉద్దేశం, నమ్మకం.
యూకేకి చెందిన ఈ అంద మైన భామల పేర్లు లూసీ, మారియా. ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. పైగా కవలలు. అలా చెప్తే ఎవ్వరూ నమ్మరు. ఎలా నమ్ముతారు? ఎక్కడైనా ఒక్క పోలిక ఉంటే కదా! వీళ్లు ఇలా ఎలా పుట్టారో మాకే అర్థం కావడం లేదు అంటుం టారు వాళ్ల తల్లిదండ్రులు. ప్రపంచం మొత్తంలో ఏమాత్రం పోలిక లేని ట్విన్స్ వీళ్లిద్దరేనట!
తెల్లని గౌను, మెడలో పూసల దండ, చేతిలో చాకు, ఎదురుగా కేకు... దీని స్టైల్ చూశారా? క్రిస్టల్ అనే ఈ కోతిగారు పెద్ద సెలెబ్రిటీ. అందుకే అంత ఫోజు మరి. సినిమాలకు జంతువుల్ని సప్లై చేసే ఓ కంపెనీ దీనికి నటనలో తర్ఫీదునిచ్చింది. మన క్రిస్టల్‌గారు సహజ నటి కావడంతో బాగా ఫేమస్ అయిపోయారు. పాతిక పైగా సూపర్ హిట్ హాలీవుడ్ చిత్రాల్లో నటించి ‘లైఫ్ టైమ్ దివా అచీవ్‌మెంట్’ అవార్డు కూడా అందుకున్నారు. ఆ సందర్భంలో తీసిన ఫొటోయే ఇది!
మామూలుగా జూలో జంతువులు బోనుల్లో ఉంటాయి. సందర్శకులు వెళ్లి వాటిని చూస్తుంటారు. కానీ చైనాలోని లెహె లెడూ వైల్డ్ లైఫ్ జూలో అంతా రివర్స్. సందర్శకులను వాహనాలకు అమర్చిన బోనుల్లో బంధించి జూ అంతా తిప్పుతారు. జంతువులేమో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఇదిగో ఇలా!
బ్రిటన్‌లోని సమ్మర్‌హిల్ స్కూల్లో ఉన్నంత స్వేచ్ఛ మరే స్కూల్లోనూ ఉండదు. అక్కడ చదివే పిల్లలు తమకు ఆసక్తి ఉన్నప్పుడే పాఠాలు వినొచ్చు. లేదంటే డ్రామానో, సినిమానో చూడొచ్చు. మ్యూజిక్, పెయింటింగ్ ఇంకేదైనా నేర్చుకోవచ్చు. తమకు నచ్చిన పని చేయొచ్చు. అదంతా కూడా ఎడ్యుకేషనే అంటుంది స్కూల్ యాజమాన్యం.
లండన్‌లోని హాంకీ టాంక్ రెస్టారెంట్‌లో పనిచేసే క్రిస్ అనే చెఫ్ ఓ బర్గర్‌ను తయారు చేశాడు. దాని పేరు గ్లామ్‌బర్గర్. నాణ్యమైన బీఫ్, ఖరీదైన బటర్, ప్రత్యేకంగా పండించిన మిర్చి, రకరకాల సాస్‌లతో అతడు తయారు చేసిన ఈ బర్గర్ బాగా ఫేమస్ అయ్యింది. దాంతో రేటు చుక్కలను చేరింది. దీని ఖరీదెంతో తెలుసా... 1100 పౌండ్లు. అంటే మన కరెన్సీలో తొంభై ఆరు వేల పైనే. కనిపించాయి కదా చుక్కలు!!!
హ్యారీపాటర్ చిత్రాల హీరో డ్యానియెల్ రెడ్‌క్లిఫ్‌కి ఓసారి మీడియా మీద విపరీతమైన కోపం వచ్చింది. ఎప్పుడు చూసినా వెంటపడి ఫొటోలు తీయడంతో విసుగొచ్చి, ఓ ఆరు నెలల పాటు ఎక్కడికి వెళ్లినా ఒకే డ్రెస్ వేసుకుని వెళ్లాడు. కొత్త ఫొటో ఇవ్వ కుండా మీడియాని విసిగించాలని!
డిస్నీ వాళ్లు ‘ప్రిన్సెస్ అండ్ ఫ్రాగ్’ పేరుతో ఓ యాని మేషన్ చిత్రం తీశారు. ఇది సూపర్‌హిట్ అయ్యింది. దీని ప్రభావం పిల్లల మీద ఎంతగా పడిందంటే... ఆ చిత్రంలోని హీరోయిన్ మాదిరిగానే కప్పలను ముద్దాడదామని ప్రయత్నించి, సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా బారిన పడి యాభై మందికి పైగా చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారట!
జపాన్‌లోకి ఒకినావా దీవిలో వందేళ్ల వయసు దాటినవాళ్లు 450 మంది వరకూ ఉన్నారు. అక్కడి వాతావరణం, ఆహారపుటలవాట్ల వల్ల ఇలా ఎక్కువకాలం జీవిస్తున్నారట. అందుకే ఈ దీవిని ‘హెల్దీయెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్’ అంటారు.
రోమ్‌లో ‘ద ఆపియన్ వే’ అనే రోడ్డు ఉంది. ఇది అత్యంత పురాతనమైనది. క్రీస్తు శకం 312లో వేశారట. ఇప్పటికీ ప్రజలు దీన్ని వాడుతున్నారు.