బతికి ఉండే నాల్రోజులూ నలిగిపోతే ఎలా?ఒత్తిడి గొంతు పిసికేస్తుంటేఇక జీవితానందాలను ఏం పిండుకుంటాం?తల తిరుగుతుంది, కడుపులో తిప్పుతుంది,గుండెపట్టుకుంటుంది.ఇలా జీవించడం కుదరదు.
ఒత్తిడిని రివర్స్‌లో చితకబాదండి.హ్యాపీగా బతికి చూపించండి.డోంట్ వర్రీ... బీ హ్యాపీ...ఒత్తిడికి ఇవ్వండి దేత్తడి!
ఒత్తిడి... ఇది ఈ కాలపు ప్రధాన సమస్య. ఒకప్పటి పాతరోజుల్లో జీవితంలో ఎప్పుడోగానీ ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదు. కానీ ఇటీవల అందరూ నిత్యం ఒత్తిడికి గురవుతున్నారు. మూడున్నర ఏళ్లు నిండిన చిన్నారి ఎల్కేజీ అంటూ స్కూలు వెళ్లడంతో మొదలయ్యే ఒత్తిడి, పదవ తరగతి దాటాక ఐఐటీలూ నీట్‌లనే పరీక్షలతోనూ, ఆ తర్వాత పైచదువులూ ఉద్యోగాల సంపాదన అనీ, ఆపై ఉద్యోగంలో టార్గెట్ల సాధన, ఆ తర్వాత పిల్లలను సెటిల్ చేయడం... ఇలా తాము జీవించినంత కాలం నిరంతరం ఒత్తిడి ఉండేలా మన జీవనశైలి మారిపోయింది. ఒత్తిడి కలిగి ఆపైన తగ్గిపోతే పర్లేదు. కానీ నిరంతర ఒత్తిడి (అంటే క్రానిక్ స్ట్రెస్) వల్ల అదెన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంటుంది. కేవలం ఒత్తిడి కారణంగానే అనేక రకాల జబ్బులూ వచ్చేందుకు అవకాశం ఉంది. ఆ సమస్యలేమిటో... వాటిని నివారించుకోవడం ఎలాగో, అందుకోసం ఒత్తిడిని ఎలా అధిగమించాలనే అవగాహన కోసమే ఈ కథనం.
ఒత్తిడితో మన వ్యాధి నిరోధక శక్తిపై ప్రభావం...
మన రోగనిరోధక శక్తి మనల్ని అనేక రకాల జబ్బులనుంచి నిరంతరం రక్షిస్తూ ఉంటుంది. కానీ ఒత్తిడి అనే ఒకే ఒక సమస్య కారణంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి... ఫలితంగా అనేక రకాల జబ్బులకు ఆస్కారం ఏర్పడుతుంది. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. మనకు గాయం అయినప్పుడు అక్కడ వాపు రావడం, ఎర్రబారడం (ఇన్‌ఫ్లమేషన్) చూస్తుంటాం. ఇది తాత్కాలికంగా బాధ కలిగించినప్పటికీ ఆ ఎరుపూ, మంటా, వాపు వచ్చాక... గాయం క్రమంగా మానుబడుతుంది. కానీ ఒత్తిడి తీవ్రంగానూ, దీర్ఘకాలికంగానూ ఉన్నప్పుడు మన శరీరం ఇన్‌ఫ్లమేషన్‌ను నివారించే శక్తిని కోల్పోతుంది. కార్నెగీ మెలాన్ యూనివర్సిటీకి చెందిన షెల్డన్ కోహెన్ అనే అధ్యయనవేత్త ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి. ఈ అధ్యయన ఫలితాలను ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ లోనూ నమోదు చేశారు. శరీరంపై ఒత్తిడి ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతుందన్న విషయం ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. మనలో ఇన్‌ఫ్లమేషన్ కలిగినప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ విడుదలై, అది వ్యాధి నిరోధక అంశాలను ప్రేరేపిస్తుంది. దాంతో ఆ వ్యాధి నిరోధకతను కలిగించే అంశాలు ఇన్‌ఫ్లమేషన్‌ను క్రమంగా తగ్గిపోయేలా చూస్తాయి. దాంతోపాటు గాయం కూడా తగ్గుతుంది. కానీ దీర్ఘకాలపు ఒత్తిడి ఉన్నప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ స్రవించినా అది సరిగా పనిచేయదు. దాంతో ఒత్తిడి కారణంగా వ్యాధి నిరోధక అంశాలు కార్టిజోల్ వల్ల సరిగా ప్రేరణ చెందవు. ఫలితంగా ఇన్‌ఫ్లమేషన్ తగ్గదు. అంతేకాదు... ఇదే విషయం మరికొన్ని అంశాల వల్ల కూడా వాస్తవమని తేలింది. సాధారణంగా మనకు జలుబు చేస్తే, ఒకటి రెండు రోజుల తర్వాత దానంతట అదే తగ్గుతుంది. కానీ దీర్ఘకాలం పాటు ఒత్తిడికి గురయ్యే వారిలో జలుబు తగ్గడానికి చాలాకాలం తీసుకుంటుంది. కారణం... ఒత్తిడి అనేది మన వ్యాధినిరోధకశక్తిని ప్రభావితం చేయడమే. ఒత్తిడి మానసికమైన అంశంగా కనిపించినా... దీర్ఘకాలం కొనసాగితే అది... స్థూలకాయం, గుండెజబ్బులు, అలై్జమర్స్ వ్యాధులు, డయాబెటిస్, డిప్రెషన్, జీర్ణకోశ సమస్యలు, ఆస్తమా వంటి శారీరకమైన సమస్యలకూ దారితీస్తుంది.
ఒత్తిడి కారణంగా వచ్చే మరొకొన్ని సమస్యలు:
గుండెపై ఒత్తిడి ప్రభావం ఇలా... ఒత్తిడికి గురయ్యేవారిలో దీర్ఘకాలిక గుండెజబ్బులు ఎక్కువగా వస్తుంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒక్కోసారి ఒత్తిడి గుండెపోటుకు సైతం దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఒత్తిడిని అధిగమించండిలా...
మానసిక ఒత్తిడి వల్ల కలిగే శారీరకంగానూ సమస్యలు ఎదురవుతాయని గుర్తించినప్పుడు దాన్ని అధిగమించడానికీ, నియంత్రించడానికీ ప్రయత్నించాలి. దీనివల్ల చాలా అటు మానసికంగానూ, ఇటు శారీరకంగానూ ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఉదాహరణకు మొదటిసారి గుండెపోటుకు గురైనవారు, ఒత్తిడిని సమర్థంగా నియంత్రించుకోగలిగితే 74 శాతం మందిలో రెండో స్ట్రోక్ రాకుండా నివారించుకోగలగడం సాధ్యమేనని పరిశోధనల్లో తేలింది. పైగా ఇలా ఒత్తిడి నియంత్రణ కారణంగా వ్యాధి నిరోధకశక్తి కూడా పెరిగి అది కూడా జబ్బులను దూరం చేస్తుంది. ఒత్తిడిని అధిగమించడానికి
అనుసరించాల్సిన కొన్ని మార్గాలివి...
♦ ఏ కారణంగా ఒత్తిడి కలుగుతుందో గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండటం. ఉదాహరణకు ఒక వృత్తి వల్ల ఒత్తిడి పెరుగుతుందని గుర్తిస్తే, ఒకవేళ ప్రొఫెషన్‌ను మార్చుకునే అవకాశం ఉంటే దాన్ని మార్చుకోవడమే మంచిది. ఇక ఇలా మార్చుకునే అవకాశం లేకపోతే కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలి. అవి...
♦ చాలా లోతుగా గాలి పీల్చడం వంటి బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం.
♦ ప్రతి రోజు ఒక గంట ఎరోబిక్స్‌కాని, లేదా టి.విలో చూస్తూ డాన్స్‌గాని చేయాలి. వాకింగ్, జాగింగ్, స్విమింగ్ వీటిలో ఏదోకటి రోజుకు గంట పాటు చేస్తే మీ గుండె , ఊపిరితిత్తులు, రక్తనాణాలు చాలా ఆరోగ్యవంతంగా పనిచేస్తాయి. కండరాలు, కీళ్ళు గట్టిపడతాయి. శరీరమంతా ఆరోగ్యంగా తయారవుతుంది. వ్యాయామంలో స్ట్రెస్‌ని కలిగించే హార్మోన్లు నశించి, మంచి హార్మోన్లు, ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. అవి ఒత్తిడిని దూరం చేస్తాయి.
♦ టెన్నిస్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, హాకీ లేదా క్రికెట్ వంటి ఆటలు కూడా ఆడుతుండాలి.
♦ మీ ఉద్యోగంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమందితో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఒత్తిడి తగ్గుతుంది, కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. నాయకత్వపు లక్షణాలు అలవడతాయి. విజయాలను కూడా చాలా సునాయాసంగా అందుకోవచ్చు.
♦ ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరింకేదైనా వ్యాపకంలో పడుతూ దాన్ని మరచిపోయి, ఒత్తిడి నుంచి విముక్తం కావడం.
♦ ఒత్తిడికి గురయ్యే క్షణాల్లో చిక్కుకున్నప్పుడు అది తప్పని పరిస్థితి అని, దాని కారణంగా ఒత్తిడికి గురవుతూ అంతర్మధనానికి లోనుకోవడం కంటే... అది తప్పించుకోలేని పరిస్థితి కాబట్టి, ఆ పరిస్థితుల్లో ఎవరున్నా చేయగలిగింది ఉండదని, కాబట్టి ఆ స్థితిని యథాతథంగా స్వీకరించడం మంచిదని సర్దిచెప్పుకోవడం.
♦ పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడటం, సమస్యలను అధిగమించాల్సిన కోణంలో పరిశీలించడం వంటి కొన్ని మార్గాల ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు.
గుండెపై దుష్పరిణామాలిలా...
పరోక్షంగా: మనలో ఒత్తిడి పెరిగినప్పుడు అడ్రినాలిన్, కార్టిజోల్ వంటి హార్మోన్లు ఎక్కువగా స్రవిస్తాయి. మనం ఒత్తిడి కారణంగా మనం ఉద్వేగానికి లోనుకావడానికి కారణం ఈ హార్మోనులే. ఇవి మన నాడీవ్యవస్థలోనూ, నరాల్లోనూ రసాయనాల (న్యూరోకెమికల్) మార్పులకు దోహదం చేస్తాయి. ఆ మార్పుల వల్ల రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్‌తో పాటు చక్కెర పాళ్లు పెరుగుతాయి.
ఇక కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వ్యక్తి తనకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటాడు. దీనికితోడు వ్యాయామం చేయడు. పైగా ఒత్తిడిని అధిగమించేందుకు పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం చేస్తుంటాడు. ఒత్తిడి కారణంగా క్రమబద్ధమైన నిద్ర లోపిస్తుంది. ఇవన్నీ గుండెపోటును ప్రేరేపిస్తాయి. అందుకే ఒత్తిడి కారణంగా వీటన్నింటినీ పరోక్షంగా గుండెజబ్బులకు దారితీసే అంశాలుగా పరిగణించాలి.
ప్రత్యక్షంగా: ఒక్కోసారి విపరీతమైన ఒత్తిడి పెరిగిపోవడం వల్ల గుండెపై తీవ్రమైన భారం పడి గుండెపోటు వస్తుంది. ఒకేసారి తీవ్రమైన ఒత్తిడి కలిగినప్పుడు రక్తనాళాల్లోని లోపలి గోడలు దెబ్బతింటాయి. సాధారణంగా నునుపుగా ఉన్న గోడలపై రక్తప్రవాహానికీ, దెబ్బతినడం వల్ల గరుకుగా మారిన గోడలపై ఉన్న రక్తప్రవాహానికి మార్పు ఉంటుంది. ఇలా దెబ్బతిన్న గోడలపై రక్తం ఆగి ఆగి ప్రవహిస్తుంది. ఫలితంగా అలా రక్తం ఆగుతూ ప్రవహించడం వల్ల కొన్ని చోట్ల రక్తం గడ్డకట్టి కొన్ని ప్రాంతాల్లో రక్తపు గడ్డలు పేరుకునే ఆస్కారం ఉంది. ఆ రక్తపు గడ్డలు ప్రవాహానికి మరింత అవరోధం కల్పిస్తుండటంతో క్లాట్స్ మరింత ఎక్కువై ఒక్కోసారి గుండెకు అందాల్సిన రక్తం అసలు అందకుండాపోయే ప్రమాదం ఉంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది.
ప్రమాద తీవ్రత ఇలా
ఒత్తిడి వల్ల గుండెజబ్బు లేనివారిలో సైతం కొద్దిపాటి గడ్డలు ఏర్పడి అవి క్రమంగా పెరుగుతూ పోయి గుండెపోటును కలిగించే అవకాశాలు ఎక్కువ. ఒక్కోసారి అకస్మాత్తుగా కలిగే తీవ్రమైన ఒత్తిడి గుండె స్పందనలోని లయ (రిథమ్)ను దెబ్బతీయవచ్చు. ఇలా క్రమబద్ధంగా సాగాల్సిన గుండెస్పందనల్లో వచ్చే తీవ్రమైన మార్పులు సైతం గుండెపోటును కలిగించడం వల్ల సడన్ కార్డియాక్ డెత్ లాంటి పెనుప్రమాదం సంభవించవచ్చు. దీనికితోడు తీవ్రమైన ఒత్తిడి గుండె కండరం పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపి ‘టకోట్సుబో కార్డియోమయోపతి’ (ఒత్తిడి వల్ల వచ్చే గుండెజబ్బు) లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంది. అది గుండె విఫలమయ్యేందుకు (హార్ట్ ఫెయిల్యూర్)కు సైతం దారితీసే ప్రమాదం ఉంది.
తలనొప్పి: మనకు తీవ్రమైన ఒత్తిడి కలిగినప్పుడు తలనొప్పి రావడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. ఒత్తిడి వల్ల టెన్షన్ హెడేక్ వంటి కొన్ని రకాల తలనొప్పులతోపాటు మైగ్రేన్ తలనొప్పి కూడా చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది. వాటి కోసం వాడే నొప్పినివారణ మందులతో కొన్ని మూత్రపిండాల వంటి కీలక అవయవాలపై దుష్ప్రభావాలు పడటం కూడా సాధారణమే. ఇలా ఒక అంశానికి మరో దుష్ప్రభావం తోడవుతూ అవి ఆరోగ్యాన్ని మరింతగా దెబ్బతీయడం ఒత్తిడి తాలూకు మరో ప్రతికూల అంశం.
స్థూలకాయం: మన శరీరంలో సాధారణంగా పొట్ట, తొడలు, పృష్టభాగం(హిప్స్)... వంటి భాగాల్లో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. అయితే తొడలు, పృష్టభాగం కంటే పొట్టలో పేరుకునే కొవ్వు వల్ల తీవ్రమైన హాని కలుగుతుందని వైజ్ఞానికంగా నిరూపితమైంది. కానీ ఒత్తిడి కారణంగా మిగతా భాగాల్లో కంటే పొట్టభాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకుంటుంది. సెంట్రల్ ఒబేసిటీ అని పిలిచే ఈ తరహా స్థూలకాయం వల్ల ఆరోగ్య హాని కూడా ఎక్కువేనన్నమాట. అంటే ఒత్తిడి వల్ల రెండు రకాలుగా నష్టపోతామని గుర్తించాలి. మొదటిది పొట్ట రావడం కాగా రెండోది ఆ పొట్ట వల్ల ఆరోగ్య సమస్యలు కూడా రావడం అన్నమాట.
డయాబెటిస్: తీవ్రమైన మానసిక ఒత్తిడి... డయాబెటిస్‌కు దారితీస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. మళ్లీ ఇది రెండు రకాలుగా బాధిస్తుంది. డయాబెటిస్ కారణంగా ఆకలి పెరిగి... మనం తినకూడని అనారోగ్యకరమైన పదార్థాలైన వేపుళ్లు, బేకరీ పదార్థాలు తినేలా చేస్తుంది. ఇవి మన ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. అంతేకాదు ఆ పదార్థాలు తిన్న తర్వాత అవి మళ్లీ మన రక్తంలో గ్లూకోజ్ పాళ్లు పెరగడానికి కారణమవుతాయి. దాంతో మనం అనారోగ్యానికి గురవుతాం. ఇలా ఒక అనారోగ్యం ఇంకో ప్రతికూలతకూ, ఆ ప్రతికూలత మరో అనారోగ్యానికీ ఇలా ఒక చక్రంగా సాగిపోతూ ఉంటుంది.
ఆస్తమా : తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆస్తమా వస్తుందని ఇప్పటికే నిర్ద్వంద్వంగా నిరూపితమైంది. అంతేకాదు... పెద్దవారు ఒత్తిడికి గురవుతుంటే అది వాళ్లను మాత్రమే గాక... వారి పిల్లలకూ హాని చేస్తుందని తేలింది. ఒకవేళ తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారే అయితే వారి పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని అధ్యయనాల్లో తేలింది. అంటే... తమ ఒత్తిడి వల్ల వారు తమనే కాకుండా తమ సంతతిని, ముందు తరాల వారినీ బాధిస్తున్నారన్నమాట. గర్భవతిగా ఉన్నవారిలో కొందరిని ఎంపిక చేసుకుని ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. వారిలో సగం మందిని ఒత్తిడికి, మరో సగం మంది కాలుష్యపు పొగకు ఎక్స్‌పోజ్ అయ్యేలా చేశారు. ఈ అధ్యయన ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయంటే...కాలుష్యపు పొగకు గురైన గర్భిణులకు పుట్టిన వారి కంటే... ఒత్తిడికి గురైన గర్భవతులకు పుట్టిన పిల్లల్లో అత్యధికులకు ఆస్తమా వచ్చిందని తేలింది.
డిప్రెషన్, యాంగై్జటీ: ఒత్తిడికి గురైన వారు తీవ్రమైన ఉద్వేగాలకు లోనవుతుంటారు. భావోద్వేగాలకు గురైన వారు ఆవేశకావేశాలకు లోనవుతుంటారు. ఇలాంటివారిలో యాంగై్జటీ కనిపించడం మామూలే. ఇలా దీర్ఘకాలిక భావోద్వేగాలకు గురయ్యేవారిలో 80 శాతం మంది తమ వృత్తి కారణంగా ఇలాంటి ఒత్తిడులకు లోనవుతుంటారు. వీరిలో చాలామంది కొంతకాలం తర్వాత తీవ్ర నిరాశ, నిస్పృహలకూ దీర్ఘకాలంలో డిప్రెషన్‌కు లోనైన ఉదంతాలు చాలా ఎక్కువే ఉన్నాయి. ఇలా ఒత్తిడి కారణంగా డిప్రెషన్‌కు లోనయ్యేవారిలో ఆత్మహత్యా ధోరణులు (సూసైడల్ టెండెన్సీస్) పెరుగుతాయి.
జీర్ణకోశ సమస్యలు: ఒత్తిడికి గురయ్యే చాలామందిలో జీర్ణకోశ సమస్యలు కనిపిస్తుండం చాలా సాధారణం. మనం తీవ్రమైన ఒత్తిడికి గురికాగానే మన కడుపులో యాసిడ్స్ మరింత ఎక్కువగా స్రవిస్తుంటాయి. దాంతో కడుపులో మంట రావడం, అలా దీర్ఘకాలంగా ఒత్తిడికి గురవుతున్నవారిలో ఆ యాసిడ్ వల్ల కడుపు కండరాలు ఒరుసుకుపోయి అల్సర్స్ రావడం కూడా చాలా సాధారణం. కడుపులోని గ్యాస్ పైకి తన్నేవారికి ఛాతీలో నొప్పి రావడం చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు ఆ సమస్యను గుండెపోటుగా పొరబడటం కూడా చాలామందిలో చూస్తుంటాం. ఇలా దీర్ఘకాలం గ్యాస్ పైకి ఎగదన్నుతుండేవారు గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ) అనే రుగ్మతకూ లోనవుతుంటారు. ఈ దుష్పరిణామాలన్నీ ఒత్తిడి వల్ల ఏర్పడ్డవే.
అలై్జమర్స్ డిసీజ్: ఒత్తిడి కారణంగా మెదడులో కలిగే గాయాలు తీవ్రమై అలై్జమర్స్ డిసీజ్‌కు దారితీస్తుందని కొన్ని అధ్యయన ఫలితాలు పేర్కొంటున్నాయి. పైగా ఒత్తిడి వల్ల అలై్జమర్స్ డిసీజ్ చాలా వేగంగా తీవ్రమవుతుందని వైద్యపరిశోధకులు గుర్తించారు. అంటే అంతగా ఒత్తిడికి గురికాని వారిలో అలై్జమర్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ లేదా చాలా ఆలస్యంగా రావచ్చు. కానీ ఒకవేళ వారు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటే మాత్రం అది రావాల్సిన సమయం కంటే ముందుగానే వచ్చే అవకాశాలూ ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
వేగంగా వయసు పైబడటం (ఏజింగ్): ఒత్తిడి వల్ల వయసు పైబడటం చాలా వేగంగా జరుగుతుంది. అంటే వయసుకంటే ముందే వృద్ధులైపోతారన్నమాట. తల్లులు, పిల్లల డీఎన్‌ఏలను పరిశీలిస్తూ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ ఫలితాలు స్పష్టమయ్యాయి. ఒత్తిడికి గురైనవారు, తమ తల్లులతో పోలిస్తే వేగంగా వృద్ధాప్య దశను సమీపించినట్లు, వారిలో వృద్ధాప్య లక్షణాలు చాలా త్వరగా కనిపించినట్లుగా అధ్యయన ఫలితాలు పేర్కొంటున్నాయి. అంటే... ఒకరు ఆ వయసుకు కనబరచాల్సిన లక్షణాలను 9 నుంచి 17 ఏళ్ల ముందుగానే కనబరుస్తున్నట్లు ఆ అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
అకాల మరణం (ప్రీ–మెచ్యుర్ డెత్): ఒకరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిలో మరణం ఎప్పుడు సంభవించవచ్చో కొంతమేరకు అంచనా వేయడం మామూలే. అయితే కొందరిలో మరణించాల్సిన వయసు కంటే ముందే మరణించడం జరుగుతుంది. అప్పుడు చాలా త్వరగానూ, వయసు కంటే ముందుగా పోయారంటూ బాధపడటం మామూలే. మరణించాల్సిన వయసులో లేనప్పుడు మృతిచెందడం అన్నది ఒత్తిడి తీవ్రంగా ఉంండేవారిలో సంభవించడాన్ని అధ్యయనవేత్తలు చాలా దృష్టాంతాలలో పరిశీలించారు. తీవ్రమైన దీర్ఘకాలిక ఒత్తిడికి లోనయ్యేవారిలో మరణం చాలా ముందుగానే వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఒత్తిడి ఉన్నట్లు గుర్తించడం ఎలా?
కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ మనకు అది తెలియకపోవచ్చు. కానీ కొన్ని శారీరక లక్షణాలు సైతం ఒత్తిడిని గుర్తించేలా చేస్తాయి. అవి...
1 నిద్రపట్టకపోవడం
2ఆకలి లేకపోవడం
3 కండరాలు బిగుతుగా పట్టేయడం
4 మాటిమాటికీ తలనొప్పి
5 జీర్ణకోశ సమస్యలు
6 దీర్ఘకాలంగా దిగులు, బాధ లాంటివి ఉండి ఎంతకూ తగ్గకపోవడం.
ఇవి కనిపిస్తున్నప్పుడు ఆ శారీరకబాధలు చిన్నవే కదా అంటూ నిర్లక్ష్యం చేయకూడదు.
డాక్టర్ జి. హరిచరణ్‌సీనియర్ కన్సల్టెంట్,ఇంటర్నల్ మెడిసిన్,కేర్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్.
Comments
Please login to add a commentAdd a comment