రాశీలాంటి అమ్మాయి భార్యగా అంటే...
నో కన్‌ఫ్యూజన్
యూత్ ఎప్పుడూ కన్‌ఫ్యూజన్‌లో ఉంటుంది. ఏది ఫ్రెండ్షిప్? ఏది రిలేషన్‌షిప్? ఏది లవ్? ఏది ఎట్రాక్షన్? ఏది టైమ్ పాస్? ఏది లైఫ్ టైమ్? ఈ డౌట్స్ అన్నిటికీ సైకాలజిస్టుల దగ్గర ఆన్సర్ దొరుకుతుంది. ఐతే, అంతకన్నా మంచి పని... ఈ ‘స్వీట్ చాట్’ చదవడం. ఎందుకంటే.. రాశీఖన్నా, సాయిధరమ్‌తేజ్‌లకు లవ్ మీద, లైఫ్ మీద.. మంచి క్లారిటీ ఉంది.
మీ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్సా? మామూలు ఫ్రెండ్సా?
రాశి: మేం ఒకే ఫ్రొఫెషన్‌లో ఉన్నాం. కలిసి పనిచేయడం వల్ల ఎవరు ఏంటన్నది అవగాహన వస్తుంది. మంచి స్నేహం ఏర్పడుతుంది. మా మధ్య ఉన్నది మంచి స్నేహం. ప్రొఫెషనల్‌గా అడ్వయిజ్ తీసుకోవడానికి వెనకాడను. మరీ.. పర్సనల్ విషయాలంటే షేర్ చేసుకోను.
సాయిధరమ్ తేజ్: నాది కూడా సేమ్ ఫీలింగ్. రాశి నాకు మంచి ఫ్రెండ్. అయితే నా మిగతా ఫ్రెండ్స్‌తో ఉన్నంత చనువుగా తనతో ఉండలేను. ప్రొఫెషనల్‌గా అయితే సెట్‌లో ఉన్నప్పుడు తను మంచి ఫ్రెండ్ అని మాత్రం పక్కాగా చెప్పగలను. నా చిన్నప్పటి ఫ్రెండ్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. చిన్నప్పుడు నవీన్ అనే మంచి ఫ్రెండ్ ఉండేవాడు. నా ఫ్రెండ్స్‌లో అమ్మాయిలు కూడా ఉన్నారు. ఒక అమ్మాయికి పెళ్లి కూడా అయింది. అందరూ చిన్నప్పటి ఫ్రెండ్స్ కాబట్టి మా కంఫర్ట్ లెవల్ బాగుంటాయి. రాశీతో అది కుదరకపోవచ్చు.
రాశీలో మంచి ఫ్రెండ్ ఉంటుందా? గాళ్ ఫ్రెండ్ ఉంటుందా? మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో మీకు ఏమనిపించింది?
సాయి: నెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ చేయాలి? అని నేను తెగ ఆలోచించేవాణ్ణి. ఒక్కోసారి డల్ అయ్యేవాణ్ణి. అప్పుడు రాశీ ‘ఎందుకంత కంగారు పడుతున్నావ్? కూల్‌గా ఉండు’ అని ధైర్యం చెప్పేది. యాజ్ ఏ ఫ్రెండ్ సపోర్టివ్‌గా ఉంటుంది. రాశి మంచి కూతురు కూడా. షూటింగ్ టైమ్‌లో ఎక్కువగా వాళ్ల మదర్‌తోనే కనిపించేది. వాళ్ల నాన్నతో కూడా రాశీకి ఎక్కువ అటాచ్‌మెంట్. ఆ ముగ్గుర్నీ చూసినప్పుడు మంచి ఫ్యామిలీ అనిపించేది. ఇక.. రాశీ మంచి గాళ్ ఫ్రెండా? అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే, నేను తనను ఆ యాంగిల్‌లో చూడలేదు.
మరి.. సాయిధరమ్ గురించి మీరేమంటారు?
రాశి: చాలా మంచి అబ్బాయి (నవ్వుతూ). యాజ్ ఎ ఫ్రెండ్ వెరీ సపోర్టివ్. నాలానే తను కూడా అమ్మ కూచి. సాయినీ, వాళ్ల అమ్మనీ చూస్తుంటే ముచ్చటేస్తుంది. తను మంచి కొడుకు కూడా. మంచి బాయ్‌ఫ్రెండా? అనే విషయం గురించి మాత్రం చెప్పలేను. ఓవరాల్ పర్సన్ గురించి చెప్పమంటే ‘గుడ్ హ్యూమన్ బీయింగ్’.
రాశీలాంటి అమ్మాయి భార్యగా అంటే.. ఆ భర్త జీవితం బాగుంటుందా?
సాయి: తను చాలా అడ్జెస్టబుల్. ఓపిక ఎక్కువ. సెట్స్‌లో మేం చూసేవాళ్లం కదా. ఏదైనా సీన్ కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు ముందు ‘ఊహూ..’ అన్నప్పటికీ తర్వాత అడ్జస్ట్ అయ్యి చేసేసేది. అలాంటి నేచర్ ఉన్న అమ్మాయి కచ్చితంగా మంచి భార్యే అవుతుంది.
మరి.. సాయి మంచి భర్త అవుతాడా?
రాశి: ఆడవాళ్లను గౌరవించే ఏ మగాడైనా మంచి భర్తే అవుతాడు. అమ్మను బాగా చూసుకునేవాళ్లు భార్యను బాగా చూసుకుంటారు. సో.. సాయి గుడ్ హజ్బెండ్ అవుతాడు.
సాయిలాంటి క్వాలిటీస్ ఉన్న భర్త రావాలనుకుంటున్నారా?
రాశి: సాయిలాంటోడా? అస్సలు వద్దండి. సాయికన్నా మంచి ఎత్తు ఉన్న అబ్బాయిని భర్తగా కోరుకుంటున్నా.
టూ మచ్ రాశి.. సాయి మంచి హైటే కదా..
సాయి: ఆవిడగారి ముందు నేను చాలా పొట్టి (టీజింగ్‌గా చూస్తూ) అని ఫీలవుతోందేమో. నేనెంతండీ... ఆరుడగులకు దగ్గర దగ్గరగా ఉంటానేమో. మేడమ్‌కి 6.2.. ఆ రేంజ్ కావాలేమో.
సాయి.. రాశీ లాంటి అమ్మాయిని భార్యగా కోరుకుంటారా?
సాయి: ఇలాంటి లక్షణాలున్న అమ్మాయి రావాలనుకోవడం వేరు. ఈ అమ్మాయే కావాలనుకోవడం వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనీ రెండు విషయాల గురించి ఆలోచించడంలేదు. అంత వయసు కూడా నాకు లేదు. నాకెంతండీ జస్ట్ పంతొమ్మిదేళ్లే (చమత్కారంగా).
అవునూ.. ‘సుప్రీమ్’ షూటింగ్ అప్పుడు ‘రాశీ కా స్వయంవర్’ అని ఏదో ఆట ఆడారట?
సాయి: ఓ.. అదా. కరీంనగర్‌లో షూటింగ్ చేయడానికి వెళ్లాం. నేను, ‘సత్యం’ రాజేష్, ప్రభాస్ శ్రీను, శ్రీనివాస్‌రెడ్డి, ‘దిల్’ రాజుగారు, అనిల్ రావిపూడి, ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులున్నారు. అప్పుడందరం కలిసి ‘రాశీ కా స్వయంవర్’ అంటూ ఓ చిన్న గేమ్ ప్లాన్ చేశాం. ఆ గేమ్‌లో విన్నర్ ఎవరో తెలుసా? ‘వెన్నెల’ కిశోర్.
స్వయంవరం పేరుతో మిమ్మల్ని ఆటపట్టించారు కదా.. మరి సాయి గురించి ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ చెబుతారా?
రాశి: (నాన్‌స్టాప్‌గా నవ్వుతూ). ఒక్క ఇన్సిడెంట్ ఉందండి.. ఎప్పుడు తల్చుకున్నా నవ్వొచ్చేస్తుంది.
సాయి: నాకు తెలుసు.. ఏం ఊహించుకుని నవ్వుతున్నావో? ఈ సినిమాలో పిల్లనడగడానికి నేను పంచె కట్టుకుని రాశీ వాళ్ల ఇంటికి వెళతాను కదండీ. ఆ సీన్ తీసేటప్పుడు నేను జోరుగా డైలాగ్‌లు చెబుతూ, అన్నీ మర్చిపోయి యాక్ట్ చేస్తున్నా. ఇంతలో కాళ్లకు చల్లగాలి తగిలినట్లనిపించినా పట్టించుకోలేదు. అందరూ నన్నే చూసి నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు కింద చూసుకుంటే పంచె లేదు. ఎప్పుడు జారిపోయిందో తెలియదు.
రాశి : భలే ఊహించావే. నేనూ దాని గురించే చెబుదామనుకున్నా. నిజంగానండి.. ఒంటి మీద స్పృహ లేనట్లు పంచె జారిపోయింది కూడా పట్టించుకోకుండా యాక్ట్ చేశాడు. సిన్సియర్ ఆర్టిస్ట్ కదా (భుజాలెగరేస్తూ).
ఓకే రాశి... మీ ఇద్దరికీ ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఫ్రెండ్‌తో సాయిధరమ్ లవ్ అనే టాక్ వినిపిస్తోంది. మరి.. ఆ ఫ్రెండ్ ఎప్పుడైనా మీకీ విషయం చెప్పారా?
సాయి: రెజీనా అని డెరైక్ట్‌గా అడిగేయొచ్చు కదండి.. ఏం చెబుతావో చెప్పు రాశి.
రాశి: దట్స్ నాట్ ట్రూ. వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని వస్తున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే. కొంచెం చనువుగా ఉన్నా, వరుసగా మూవీస్ చేస్తున్నా అలాగే రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు.
సాయి: అవునండి. కంటిన్యూస్‌గా రెండు సినిమాలు కలిసి చేస్తే, ఏదో ఉన్నట్లేనా? పాత సినిమాల్లో చిరంజీవిగారు, బాలకృష్ణగారు, నాగార్జునగారు, వెంకటేష్‌గారు.. రిపీట్ కాంబినేషన్లలో సినిమాలు చేసేవారు. అప్పుడు ఇటువంటి రూమర్స్ లేవండి. కానీ, ఇప్పుడు రెండే రెండు సినిమాల్లో కలిసి చేసినా, పెద్ద విషయం అయిపోతోంది. రాసేవాళ్లను మనం ఆపలేం. నిజంగానే లవ్‌లో ఉంటే నేనా విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తా.
అవును రాశీ.. మిమ్మల్ని ఏ హీరోతోనూ లింకప్ చేసి, వార్తలు రావడంలేదేం?
రాశి: ఎందుకండీ. నేనిలా ఉండటం మీకిష్టం లేదా?
సాయి: అయినా ఇంకా రాశి ఒకే హీరో సరసన రెండు సినిమాలు చేయలేదు కదా. చేస్తే కచ్చితంగా తన గురించి కూడా రూమర్స్ వచ్చేస్తాయ్ (నవ్వేస్తూ).
ఓకే.. మీలో ఒకరికొకరు గమనించిన బ్యాడ్ క్వాలిటీస్?
సాయి: తను ఎక్కువ నవ్వుతుందండి. ఒకసారి రాత్రి మూడు గంటల వరకూ షూటింగ్ చేశాం. ఆరోజు నేను ఫైట్ సీన్ చేసి, అలసిపోయాను. ఎప్పుడెప్పుడు అవుతుందా? అని నేను ఆలోచిస్తుంటే.. రాశి నవ్వడం స్టార్ట్ చేసింది. ఆ నవ్వు వల్ల ఆరు టేక్స్ తీసుకున్నాం. దాంతో ‘ఏయ్, చంపేస్తాను.. విసుగు తెప్పించకు. నువ్వు నవ్వితే నావల్ల కాదు. నాకూ నవ్వొస్తోంది’ అని సరదాగా వార్నింగ్‌లాంటిది ఇచ్చా. ఆ తర్వాత కాసేపు బుద్ధిగా ఉన్నా.. మళ్లీ మామూలే. సిట్యువేషన్ పట్టించుకోకుండా అలా నవ్వడం బ్యాడ్ రాశి.
రాశి: ఆ.. నీక్కూడా బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయిలే. ఎప్పుడూ ఫోన్‌లో చాట్ చేస్తుంటాడండి. పరిసర ప్రాంతాలను మర్చిపోయి మరీ ఫోన్‌తో ఎంగేజ్ అయిపోతాడు. వాళ్ల మమ్మీ దగ్గర కంప్లైంట్ చేశా.
ఫోన్‌లో సాయి ఎవరితో చాట్ చేస్తున్నారో చూశారా?
రాశి: అంత డీప్ విషయాలు పట్టించుకోను (నవ్వుతూ).
ఎప్పుడైనా రాశి మీకేమైనా వండి తెచ్చిందా?
సాయి: అబ్బే లేదండి. ఆవిడగారు వండి పెట్టాలంటే దానిక్కూడా ఆరడుగుల హైట్ ఉండాలేమో (నవ్వుతూ).
రాశి: మరీ చెబుతున్నావ్... ఒకసారి నేను షూటింగ్ లొకేషన్‌కి కప్ కేక్స్ తెచ్చాను కదా.. మర్చిపోయావా?
సాయి: యస్.. కప్ కేక్స్ బేకరీ నుంచి కొనుక్కొచ్చిందండి.
ఇంతకీ మీ ఫస్ట్ లవ్?
సాయి: ఆల్‌మోస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంజినీరింగ్ వరకు చాలామంది అమ్మాయిల్ని ‘ఆర్య’లో పాటలా ‘ఫీల్ మై లవ్...’ అంటూ వెంటపడ్డా. వర్కవుట్ కాలేదు. అందుకే అటువైపు ఫోకస్ మానేసి, సినిమాలపై పెట్టా.
రాశి : నేనెవర్నీ లవ్ చేయలేదు. నన్ను కూడా ఎవరూ లవ్ చేయలేదు (గట్టిగా నవ్వేస్తూ).
ఫ్రెండ్‌షిప్ వేరు. అట్రాక్షన్ వేరు. ఫ్రెండ్‌ని ఫ్రెండ్‌లానే చూస్తాం తప్ప వాళ్ల గురించి వేరే ఏ ఫీలింగ్స్ ఉండవు. లవర్‌ని ఫ్రెండ్‌లా చూడొచ్చు కానీ, ఫ్రెండ్‌ని లవర్‌లా చూడలేం. ‘‘ఈ అమ్మాయి నాతోనే ఉండాలి’’ అనే ఫీలింగ్ ఫ్రెండ్‌షిప్ చేస్తున్న అమ్మాయితో కలగదు కదా. అలా ఎవరైనా అమ్మాయి కనెక్ట్ అయినప్పుడు ప్రపంచం మొత్తం మారిపోతుంది. జీవితం అంటే ఇదే అనిపిస్తుంది.
ఫ్రెండ్‌షిప్ వేరు.. రిలేషన్‌షిప్ వేరు. రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్లతో జీవితం పంచుకుంటాం. ఫ్రెండ్స్‌తో జీవితం పంచుకోం. కానీ, ఫ్రెండ్స్ ఉండాలండి. నాకు చాలామంది ఉన్నారు. ఎనీ టైమ్ ఏదైనా చెప్పుకునేంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కుటుంబ సభ్యులతో పాటు మంచి ఫ్రెండ్స్ ఉంటే జీవితం బాగుంటుంది.
- డి.జి. భవాని