కడలి గర్భంలో కల్లోలాలున్నాయి | Dileep Reddy Article On MeToo Movement | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 12 2018 1:01 AM | Last Updated on Fri, Oct 12 2018 4:55 AM

 Dileep Reddy Article On MeToo Movement - Sakshi

ఇప్పటివరకు వెలుగు చూస్తున్నది తీరంలో అలల అలికిడి మాత్రమే! గంభీరమైన కల్లోలాలు, తుఫానులు కడలి మధ్యలో ఉంటున్నాయి. నగరప్రాంతాల్లో చేతనాపరుల ‘నేను కూడా...’ ఉద్యమాన్నే చూస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో... డబ్బు, అధికారం, హోదా, ఆధిపత్యం కింద లైంగిక హింసతో నలుగుతున్న జీవితాలెన్నో లెక్కే లేదు. ఆర్థిక, సామాజిక పరిస్థితులు వారి చుట్టూ ఓ ముళ్ల కంపల్ని అల్లుతుంటాయి. లైంగిక దాష్టీకం తెలిసి జరుగుతున్నా బయటపడలేని అశక్తత! దశాబ్దాల కిందటి కారంచేడు కన్నీటి గాథల నుంచి... నిన్నా ఇవాల్టి ‘కాల్‌మనీ’ కావరం వరకు లైంగిక వేధింపు పర్వం గ్రామీణ జీవితంలో ఓ మౌన రోదన! కడతీరని వేదన!!

పశ్చిమాద్రి నుంచి ఏడాది కింద వెలుగు రేఖలు విచ్చు కున్న తర్వాత కొత్త వెలు తురు అంతటా పరచుకుంటోంది. అమెరికాలో మొద లైన చిన్న కదలిక పెద్ద ఉద్యమమౌతోంది. శతాబ్దా లుగా అలుముకున్న వేదన పెల్లుబికి మౌనాన్ని ఛేది స్తు్తన్న క్రమంలోనే స్వరాలు పెగులుతున్నాయి. లోలోన రగిలే రోదనతో ఇన్నాళ్లూ మూగవోయిన గొంతులు ఒకటొకటిగా విచ్ఛుకుంటున్నాయి. బెరుకు, బిడియం, పరువు, ప్రతిష్ట వంటి పొరలూ, ముసుగులూ తొలగిపోతున్నాయి. ఎప్పుడో జరిగిన దాష్టీకాల తాజా‘వెల్లడి’తో ఇప్పుడు ఎక్కడెక్కడో డొంకలు కదులుతున్నాయి. అవతలి వాళ్ల బలహీనత వల్ల ఇన్నాళ్లు లభించిన రక్షణ కవచాలు కరుగుతు న్నాయి. ‘నేను కూడా...’ (మీ టూ) అంటూ గొంతు విప్పే ఉద్యమం దేశంలో బలోపేతమౌతోంది. ఈ వెలుతురు చినుకులతో... లైంగిక హింసను దాచిన చీకటి కడుక్కుపోతోంది. సినిమా, టీవీ, క్రీడా రంగాలు దాటి మీడియా, రాజకీయ రంగాలకూ ఈ ‘వెల్లడి వెల్లువ’ విస్తరిస్తోంది. మరుగుపడిన మరు గుజ్జు మనస్తత్వాలను బట్టబయలు చేస్తోంది. పేరున్న పెద్ద ‘సెలబ్రటీలు’ కూడా ఒక్కసారిగా కురు చయిపోతున్నారు. ఏ వాదన వినిపించాలో దిక్కు తోచడం లేదు. ఇంకా కలుగుల్లో సురక్షితంగా ఉన్నామనుకునే వారిలో చిన్నపాటి అలజడి! ‘ఏమో... అది తమదాకా వస్తే...?’ ఓ భయం! ఎప్పుడో, ఏదో రూపంలో మహిళల పట్ల అనుచిత, అమర్యాద ప్రవర్తనో, జరిపిన లైంగిక హింసో జ్ఞాప కానికి వస్తే చాలు... గగుర్పాటే! గత వారం రోజు లుగా చర్చనీయాంశమౌతున్న ఈ వెల్లడి వెల్లువలో, ఇప్పటిదాకా బయటపడింది, నిజానికి పిసరంతే! ఇంకా వెలుగుచూడని దాష్టీకాలకు లెక్కే లేదు! ఇదంతా నగరాలకు పరిమితమై బయటపడుతున్న కొన్ని ఘటనల ఛాయ మాత్రమే! ఇక గ్రామీణ– పట్టణ ప్రాంతాల్లో నిత్యం జరుగుతూ వెలుగుచూ డని లైంగిక వేధింపు దురాగతాలెన్నెన్నో!

ఉద్యమ లక్ష్యానికి రెండు పార్శ్వాలు
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులనేవి ప్రధానంగా మనిషి తత్వం, నైతికత, ప్రవర్తనకు సంబంధించిన అంశాలు. ఇది అవసరాలు–అవకాశాల నడిమి సంబంధం ఆధారంగా సాగే ఎలుక–పిల్లి చెలగాటం వంటిది. కేవలం వేధింపుల వద్ద ఆగదు. ఆ దశ దాటి లైంగిక హింస, లైంగిక దోపిడీ, లైంగిక అరాచకత్వం వంటి తీవ్ర స్థితికి చేరిన ఉదంతాలెన్నో ఉన్నాయి. మనిషి నైజం, పరిసరాలే కాకుండా ఆర్థిక, రాజకీయ, సామాజికాంశాలూ ఈ దుస్థితిని ప్రభావితం చేస్తు న్నాయి. లైంగిక హింస ఎదుర్కొన్న తర్వాత కూడా గొంతు పెగలని ఇన్నాళ్ల మౌనానికి కారణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు! ఆర్థిక అంతరాల మధ్య, హోదాల హెచ్చుతగ్గుల నడుమ, వ్యవస్థీకృత పురుషాధిక్యత ముందు... మాట్లాడటం కంటే, మౌనంగా భరించడమే అనివార్యమైన పరిస్థితి అత్య ధిక బాధితులకుంటుంది. కానీ, మౌనం వీడి నిజాలు ఇప్పుడు వెల్లడించడాన్ని కొన్ని గొంతులు ప్రశ్నిస్తు న్నాయి. ‘అదేదో జరిగితే... ఇన్నాళ్లేం చేశార’నో! ‘అప్పుడే చెప్పి ఉండాల్సింద’నో! వాదన తెరపైకి తెస్తున్నారు. జరిగిన తప్పిదాలు, ఆలస్యంగా  వెల్లడించినంత మాత్రాన తప్పులు కాకుండా పోతాయా? అన్నది నైతిక ప్రశ్న.

పాత గాయాలకు నేడు సాక్ష్యాధారాలూ ఉండకపోవచ్చు, ఉండొచ్చు! ఉన్న చోట చట్టప్రకారం శిక్ష ఎలాగూ తప్పదు. లేని చోట నేరం నిరూపణ కాకపోవచ్చు! కానీ, ఒక సాధికారిక  విచారణకైనా ప్రాతిపదిక ఏర్పడుతుం దనేది ఉద్యమకారుల వాదన. చట్ట ప్రకారం శిక్ష పడకపోయినా, సాటి సమాజం దృష్టిలో పడే శిక్ష తక్కువేం కాదు. ఈ కారణంగానే ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఫలితం, ధైర్యంగా గొంతులు పెగులుతున్నాయి. తప్పు చేసిన వారే దర్జాగా బతుకుతుంటే, బాధితులయిన వారెందుకు మౌనంగా ఉండాలి? ఎందుకు న్యూనతతో బతకాలి? ఎందుకు బయటపెట్టి నిలదీయొద్దు? అనే హేతుబద్ద వాదన బలపడుతోంది. అందుకే ఈ ‘నేను కూడా...’ ఉద్యమ స్వరం ఊపందుకుంది! ఇంకా గొంతులు పెగలాలి. పుట్ట పగిలి చీమల బారులు పెల్లుబి కినట్టు... అట్టడుగు పొరల్లోని లైంగిక దాష్టీకాలన్ని టినీ వెలుగులోకి తేవాలనే అభిలాష అంతటా వ్యక్తమౌతోంది. పరిస్థితుల్ని ఆసరా చేసుకొని లైంగిక హింసకు పాల్పడ్డవారికి ఆలస్యంగానైనా శిక్షలు పడటం ఒక ప్రయోజనం. వారు సామాజిక పరాభ వానికి గురి కావడం మరో లబ్ది! ఉద్యమ ఫలితంగా భవిష్యత్తులో ఎవరూ పని ప్రదేశాల్లో లైంగిక హింస, దోపిడీకి సాహసించరనేది ఒక ఆశ! అవతలి వారి అవసరాల్ని తమ అవకాశంగా మలచుకుంటూ లైంగి కంగా హింస పెట్టరనేది ఓ ఆకాంక్ష!

అదే సమయంలో కక్ష సాధింపులు, పనిగట్టు కొని ఇతరుల పరువునష్టం కలిగించడం వంటి లక్ష్యా లతో ‘నేను కూడా...’ అనడం తప్పు! నిర్హేతుక వాద నలు నిలువవు. ఏదో ఇతరుల్ని ఇరికించే దురాశా యత్నాలు ఉద్యమాన్ని బలహీన పరుస్తాయి. నిజమైన బాధితులకు లభించే నైతిక మద్దతూ కరువయ్యే ప్రమాదముంటుంది. అధికారం, హోదా, సంపదను అడ్డుపెట్టుకొని మగవారి పట్ల జరిపే లైంగిక వేధిం పులు వెలుగు చూసినపుడూ ఇంతటి సహృదయత, మద్దతు ఉండాలని కొందరు వాదిస్తున్నారు.

దివిటీలే వెలుగును కాటేస్తే...?
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివా రణ, నిషేధం, సరిదిద్దడం) చట్టం–2013 లో ఎన్నో మార్గదర్శకాలున్నాయి. పని ప్రదేశాల్లో ప్రతికూల పరిస్థితుల్ని తప్పించే చర్యల్ని ఈ చట్టం నిర్దేశిస్తోంది. లైంగిక వేధింపుల్ని అరికట్టడానికి ప్రభుత్వాలు, ఆయా పరిశ్రమలు, కంపెనీలు ఏయే చర్యలు తీసు కోవాలో సుప్రీంకోర్టు 1997లో (విశాఖ మార్గదర్శ కాలు) సూచించిన అంశాల్నే ఈ చట్టంలో పొందుపరి చారు. ప్రతి సంస్థ అంతర్గతంగా ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)ని ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫిర్యాదుల్ని సదరు కమిటీ పరిశీలించి, పరిష్కరిం చాలి. మార్కెట్‌ గణాంకాల ప్రకారం దేశంలోని 50 అతి పెద్ద కంపెనీల్లో ఏయేటికాయేడు పెరుగుతున్న ఈ ఫిర్యాదుల సంఖ్యను బట్టి అవగాహన హెచ్చు తున్నట్టే! కానీ, ఇది ప్రధానంగా ఐటీ, ఆర్థిక సంస్థ ల్లోనే ఉన్నట్టు వెల్లడయింది. మొత్తం ఫిర్యాదుల్లో సగం నాలుగు సంస్థల్లోనే నమోదయ్యాయి. పబ్లిక్‌ రంగ సంస్థల్లో ఈ అవగాహన అంతంతే! బృహ న్ముంబాయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వంటి చోట తప్పితే ప్రభుత్వ విభాగాల్లోనూ ఫిర్యాదులు నామ మాత్రమే! నిఫ్టీ ఇండెక్స్‌లో చోటున్న తొమ్మిది పబ్లిక్‌ రంగ సంస్థల్లో ఈ ఆర్థిక సంవత్సరం, ఒక లైంగిక వేధింపు ఫిర్యాదు కూడా ఐసీసీల వద్ద నమోదు కాలేదంటే పరిస్థితి ఇట్టే అర్థమౌతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతాధికారుల వేధింపులు సాగు తున్నా ఎప్పుడో గాని వెలుగు చూడవు. అక్కడంతా చాపకింద నీరల్లే జరిగిపోతుంది. ఆ పరిస్థితి మారాలి. చూపులతో, సూటిపోటి మాటలతో బజా రుల్లో, బస్టాండ్‌ల వద్ద వేధించే వారిని నియంత్రిం చడానికి మనకు ‘షీ టీమ్స్‌’ వ్యవస్థ ఉంది. కానీ, వివిధ అంచెలుగా ఉండే ఉద్యోగ వ్యవస్థలో పై అధికారుల ప్రత్యక్ష, పరోక్ష లైంగిక వేధింపులకు అడ్డు లేదు. వాటిని నియంత్రించేలా చట్టాలకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉంది. పై అధికారులు, సహోద్యోగుల లైంగిక వేధింపులు చట్టానికి దొరక నంత అంతర్లీనంగా ఉండి, మహిళలకు ఒక రకమైన కంపర పరిస్థితి కలిగిస్తుంటాయి. మార్కులు, గ్రేడ్లు, తుది ఫలితాల మిషతో... విశ్వవిద్యాలయాల్లో రీసర్చి స్కాలర్లను లైంగికంగా వేధించే ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందికి సంబంధించిన వార్తలు తరచూ వస్తుం టాయి. వైద్య, ఇంజనీరింగ్, నర్సింగ్‌ వంటి వృత్తి విద్యాసంస్థల్లోనూ లైంగిక వేధింపులున్నాయి. ఇటీ వల ఇద్దరు వైద్య విద్యార్థినులు అనుమానాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడటం తెలిసిందే! కేంద్ర మంత్రిగా ఉన్న ఎమ్‌.జె.అక్బర్‌ లాంటి సీని యర్‌ జర్నలిస్టు ఇప్పుడీ అంశంలో వార్తల్లోని వ్యక్తి అయ్యారు. తెలుగునాట మీడియా సంస్థల్లోనూ మహిళల పట్ల లైంగిక వేధింపులు, పోలీసు ఫిర్యా దులు, కోర్టు తలుపు తట్టడాలు తరచూ వార్తలకెక్కు తున్నాయి. శీర్ష స్థానంలో ఉన్న ముఖ్యులు కొందరి పైనా అభియోగాలున్నాయి.

స్ఫూర్తితో నవతరం ఉద్యమించాలి
ఇప్పటివరకు వెలుగు చూస్తున్నది తీరంలో అలల అలికిడి మాత్రమే! గంభీరమైన కల్లోలాలు, తుఫా నులు కడలి మధ్యలో ఉంటున్నాయి. నగరప్రాం   తాల్లో చేతనాపరుల ‘నేను కూడా...’ ఉద్యమాన్నే చూస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో... డబ్బు, అధికారం, హోదా, ఆధిపత్యం కింద లైంగిక హింసతో నలుగుతున్న జీవితాలెన్నో లెక్కే లేదు. ఆర్థిక, సామాజిక పరిస్థితులు వారి చుట్టూ ఓ ముళ్ల కంపల్ని అల్లుతుంటాయి. లైంగిక దాష్టీకం తెలిసి జరుగుతున్నా బయటపడలేని అశక్తత! దశాబ్దాల కిందటి కారంచేడు కన్నీటి గాథల నుంచి... నిన్నా ఇవాల్టి ‘కాల్‌మనీ’ కావరం వరకు లైంగిక వేధింపు పర్వం గ్రామీణ జీవితంలో ఓ మౌన రోదన! దొరలు, జమిందార్లు, అప్పిచ్చిన వాళ్లు, కాంట్రాక్టర్లు, వావి వరుసలు మరచిన కుటుంబ సభ్యులు... ఇలా ఎవరెవరి నుంచో నిత్యం, పూట పూటా పొంచి ఉన్న ప్రమాద పరిస్థితితోనే వారి మనుగడ. ఉద్యోగాలకు, ఉపాధికి, రోజువారీ జరుగుబాటుకు ముడివెట్టి.... అచేతన స్థితి కల్పించి లైంగికంగా వాడుకునే ఆధి   పత్య వర్గానికి గ్రామీణ ప్రాంతాల్లో అడ్డూ, అదుపూ ఉండదు. పేదలు, ఒంటరి మహిళలు, దినదిన గండంగానే బతకాల్సి వస్తుంది. నోరువిప్పితే జీవనో పాధి పోతుంది. బయటకు పొక్కితే... సమాజంలో ఎన్ని అవమానాలో? ఇంకెన్ని కష్టాలో! తాజా ఉద్య మాల ఉప్పందించి వారికి ఉపశమనం కలిగించాలి. ఈ తరం మహిళలు, యువతులు చేతన పొందాలి. ఏ చిన్న అఘాయిత్యమైనా, దురుద్దేశపు చర్య అయినా ప్రతిఘటించాలి. నిలదీసి గొంతెత్తాలి. ఏది మంచిగా తాకడం, ఏది చెడుగా తాకడం ప్రజ్ఞతో ఉండాలి. పిల్లలకు అవి నేర్పించాలి.

చివరగా ఒక మాట! ఉద్యమమెప్పుడూ పలు సాధకబాధకాలతో ముడివడి ఉంటుంది. ప్రపంచ జనాభాలో చెరి సగమైన మగ–ఆడవారు ఒకటి గుర్తె రగాలి. ఆడవారి పట్ల మగవారి ఆలోచనలు రుజు వుగా ఉంటే, ఆడవాళ్లు ఈ విషయంలో ఉద్యమించా ల్సిన అవసరమే ఉండదు! ఈ దుస్థితిని తప్పించడం వారికెంత కర్తవ్యమో, వీరికి అంత బాధ్యత.

 దిలీప్‌ రెడ్డి, ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement