అమ్మో.. అన్ని కోట్ల సెల్ఫీలా!
సెల్ఫీ.. సెల్ఫీ.. సెల్ఫీ. ఎక్కడ చూసినా సెల్ఫీలు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేదు. ఇప్పుడూ అప్పుడూ అన్న పట్టింపూ లేదు. ప్రపంచమంతా సెల్ఫీల మాయలో మునిగితేలుతోంది. తాజాగా సెల్ఫీల గురించి గూగుల్ వెల్లడించిన గణాంకాలు.. మానవాళి ఎంతగా సెల్ఫీ మోజులో పడిపోయిందో తెలుపుతున్నాయి.
ఒక సంవత్సర కాలంలో కేవలం గూగుల్ ఫోటోస్ యాప్లో అప్లోడ్ చేసిన సెల్ఫీల సంఖ్య అక్షరాలా 2,400 కోట్లు. ఈ విషయాన్ని గూగుల్ ఫోటోస్ యాప్లో అప్లోడ్ చేస్తున్న ఫోటోలలో సెల్ఫీలెన్నో తెలుసుకోవడానికి.. మెషిన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఉపయోగించి లెక్కించి స్వయంగా గూగుల్ సంస్థ వెల్లడించింది. ప్రతినెలా 200 మిలియన్లకు పైగా జనాలు గూగుల్ ఫోటోస్ యాప్లో సెల్ఫీలు అప్లోడ్ చేస్తున్నారు. గూగుల్ యూజర్లు 13.7 పెటాబైట్స్ డేటాని గూగుల్ ఫోటోస్ యాప్లో ఫోటోలను అప్లోడ్ చేయడానికి వినియోగించారు. ఇదంతా కేవలం ఒక్క గూగుల్కు సంబంధించిన వ్యవహారం మాత్రమే అనే విషయాన్ని గమనించాలి.
ఈ గణాంకాలను చూసిన వారు.. ఇక ఫెస్బుక్, స్నాప్ చాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి విరివిగా ఉపయోగించే సోషల్ మీడియా సైట్లతో పాటు, యాపిల్ ఐక్లౌడ్లో అప్లోడ్ చేసిన సెల్ఫీలు కూడా కలిపితే.. సెల్ఫీల సంఖ్య ఇంకెన్ని కోట్లుండాలి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.