కాకర్ల వంశీకృష్ణ అనే కార్తీక్‌ | Special Story About Serial Actor Vamshi Krishna | Sakshi
Sakshi News home page

కాకర్ల వంశీకృష్ణ అనే కార్తీక్‌

Published Wed, Mar 4 2020 5:18 AM | Last Updated on Wed, Mar 4 2020 5:18 AM

Special Story About Serial Actor Vamshi Krishna - Sakshi

ఈ రోజుల్లో బుల్లితెర అందిస్తున్న అవకాశాలు మెండు. వాటికి తగిన విధంగా తెలుగు వారే కాదు కన్నడ, తమిళ ఆర్టిస్టులూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ప్రాంతాల అడ్డుగోడలను చెరిపేస్తూ బుల్లితెర అభిమానాన్ని మూటగట్టుకుంటూ ఉంటారు. అలా వచ్చినవాడే కార్తీక్‌. కన్నడ ఆర్టిస్ట్‌ అయినా తెలుగు బుల్లితెర నటుడిగా రాణిస్తూ ‘మాటే మంత్రం’ అంటూ మెప్పిస్తున్నాడు కార్తీక్‌. కాకర్ల వంశీకృష్ణగా బుల్లితెర ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్న కార్తీక్‌ చెబుతున్న కబుర్లివి.. ‘‘వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ మనల్ని మనం నిరూపించుకుంటూ వెళ్లాలి. ప్రతీ పాత్రకు లైఫ్‌ ఉంటుంది. ఈ పాత్ర అయితేనే చేస్తాను అని ఈ ఇండస్ట్రీలో గిరిగీసుక్కూర్చోనక్కర్లేదు. సినిమాలకు రావాలనే ఆలోచనల్లో ఉండగానే బుల్లితెరపై నటించే అవకాశాలు వచ్చాయి. వాటిని వినియోగించుకుంటూ నన్ను నేను నిలబెట్టుకునే ్రçపయత్నం చేస్తున్నాను.

‘మాటేమంత్రం’ సీరియల్‌ ద్వారా కాకర్ల వంశీకృష్ణగా తెలుగువారి అభిమానం పొందుతున్నందుకు ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఆరిస్టుగా రాణించాలనే ఆలోచన ఉండేది. అందుకు కాలేజీ రోజుల నుంచే ఆడిషన్స్‌కి వెళ్లడం మొదలుపెట్టాను. బిఎస్సీ పూర్తయ్యాక ఆరునెలల పాటు దాదాపు అన్ని టీవీ ఆడిషన్స్‌కి వెళ్లాను. పుట్టి పెరిగింది అంతా మైసూరులో. కన్నడలో ఖుషి, అక్క, మహాకాళీ, శని.. సీరియల్స్‌లో నటించాను. తమిళంలోనూ ఓ సీరియల్‌లో నటించాను. తెలుగు, కన్నడ, తమిళ నటుడిగా మంచి గుర్తుంపు పొందాలన్నదే నా అభిలాష. ‘జీ’ తెలుగులో వస్తున్న మాటేమంత్రం సీరియల్‌లో కాకర్ల వంశీకృష్ణగా లీడ్‌రోల్‌లో నటిస్తున్నాను. అన్నీ చెడు అలవాట్లు ఉన్న వ్యక్తిగా ఈ సీరియల్‌లో కనిపిస్తుంటాను. వంశీకృష్ణ దగ్గర పి.ఎగా వసుంధర చేరుతుంది. చాలా మంచి అమ్మాయి. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల నేర్పు, ధైర్యం గల అమ్మాయి. వంశీకృష్ణకు వసుంధరతో పెళ్లి అవుతుంది. అక్కణ్ణుంచి వంశీకృష్ణలో కుటుంబ విలువలతో కూడిన మార్పు వస్తుంటుంది. ఈ క్రమంలో వచ్చే ఒడిదొడుకులు, మార్పులు.. వంటి అంశాలతో ‘మాటేమంత్రం’ సీరియల్‌ నడుస్తుంది. మంచి రేటింగ్‌తో ఉన్న ఈ సీరియల్‌ రీప్లేసింగ్‌ ద్వారా నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్ర దొరికింది.

అమ్మనాన్నల ప్రేమ
యాక్టింగ్‌ అనేది ప్రతి రోజూ కొత్తగానే ఉంటుంది. సీనియర్స్‌ నటన చూసే కాదు స్క్రీన్‌పై నన్ను నేను చూసుకుంటూ ఇంకాస్త మెరుగుపరుచుకుంటూ ఉంటాను. మొదట ఈ ఫీల్డ్‌వైపు రావడానికి అమ్మనాన్నలు అంతగా ఆసక్తి చూపలేదు. ‘చదువుంది, లేదంటే నాన్న చేసే ఫ్యాబ్రిక్‌ బిజినెస్‌ చూసుకో’అన్నారు. కానీ, నా ఇష్టాన్ని కాదనలేకపోయారు. అమ్మ గృహిణి. అక్క ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేస్తున్నారు. ఇంట్లో ఇప్పుడు నా సీరియల్స్‌ చూస్తూ ‘నెక్ట్స్‌ ఏమవుతుంది స్టోరీలో’ అని అడుగుతుంటారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. టీవీ ఇండస్ట్రీ అంటే నిలకడలేని జాబ్‌ అన్నారు కానీ, ఎప్పుడూ నన్ను వెనక్కిలాగాలని ప్రయత్నించలేదు. ప్రయత్నించు.. ఏ మాత్రం సౌకర్యంగా లేకున్నా వెనక్కి వచ్చేయ్‌ అన్నారు. కుటుంబం నుంచి ఫుల్‌ సపోర్ట్‌ ఉంటే ఇష్టమైన ఫీల్డ్‌లో హ్యాపీగా రాణించవచ్చు. నా విషయంలో ఇది నిజమైంది. మహాకాళీ, శని సీరియల్స్‌లో నారాయణుడిగా నటించాను. దైవ పాత్రల్లో నటిస్తున్నప్పుడు తెలియని అలౌకిక భావన నన్ను చుట్టుముట్టేది. నారాయణుడి పాత్రకు సంబంధించిన సన్నివేశాలు టీవీలో చూసిన అమ్మనాన్నలు ‘ఎంత బాగా చేశావు నాన్నా’ అన్నప్పుడు కలిగిన ఆనందం వెలకట్టలేనిది.

ఆటలంటే పిచ్చి
నటనతోపాటు స్పోర్ట్స్‌ అంటే బాగా పిచ్చి. క్రికెట్, ఫుట్‌బాల్‌ను బాగా ఇష్టపడతాను. కాస్త ఖాళీ సమయం దొరికినా గ్రౌండ్‌లో ఉండేలా చూసుకుంటాను. ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లడం నాకున్న మరో అలవాటు. కాస్ట్యూమ్స్‌ కోసం పాపింగ్‌ చేయడమే కాదు డిజైనర్‌ డ్రెస్సులకు సంబంధించిన వాటికి అప్పుడప్పుడు మా సిస్టర్‌ అడ్వైజ్‌ కూడా తీసుకుంటూ ఉంటాను. నటనలోనే కాకుండా ఒక మంచి కథతో నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది. అందుకే సీరియల్‌ కథ రెడీ చేస్తున్నాను.’’ సంభాషణ:  నిర్మలారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement