
ఆ గణపతి శివభక్తుల అఖండ భక్తికి, శ్రీశైలయాత్రకు తొలిసాక్షి. ఇల కైలాసపు విశేషాలకు ముఖ్య సాక్షి. క్షేత్రానికి వచ్చే జన నానుడిలో శ్రీశైలయాత్ర చేసేవారు ముందుగా సాక్షిగణపతిని దర్శించి క్షేత్రానికి వచ్చినట్లుగా తెలుపుకోవాలనీ, ఆయన ఈ యాత్రను నమోదుచేసి తన తండ్రి మల్లికార్జునస్వామివారికి, తల్లి భ్రమరాంబాదేవికి తెలియజేస్తాడని కథనం. అపు‘రూపం’ గణపతి రూపాలలోనే అత్యంత విశిష్టమైన రూపం ఇదని క్షేత్ర మాహాత్మ్యం చెబుతోంది. ఈ రూపం మరే ఇతర గాణాపత్య సాహిత్యంలోను మనకు దొరకదు. ఈ మూర్తి ఆసీన రూపంలో కొలువై వుంటాడు. ప్రసన్న వదనంతో, వక్రతుండంతో, ఎడమచేత పుస్తకాన్ని, కుడిచేత లేఖిని (కలం)ని, మిగిలిన రెండు చేతులతో పాశం, అంకుశం ఆయుధాలను ధరించి దర్శనమిస్తాడు. ఓంకార గణపతి ఓనమాలు దిద్దుతూ పుస్తకంపై ఆయన లిఖిస్తున్న ఓనమాలు శివపంచాక్షరీ (ఓం నమశ్శివాయ) మంత్రమే. అక్షరాలను లిఖిస్తూ కనిపిస్తున్న ఈ స్వామిని వ్రాతపతి అని అధర్వణ వేదం తెలిపింది. ముద్గల పురాణం చెప్పిన 32 గణపతి రూపాలో ద్విజగణపతి రూపానికి, ఈ సాక్షిగణపతి రూపానికి చాలా దగ్గర పోలిక వుంది. అక్కడ కూడా స్వామి పుస్తకం, లేఖిని మొదగు ఆయుధాలతో దర్శనమిస్తాడు. పుస్తకం, లేఖిని అజ్ఞానాన్ని, అవిద్యను నాశనం చేసే ఆయుధాలే. కనుక ఈ గణపతిని పూజిస్తే విద్య లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.
మహాభారతం నాటి రూపం
ఐదవ వేదంగా ప్రసిద్ధి పొందిన మహాభారతం రచించింది వేదవ్యాసుడైనా , కొన్ని లక్షల శ్లోకాలను నిరాటంకంగా గణపతి లిఖించాడు. ప్రస్తుతం శ్రీశైలంలోని సాక్షిగణపతి రూపం ఆ లేఖక గణపతిని గుర్తుకు తెస్తుంది. అయితే ఇక్కడ వ్యాసుడు మాత్రం మనకు కనపడడు. శ్రీశైలం యుగయుగాల నాటిదని క్షేత్రపురాణం చెబుతోంది. ద్వాపర యుగంలో పంచపాండవులు ద్రౌపదితో కలిసి క్షేత్రానికి వచ్చినట్లు క్షేత్ర మాహాత్మ్యం తెలుపుతోంది.
– డా. ఛాయా కామాక్షీదేవి