
∙ౖ‘టెగర్ జిందా హై’ సినిమాలో కత్రీన్ కైఫ్, సల్మాన్ ఖాన్ : ప్రతీకాత్మక చిత్రం
భారత్, పాకిస్తాన్ ఒక ఇంటి పిల్లలు. తర్వాత వేర్వేరు ఇళ్లు కట్టుకున్నారు. అంతటితో ‘వేరు వారు’ అయిపోతారా? అందుకని ఇద్దరి కుటుంబాల్లో వైరం కాపురం చెయ్యాలా?! దశాబ్దాలుగా ఈ వైరాన్ని ఇతరులు వాడుకుంటున్నారు. కలిసి పోరాడితే రెండిళ్లూ చల్లగా ఉంటాయి.
మాటల్లేవ్. మాట్లాడుకోవడాల్లేవ్. ఆటల్లేవ్. ఆట్లాడుకోవడాల్లేవ్. పాటల్లేవ్. పాడుకోవడాల్లేవ్. అటువైపు కవ్వా ఇటువైపు, ఇటువైపు కాకి అటువైపు.. ‘వాఘా’ బోర్డర్ దాటి వాలిపోవడానికి లేదు. దారి తప్పి వాలిందా? దాహమయ్యి వాలిందా? దేహం తూలి వాలిందా? దేశ బంధమే పట్టి లాగిందా? ఎవరిక్కావాలి?మన పగ మనక్కావాలి. మన ప్రతీకారం మనక్కావాలి. ఎవరి సావరినిటీ వారిది. ఎవరి శతఘ్నులు వారివి. ఎవరి ఎమోషన్స్ వారివి. ఉమ్మడిగా ఉన్నది... ఎవర్‌గ్రీన్ నేషనల్ సాంగ్ ఒకటే. ‘‘సమరమే.. నా కనులను సూటిగ చూస్తే. నా ఎదుటకు నేరుగ వస్తే. నా పిడికిలి వాడిగ వేస్తే.. యేయ్యే...’’ బోర్డర్ దగ్గర ఇదే సాంగ్. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్‌లో ఇదే సాంగ్. ‘రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్’లో ఇదే సాంగ్. ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్’లో ఇదే సాంగ్. యునైటెడ్ నేషన్స్‌లోనూ ఇదే సాంగ్! ‘పుట్టినిల్లు–మెట్టినిల్లు’ సినిమాలో శోభన్‌బాబు.. స్టేజెక్కి పాడుతుంటాడు. ‘ఇదే పాట.. ప్రతీచోటా.. ఇలాగే పాడకుంటానూ..’ అని. అలా పాడుకుంటున్నాం. పలుకలేని వలపులన్నీ ఆ పాటలో దాచుకుంటాడు శోభన్‌బాబు.
మనమూ అంతేనా! మనసుల్లో ప్రేమను దాచుకుని దేశం కోసం లేని ద్వేషాన్ని పాడుకుంటూ తిరుగుతున్నామా? కట్లిప్పితే, గేట్లు తెరిస్తే, పహారా కాస్తున్న తుపాకుల్ని తిరగదిప్పి భూమిలోకి పాతేస్తే.. పరుగున వెళ్లి మనిషిని హత్తుకుంటామా? గట్టిగా ఆలింగనం చేసుకుంటామా? జ్ఞాపకాల మూటను విప్పి ఒక్కో బంగారు వరహా తీసి ‘మిఠాయి కొనుక్కో పో’ అని మురిపెంగా పిల్లల చేతిలో పెట్టి పంపించి, విభజనకు ముందునాటి స్నేహితుడి చేతిని గబుక్కున లాక్కుని.. మట్టిలో ఆడుకోవడానికి పిల్లల్లా పరుVð త్తి వెళ్లిపోతామా? ‘అల్లాయే దిగివచ్చి, ఆవ్ మియా.. ఏమి కావాలంటే..’ ఒకే దేశమై నిలిచే నిప్పులాంటి మనిషిగా మార్చమంటామా? అవును! కచ్చితంగా అవును. రెండు దేశాలు కావు మనవి. రెండు ఇళ్లు. ఇరుగిళ్లు కావు. పొరుగిళ్లు కావు. పుట్టినిల్లు. మెట్టినిల్లు. రెండూ మన సొంతం. రెండూ మన బంధం. మాటలు బంద్ అయినంత మాత్రాన, మనసులు బంద్ అయిపోతాయా?! మ్యాచిలు బంద్ అయినంత మాత్రాన, మమతలే లేకుండా పోతాయా?! చర్చలు బంద్ అయినంత మాత్రాన, ‘రీయూనియన్’ సమాధి అయిపోతుందా? మమకారపు మెమరీలు మంచులా గడ్డకట్టి అలా ఏళ్లకు ఏళ్లు ఉండిపోతే పోవచ్చు. వాటికి కొద్దిపాటి వెచ్చదనం చాలు. కరిగి కన్నీళ్లవడానికి.
రెండు దేశాల మధ్య నాలుగు యుద్ధాలు జరిగాయి. అవెవరికీ గుర్తు లేవు. 2013లో ‘రీయూనియన్’ గూగుల్ యాడ్ వచ్చింది. అది గుర్తుంది. అంతకుముందు 2012లో ‘ఏక్ థా టైగర్’ రిలీజ్ అయింది. అది గుర్తుంది. 2017లో ‘టైగర్ జిందా హై’ గాండ్రించింది. అదీ గుర్తుండిపోయేలా ఉంది. రెండు దేశాల మధ్య రోజూ ఓ మాటల యుద్ధం జరుగుతోంది. అవేవీ గుర్తుండేవి కావు. మోదీ సడన్‌గా లాహోర్‌లో ల్యాండ్ అయి, అక్కడి నుంచి నేరుగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటికెళ్లి ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పాడు. అది గుర్తుంది. ఎం.ఎస్.ధోనీ.. కెప్టెన్ సర్ఫ్రాజ్ అహ్మద్ కొడుకుని ముద్దుగా చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అది గుర్తుంది. అతిఫ్ అస్లాం, సోనూ నిగమ్ కలిసి సరిగమలకు సరిహద్దులు లేవని, రాగాలకు రాజకీయాలు తెలియవని కచేరీ ఇచ్చారు. అది గుర్తుంది. పొరపాటున బోర్డర్ దాటిన గీత అనే అమ్మాయిని తిరిగి ఇండియా చేర్చడం కోసం రెండు దేశాలూ కలిసి పనిచేశాయి. అది గుర్తుంది. కరాచీ నుంచి ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన ఒక అమ్మాయి కోసం ముంబై ప్రజలు నాలుగున్నర లక్షల రూపాయాలు విరాళలు సేకరించారు. అది గుర్తుంది. అంటే.. ప్రేమ బతికే ఉంది! ప్యార్ జిందా హై. మరెందుకు మనం కలిసి పోరాడకూడదు?
‘రీయూనియన్’ యాడ్‌లో.. ఇండియాలో ఉన్న బలదేవ్‌మెహ్రా అనే ఆయన మనవరాలు, గూగుల్‌లో సెర్చ్ చేసి, లాహోర్‌లో ఉన్న తన తాతగారి చిన్ననాటి స్నేహితుడు యూసుఫ్‌ను వెదికిపట్టి, అక్కడ ఆ స్నేహితుడి మనవడి సహాయంతో యూసుఫ్‌ని బలదేవ్ బర్త్‌డేకి ఢిల్లీ రప్పిస్తుంది. వస్తూ వస్తూ ఆ స్నేహితుడు బలదేవ్‌కి చిన్నప్పుడు ఇష్టమైన స్వీట్స్‌ని తెస్తాడు. బలదేవ్ ఫీలింగ్స్ చూడాలి అప్పుడు! ఇద్దరూ హత్తుకుంటారు. మనం కళ్లొత్తుకుంటాం. అంత ఎమోషన్ కురుస్తుంది ఆ బాండింగ్‌లో. ఈ యాడ్ తర్వాత రెండు దేశాల మధ్య దూరం కొద్దిగానైనా తగ్గి ఉంటుంది అని ‘వాషింగ్టన్ పోస్ట్’ రాసింది!
‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ లు కూడా అంతే! సీక్వెల్స్ ఇవి. సల్మాన్, కత్రీనా హీరో హీరోయిన్‌లు. సల్మాన్‌ది ఈ దేశం. కత్రీనాది ఆ దేశం. సల్మాన్ ‘రీసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్’లో (రా) స్పై. కత్రీనా ఐ.ఎస్.ఐ. ఏజెంట్. ముఖ్యమైన టాస్క్‌లో వేరే దేశంలో కలుస్తారు. లవ్‌లో పడతారు. ఆ తర్వాత రెండు దేశాలను లవ్‌లో పడేసే పనిలోనూ పడిపోతారు! అపనమ్మకాలతో, అనుమానాలతో, అర్థంలేని ఆధిక్యభావనలతో.. రక్షణ కోసం, ఆయుధాల కోసం ఈ రెండు దేశాలు చేస్తున్న లక్షల కోట్ల రూపాయల ఖర్చును పిల్లల కోసం, మహిళల కోసం, విద్యకోసం, అభివృద్ధి కోసం వినియోగిస్తే.. ‘రా’లతో, ‘ఐ.ఎస్.ఐ’ లతో పనేముంది అంటారు హీరోహీరోయిన్‌లు. ఆ రెండింటితోనూ అవసరం రోజు మాత్రమే తిరిగి వస్తామని వాళ్ల వాళ్ల దేశాలకు చెప్తారు. ఆ రోజు ఎప్పుడొస్తుంది? బయటి శత్రువులతో కలిసి పోరాడితే వస్తుంది. దేశాలన్నాక సరిహద్దులు ఉండకపోవు. చట్టాలు ఉండకపోవు. ప్రభుత్వాలు ఉండకపోవు. పాత మనస్తాపాలు ఉండకపోవు. అలాగని విడిపోయిన దేశాల్లోని మనుషుల మధ్య బంధాలు, బాంధవ్యాలు లేకుండాపోవు. కలిసి పోరాడితే అవి మరింత బలపడతాయి. ఇరుదేశాల్లో స్నేహ కుసుమాలు వికసిస్తాయి. శాంతి విప్లవించి, సుస్థిరత పరిఢవిల్లుతుంది. ఉగ్రవాదాలు, అగ్రరాజ్య స్వార్థ ప్రయోజనాలు బొరియల్లోకి వెళ్లిపోతాయి.
కళ్లల్లో నీళ్లు తిరిగాయి
‘‘ఫస్ట్‌టైమ్ నేను పాకిస్తాన్‌కు వెళ్లింది 2005, కాలేజ్‌డేస్‌లో. నేను, నా ఫ్రెండ్ ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం పాకిస్తాన్ వెళ్లిరావాలని. మా ఇంట్లో వాళ్లు భయపడ్డారు. శత్రుదేశం వెళతారా? అని వారించారు. వెళితేనే కదా తెలిసేది వాళ్లు శత్రువులు కాదు మిత్రులు అని. అందుకే వెళ్లాం. ఢిల్లీ నుంచి లాహోర్‌కు బస్‌లో బయలుదేరాం. బస్‌లో మా పక్కన కూర్చున్న పాకిస్తానీయులు.. మేమిద్దరమే లాహోర్‌కు వెళ్తున్నామని, అదీ ఫస్ట్ టైమ్ అని తెలిసీ వాళ్లింట్లో ఉండమని కోరారు. బస్ దిగాక కూడా మా ఇంటికి రండి అంటూ చాలాసేపు అడిగారు. సున్నితంగా తిరస్కరించి హోటల్‌లో ఉన్నాం. ఎక్కడా ఏ ఇబ్బంది ఎదురు కాలేదు. లాహోర్‌లోని అనార్కలీ మార్కెట్‌లో మేం తిరుగుతుంటే.. అక్కడున్న చాయ్, సమోసా హోటళ్లు వాళ్లు మేం ఇండియా నుంచి వచ్చామని తెలుసుకొని ‘‘అరే హిందుస్తాన్ నుంచి మా చెల్లెళ్లు వచ్చారు గరంగరం సమోసా, చిక్కటి చాయ్ తెండి’’ అంటూ బాయ్స్‌కు ఆర్డర్ వేశారు. అక్కడున్న మూడు రోజులు మాకు ఫ్రీ సమోసా, ఫ్రీ చాయ్ ఇచ్చారు. ఎంతో మంది స్నేహితులయ్యారు. అందరూ వాళ్లింట్లో ఉండమని ఆతిథ్యమిస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత పదేళ్లకు 2015లో మళ్లీ పాకిస్తాన్ వెళ్లాల్సి వచ్చింది ఓ సినిమా వర్క్ మీద. పదేళ్ల కింద ఫ్రెండ్స్ అయిన వాళ్లంతా అదే ఆప్యాయతతో పలకరించారు, ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశారు. ఈసారి అందరి ఇళ్లకూ వెళ్లాను. పాకిస్తాన్‌లో ఉన్నవాళ్లంతా శత్రువులు కాదు. ఆ దేశమూ మిగిలిన దేశాల్లాంటిదే. మన దేశంలో మంచివాళ్లు, చెడ్డవాళ్లూ ఉన్నట్టే అక్కడా ఉంటారు. నన్నైతే సాదరంగా ఆహ్వానించారు. ఆప్యాయంగా ఆతిథ్యమిచ్చారు. అందుకే అనిపిస్తుంది నాకు దేశం పాలసీల కన్నా ప్రజలే మిన్న అని. పాకిస్తాన్ వెళితేనే తెలిసింది నాకు.. ఊహాగానాలు వేరు వాస్తవం వేరు అని. పీపుల్ ఫస్ట్ నేషన్ నెక్ట్స్’’
– స్వరాభాస్కర్, బాలీవుడ్ నటి (తను వెడ్స్ మను, లిజన్ అమాయా, నిల్ బట్టి సన్నాటా ఫేం)
Comments
Please login to add a commentAdd a comment