వాడిన గిన్నెలకు మకిలి ఎక్కువ.. చాలా జిడ్డుగా ఉంటాయి... మగాళ్లలాగే! సింపుల్‌గా చెబితే వినవు... తోమాలి... కొబ్బరి పీచుతో తోమాలి.. జిడ్డు వదిలేదాకా తోమాలి.. మీరు, మేము.. ‘‘మీ టూ .. మీ టూ’’ అంటూ జిడ్డు వదిలేదాకా తోమాలి..
సరిత (పేరు మార్చాం).. మహబూబ్‌నగర్ నుంచి పదిహేనేళ్ల కిందట హైదరాబాద్ వచ్చింది పని వెదుక్కుంటూ. అప్పటికే ఆమె భర్త చనిపోయి రెండేళ్లయింది. తమ ఊరినుంచే వలస వచ్చిన వాళ్లు ఓ అపార్ట్‌మెంట్‌లో పనికి పెట్టారు. ఆ ఓనర్ .. సర్కార్ ఉద్యోగి. భార్యా ఉద్యోగస్తురాలే వేరే ఊళ్లో. సో.. పనికి మాట్లాడుకున్న టర్మ్స్‌లో గిన్నెలు, బట్టలు, ఇల్లు ఊడ్వడం... తుడవడంతో పాటు వంట చేసిపెట్టాలి. ఒక నెల చేసేసరికి యజమాని పరిస్థితి బాగా అర్థమైంది సరితకు. ‘‘వంట చేస్తుంటే చడీచప్పుడు కాకుండా వచ్చి వెనకాలే నిలబడేవాడు. ఇల్లు ఊడ్వడం, తుడవడం నరకంగా ఉండేది. ఇట్లాంటివి నా దగ్గర కుదరవు సర్.. పని చేయమంటే చేస్తాను.. లేకపోతే లేదు అని గట్టిగా చెప్పిన. సారీ అన్నాడు.
మామూలుగానే పనిచేసుకుంటూ వెళ్తున్నా. వారం తర్వాత మళ్లీ మునుపటి బుద్ధి చూపించబోయాడు.. ఈసారి వరండా తలుపు తీస్తూ గట్టిగా అరిచిన. ఆయన అపార్ట్‌మెంట్ లిఫ్ట్ ముందరే ఉంటది. లిఫ్ట్ ముందున్న వాళ్లంతా చూస్తుంటే వెనకాలే వచ్చిన ఆయన ‘‘డబ్బులు దొంగతనం చేసింది.. ఎందుకు అట్లా చేసినవ్ అని అడిగితే అరుస్తూ పారిపోతోంది’’ అని చెప్పినాడు. పనిమనుషులు ఇంతే.. ఎంత బాగా చూసుకున్నా బుద్ధిపోనిచ్చుకోరని తలో మాట అనిరి. ఏడ్చుకుంటూ పోయిన. అప్పటి నుంచి మగవాళ్లే ఉన్న ఇంట్లో పని చేస్తలేను. నేను కాదు దొంగను.. ఆ సారే దొంగ అని ఒర్రాలనిపించింది.. కాని నమ్ముతరా నా మాటను?’’ సరిత ప్రశ్న.
నమ్మరు. కారణం.. పనిమనిషిగా ఇక్కడ ఆమె స్టేటస్... టోటల్‌గా స్త్రీగా సమాజంలో ఆమె స్థాయి! తరుణ్ తేజ్‌పాల్ ఇబ్బంది పెట్టిన అమ్మాయి దగ్గర్నుంచి తనుశ్రీ దత్తా మొదలు ప్రియారమణి వరకు... ఉద్యోగాల్లో వాళ్ల హోదా ఏదైనా.. సొసైటీలో స్టేటస్ ఒక్కటే.. మహిళ.. ది సెకండ్ సిటిజన్! అందుకనే వాళ్లు పెదవి విప్పగానే కోట్ల మెదళ్లు ప్రశ్నలను సంధించి పెడతాయి. వాళ్ల బాధ వినకుండానే. సోషల్ మీడియాలో జర్నలిస్ట్ ఉషా తురగ రేవెల్లి రాసినట్టు.. పాలవాడు నీళ్లు కలిపినా అడగం.. ట్రాఫిక్‌లో కాళ్లు తొక్కినా నోరుమెదపం.. వీధుల్లో డ్రైనేజ్ పారినా పట్టించుకోం.. మన ఓట్లు దొంగలించేసినా కిక్కురుమనం.. ఇలాంటి ఎన్నిటికో నోర్మూసుకోవడం అలవాటైన మనకు.. మహిళలు తమ బాధ చెప్పుకోగానే నోరుపారేసుకునే ధైర్యం భలే వస్తుంది.
కారణం.. ఎగైన్ సెకండ్ సిటిజన్. అదిగో ఆ స్టేటస్ మార్చడానికి ‘మీ టూ’ ఉద్యమం ఒక మాధ్యమం కావాలి. అప్పుడే ఎందుకు చెప్పలేదు.. ఇప్పుడెందుకు చెప్తున్నారు... లాంటి క్వశ్చన్స్‌కి ఫుల్‌స్టాప్ పెట్టి ఇప్పుడైనా వినాలి. పనిమనుషులుగా ఇళ్లల్లో పనిచేస్తూ.. యజమానురాలు కాస్తంత చాటైతే చాలు యజమాని చూపులతో ‘రేప్’ అయిపోతూ.. ఆమె ఊళ్లో లేకపోతే అతను ఇంకా అడ్వాన్స్ అయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకుంటూ... ఆర్థిక అవసరాలను తప్పించుకోలేక.. ఆ దాష్టీకాన్ని భరిస్తూ.. భర్తను ఏమీ అనలేక ఆ అసహనాన్ని పనిమనిషి మీద అనుమానంగా ప్రదర్శిస్తుంటే ఆ అవమానాన్ని దిగమింగుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తున్న ‘మీ టూ’ వ్యథలు వేలల్లో ఉంటాయి అంటుంది రేణుక, హైదరాబాద్‌లోని డొమెస్టిక్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యురాలు.
సోషల్ చేంజ్..
‘‘బాధలు పడ్డ ఆడవాళ్లంతా బయటకు రావాలి.. వస్తేనే తెలుస్తుంది మగవాళ్లకు.. తామెంత హీనంగా ప్రవర్తిస్తున్నామో అని. అప్పుడే ఈ తరం మగపిల్లలు సిగ్గుపడ్తారు. ఇట్లా ఉండకూడదు అని తెలుసుకుంటారు. ఈ మార్పు చట్టాలతో కాదు.. పంచుకున్న బాధలతోనే వస్తుంది’’ అంటుంది కన్‌స్ట్రక్షన్ రంగానికి చెందిన మీ టూ బాధితురాలు శ్యామల (పేరు మార్చాం). పని ఇచ్చినందుకు ఆమె శరీరాన్ని కోరుకుంటాడు మేస్త్రీ. కుదరదు అంటే అక్కడే కాదు ఏ అడ్డ మీదా కూలీ లేకుండా చేయగలడు.
అయినా వెరవక అలాంటి ఒక మేస్త్రీతో తలపడింది శ్యామల. ఫలితం.. ఆమె భర్తకు తాగించి శ్యామల క్యారెక్టర్‌ను అసాసినేట్ చేశాడు మేస్త్రీ. విషయం తెలుసుకుని విస్తుపోయిన శ్యామల మేస్త్రీ చెంప పగలగొడితే.. భర్తతో ఇంట్లోంచి గెంటేయించాడు.. అప్పుడైనా తన దారికి వస్తుందనే నమ్మకంతో. ‘‘ఇట్లాంటివి ఉంటాయి కాబట్టే... వెంటనే చెప్పడానికి భయపడ్తారు. మీ టూ.. ఆ భయం పోగొడ్తోంది.. ఒక ధైర్యం ఇస్తోంది’’ అంటోంది శ్యామల.
నేనూ మీ టూ నేనా?
స్మార్ట్ ఫోన్లో పాటలు వింటూ బిడీలు చూడుతోంది ప్రభావతి (ఇక్కడా పేరు మార్చాం). ఆమెది నిజామాబాద్ జిల్లాలోని ఓ పల్లె. ‘‘వాట్సప్ ఉందా?’’ అని అడిగితే ఉంది అన్నట్టుగా నవ్వింది. ‘‘మీ టూ గురించి ఏమైనా విన్నారా?’’.. ఈ ప్రశ్నకు స్మార్ట్ ఫోన్లో పాటలు ఆపేసి సీరియస్‌గా చూసింది. ‘‘మా గ్రుపులల్ల షేర్ అయితలేదు కాని.. నాకు తెల్సు దాని గురించి. మస్తు రోజుల్నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా.. కాని ఎవర్ని అడగాల్నో తెల్వలే. ఇప్పుడు అడగొచ్చా..’’ అంది.
అడగొచ్చు అంటే.. ‘‘మస్తు ఏండ్లనాటి సంగతి. మా ఆడివిల్ల పెనిమిటి మస్కట్‌కి వోయిన కొత్తల.. గామె మా ఇంటికాడ్నే ఉంటుండే. నేను, మా ఆడివిల్ల ఇద్దరం బీడీలు జేసేటోళ్లం. సాయంత్ర కల్సే కార్ఖానాకు పోయేటోళ్లం. ఆకు, తంబాకు పోసేటోళ్ల కాడి నుంచి మేనేంజర్ (మేనేజర్) దాకా అందరు మా ఆడివిల్ల దిక్కు గదోరకంగా జూసేటోళ్లు. ఆకు ఏసేటోడైతే.. ఏమేమో పరాశకాలాడుతుండే.. మీ అన్న తాన ఎందుకున్నవ్? ఒక్కదానివుండాట్నంటే భయమా? పెనిమిటి లేడని బీరిపోకు.. నేనున్న గదా.. ?’ అనుకుంట ఆమె పానం దినేటోడు.
ఆ మాటలిన్కుంట దినాం.. ఏడుస్తుండే. ‘‘అన్నకు జెప్పు’’ అని నేనంటే.. ‘‘చెప్తే.. లొల్లయితది.. మా అత్తగారోల్లకు దెలిస్తే.. నాదే తప్పంటరు.. లేనిపోని అనుమానాలు. పోనీ బీడీలు బంజేతామంటే ఆయన మస్కట్‌కి వోయిన అప్పెట్లా దీరేలే?’’ అని మస్తు బాధపడ్తుండే. పాపం పొల్ల.. అట్లనే ఎల్లదీసింది. గది గూడా మీ టూ కిందకే అస్తదా? గిస్మంటిది గప్పుడుంటే.. మంచిగుండు అనుకుంటున్నా.. తేపతేపకి యాదికస్తుంది’’ అని చెప్పింది ప్రభావతి.
అన్ని చోట్లా ఉంది
మీ టూ.. జర్నలిజానికో.. సినిమా ఫీల్డ్‌కో సంబంధించింది కాదు.. ఇంట్లో ఉంది.. బయటా ఉంది. అమ్మ, అక్క, చెల్లి దగ్గర్నుంచి ఏ సంబంధం లేని వాళ్ల దాకా ఆడవాళ్లందరూ ఏదో ఒక సందర్భంలో.. ఏదో ఒకరంగా మీ టూకి ట్యాగ్ అయినవాళ్లే... అవుతున్నవాళ్లే! కాబట్టి.. మీ టూని సపోర్ట్ చేయడానికి.. ఆ గళాలు ప్రపంచమంతా వినిపంచేలా చేయడానికి ఏ బంధం.. సంబంధం.. అనుబంధం అక్కర్లేదు. తోటి మనిషన్న కన్‌సర్న్ చాలు.
‘‘ఉమన్.. అనగానే సెక్సువల్ ఆబ్జెక్ట్‌గానే ఎందుకు చూస్తారు? ఆమె నో అంటే నో అనే అని ఎందుకు అర్ధం చేసుకోరు? ఈ విషయంలో మగవాళ్లను అవేర్ చేసేందుకు వచ్చిన గ్రేట్ మూవ్‌మెంట్ మీ టూ’’ అంటుంది బెంగుళూరుకు చెందిన అనూష అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఇలాంటి తలనొప్పులు ఎందుకు అని ఆడవాళ్లను మళ్లీ నాలుగు గోడలకే పరిమితం చేసే ప్రమాదమూ రావచ్చు. కాని.. ఉత్పత్తిలో మహిళలకూ సమభాగస్వామ్యం ఇచ్చింది ప్రకృతి. ఆ ధర్మాన్ని ధిక్కరిస్తే.... ఈ ఖాళీకి పూరణ ఉండదేమో! ఇది ఒక ఆత్మగౌరవ పోరాటం. పురుషుడితో పాటు స్త్రీకి సమాన హోదా ఉంది. అది గ్రహించి అర్థం చేసుకునే చారిత్రక అవకాశం ఇది. మనల్ని మనం మార్చుకుందాం. పట్టుకున్న జిడ్డు వదులించుకుందాం! పరివర్తన చెందడమే కదా నాగరికత అంటే!
ఎవరంటారు?
స్త్రీకే స్త్రీయే శత్రువు అని? ప్రభావతి మాటలు విన్నాక కూడా. ఈ ఉద్యమం చూశాక అయితే ఆ నానుడి ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. ఒకవేళ ఈ ఉద్యమంలో ఎవరైనా మహిళలు నిందిత పురుషుల గురించి వాళ్లు వాళ్ల ఫీల్డ్స్‌లో లెజెండ్స్ అని సపోర్ట్ చేస్తున్నా... ‘‘సో వాట్? ఎమ్‌జే అక్బర్ గొప్ప కాలమిస్ట్ కావచ్చు.. వినోద్ దువా సక్సెస్‌ఫుల్ ఎడిటర్ కావచ్చు.. వికాస్ భల్ క్రియేటివ్ డైరెక్టర్ కావచ్చు... చేతన్ భగత్ పాపులర్ రైటర్ కావచ్చు.. సో వాట్? గొప్పవాళ్లు కాబట్టి తమతో కలిసి పనిచేస్తున్న ఆడవాళ్లతో ఇష్టానుసారంగా ప్రవర్తించొచ్చా? వాళ్ల పేరుకు ముందున్న ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్‌తో మాకేంటి? వాటితో వాళ్ల సెక్సువల్ మిస్‌కాండక్ట్‌ను ఇగ్నోర్ చేయలేం ... చేయం’’ అని బర్ఖాదత్ లాంటి వాళ్లు పవర్‌ఫుల్ ఆన్సర్ ఇస్తున్నారు.
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment