మహరాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో మానవత్వం మంటగలిసే ఉదంతం చోటుచేసుకుంది. మేకలను, పావురాలను చోరీ చేశారనే అనుమానంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మీడియాకు అహ్మద్‌నగర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తాము విచారణ చేపట్టి, ఈ దుశ్చర్యకు పాల్పడిన ఒక వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. మిగిలిన ఐదుగురు పరారయ్యారని తెలిపారు. ఈ ఘటన దరిమిలా దీనికి నిరసనగా హరేగావ్‌లో బంద్ పాటించారు. స్థానిక విపక్ష కాంగ్రెస్ ఈ ఘటనకు బీజేపీ వ్యాపింపజేస్తున్న విద్వేషమే కారణమని ఆరోపించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 25న గ్రామానికి చెందిన నలుగురు దళితయువకుల ఇళ్లలోకి చొరబడిన ఆరుగురు యువకులు బలవంతంగా వారిని బయటకు తీసుకువచ్చారు. బాధిత యువకుల వయసు 20 ఏళ్లకు అటునిటుగా ఉంటుంది. ఆ యువకులు మేకలు, పావురాలు దొంగిలించారని ఆరోపిస్తూ, వారిని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో విపరీతంగా కొట్టారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను యువరాజ్, మనోజ్, పప్పు పార్ఖే, దీపక్, దుర్గేష్, రాజులుగా గుర్తించారు. ఈ నిందితులలో ఒకరు ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించారు. తరువాత దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బాధితులను స్థానికులు సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. బాధితులలో ఒకరైన శుభం మగాడే జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు నిందితులపై సెక్షన్ 307 (హత్యాయత్నం),360 (కిడ్నాప్), ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే మాట్లాడుతూ ఈ ఉదంతం మానవత్వానికే మాయనిమచ్చ అని అన్నారు. నిందితులు ఎంతటివారైనా వారిని వెంటనే అరెస్టు చేయాలని, వారికి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అధికార బీజేపీ దళితులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యిందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు?
Comments
Please login to add a commentAdd a comment