అప్పుడు పద్మావతి ఏం చేసింది? | speecial story to padmavati movie | Sakshi
Sakshi News home page

అప్పుడు పద్మావతి ఏం చేసింది?

Published Fri, Oct 13 2017 11:57 PM | Last Updated on Sat, Oct 14 2017 9:17 AM

speecial  story to  padmavati movie

ఒక మహారాజు.
తను ప్రేమించే ఒక మహారాణి.
ఆ మహారాజే.. ఆ మహారాణి రాజ్యం, రాజసం.
ఆ రాజ్యాన్ని, ఆ రాజసాన్ని
ఓ బలవంతుడు తన ఖడ్గానికి
ఆహుతి చేశాడు!
అప్పుడు పద్మావతి ఏం చేసింది?
‘నా కంకణం.. ఖడ్గ సమానం’ అంది!!

అరుంధతి, మగధీర, రుద్రమదేవి, బాహుబలి, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి‘కోట కథల’ భారీ సినిమాలను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్‌ నుంచి వచ్చిన  జోధా అక్బర్, బాజీరావ్‌ మస్తానీ వంటి చరిత్రాత్మక చిత్రాలు కూడా కనువిందు చేశాయి. ఈ వరుసలోనిదే డిసెంబర్‌ 1న రానున్న ‘పద్మావతి’.

9 అక్టోబర్‌ 2017
రాత్రి 7.54 నిముషాలు. రాజమౌళి స్టన్‌ అయ్యాడు! ‘పద్మావతి’ ట్రైలర్‌ అతడి మతి పోగొట్టింది. 7 గం. 55 ని.లకు.. ‘ఇన్‌సేన్‌లీ బ్యూటిఫుల్‌’అని ట్వీట్‌ చేశాడు. ప్రతి ఫ్రేమ్‌ని చింపేశాడట భన్సాలీ.రాజమౌళి మళ్లీ చూశాడు ‘పద్మావతి’ ట్రైలర్‌ని! రాత్రి 8 గం. 1 ని.కి మరోసారి ట్వీట్‌ చేశాడు. రణ్‌వీర్‌ భయపెట్టేశాట్ట రాజమౌళిని!2015లో ‘బాహుబలి’ని చూసి దేశం ఇలాగే స్టన్‌ అయింది. ఇప్పుడు పద్మావతి ట్రైలర్‌ను చూశాక భన్సాలీ.. బాహుబలిలా కనిపించినట్లున్నాడు రాజమౌళికి!ఆ రోజు ట్రైలర్‌ని సరిగ్గా 13.03కి విడుదల చేశాడు భన్సాలీ. క్రీ.శ.1303 నాటి పద్మావతి కథకు దగ్గరగా ఉండడం కోసం.
 
భయాన్ని కత్తి మొన మీద ఆడిం చేవాడు రాజపుత్రుడు. ఇసుకతో నావను చేసుకుని సముద్రానికే సవాల్‌ విసిరేవాడు రాజపుత్రుడు. తల తెగిపడినా మొండెంతో ఖడ్గ చాలనం చేసేవాడు రాజపుత్రుడు.రాజపుత్ర మహిళేం తక్కువ! ఆమె గాజులు ఖడ్గమంత పదునైనవి. ట్రైలర్‌లోని ఈ మాటలు రోమాలు నిక్కబొడిచేలా చేస్తాయి. దీపికా పడుకోన్‌.. రాణీ పద్మావతి. షాహిద్‌ కపూర్‌.. రావల్‌ రతన్‌ సింగ్‌. రణ్‌వీర్‌ సింగ్‌.. అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ. కథ నడిపింది సంజయ్‌ లీలా భన్సాలీ.
  
భన్సాలీ ఈ సినిమాకు మొదట అనుకున్న పేరు ‘రాణీ పద్మావతి’. ఈ సినిమాను మొదట రిలీజ్‌ చేయాలనుకున్న డేట్‌ నవంబర్‌ 17. రెండూ మారిపోయాయి! రాణీ పద్మావతి వట్టి పద్మావతి అయింది. నవంబర్‌ 17.. డిసెంబర్‌ 1 అయింది. కారణం కాంట్రావర్శీలు. షూటింగ్‌కి మూడుసార్లు బ్రేక్‌ పడింది. ఈ ఏడాది జనవరిలో ఒకసారి. మార్చిలో రెండుసార్లు. రాజస్థాన్‌లోని జైగఢ్‌ ఖిల్లాలో షూటింగ్‌కి భన్సాలీ సెట్స్‌ అన్నీ వేసుకున్నాక అక్కడి రాజపుత్రకర్ణి సేనలు వచ్చి సెట్స్‌ని ధ్వంసం చేశాయి. భన్సాలీ చరిత్రను భ్రష్టు పట్టిస్తున్నారని వారి ఆరోపణ. ‘ఖిల్జీకి, పద్మావతికి మధ్య ప్రేమ కుదిరిస్తే నీ తిక్క కుదిరిస్తాం’ అని భన్సాలీని బెదిరించారు. శాంపిల్‌గా రెండు దెబ్బలు కూడా వేశారు. భన్సాలీ చెంపలు కందిపోయాయి. ‘లేదు, నేను ఖిల్జీ, పద్మావతిల మధ్య ప్రేమను చూపించడం లేదు’ అని కన్విన్స్‌ చెయ్యబోయారు భన్సాలీ. ‘నీ చావు నువ్వెలాగైనా చావు. చరిత్రను మాత్రం చంపకు’ అని వెళ్లిపోయారు.

సెట్స్‌ చిత్తోర్‌గఢ్‌ ఫోర్ట్‌కి మారాయి. రాణీ పద్మినీ ప్యాలెస్‌ అందులోనే ఉంది. రాజపుత్రకర్ణి సేనలు అక్కడిక్కూడా వచ్చాయి. ప్యాలెస్‌లోని అద్దాలు భళ్లుమన్నాయి. అయితే అవి భన్సాలీ బిగించిన అద్దాలు కాదు. నలభై ఏళ్ల క్రితమే పురావస్తు వాళ్లు బిగించినవి. భన్సాలీ చెంపను పగలగొట్టే వీల్లేక అద్దాలను పగల గొట్టారు. భన్సాలీకి సెక్యూరిటీ ఉంది మరి.మూడో ఎటాక్‌ కొల్హాపూర్‌లో. ఎవరో వచ్చారు. వాళ్లు రాజపుత్రకర్ణి సేనలు కాదు. వచ్చి, ప్రొడక్షన్‌ సెట్స్‌ని, కాస్ట్యూమ్స్‌నీ, ఆభరణాలను తగలబెట్టి పరారయ్యారు! పద్మావతి కథ రాజస్థాన్‌ది. కొల్హాపూర్‌ ఉండేది మహారాష్ట్రలో. అక్కడివాళ్లకేంటి సంబంధం? సంబంధం కాదు. హైందవ చరిత్రతో ఉన్న అనుబంధం. పద్మావతితో ఉన్న బాంధవ్యం. ‘ఆ అమ్మాయి మనమ్మాయి’ అనే ఫీలింగ్‌. ఈ ఫీలింగ్‌ని భన్సాలీ హర్ట్‌ చేస్తున్నారా?! ఆయన చెప్పడం అయితే ‘కాదు’ అనే. ఏమో చెప్పలేం. దాడులేవీ జరక్కుండా ఉంటే ఖిల్జీకి పద్మావతికీ మధ్య ప్రేమ మొలకెత్తినట్లు చూపేవారేనేమో! ‘సృజనకారుడికి స్వేచ్ఛ ఉంటుంది’ అని మొదట ఆయన ఒకమాట అన్నారు. అయితే చరిత్రను వక్రీకరించేంత స్వేచ్ఛను ఆయనకు రాజపుత్రకర్ణి సేనలు ఇవ్వలేదు.

భన్సాలీ కథేంటి?
కథ ఏదైనా కావచ్చు. భన్సాలీ తీస్తే అందులో ప్రేమ ఉంటుంది. ఫిక్షన్‌ ఉంటుంది. చరిత్ర ఉంటుంది. ఈ మూడింటితో అల్లేస్తాడు. 1942 : ఎ లవ్‌ స్టోరీ, దేవదాసు, సావరియా, గోలియోం కీ రాస్‌లీలా రామ్‌–లీలా, బాజీరావ్‌ మస్తానీ.. ఇవన్నీ అల్లికలే. పద్మావతి ఇంకో అల్లిక. మొదట ఐశ్వర్యారాయ్‌నీ, సల్మాన్‌ఖాన్‌ని అనుకున్నాడు. పద్మావతిగా ఐశ్వర్య, ఆమె భర్త రావల్‌ రతన్‌సింగ్‌గా సల్మాన్‌. ‘అతనుంటే నేను చేయను’ అని ఐశ్వర్య, ‘ఆమె ఉంటే నేను చేయను’ అని సల్మాన్‌! మిగిలింది దీపికా పడుకోన్, రణ్‌వీర్‌ సింగ్‌. గోలియోం కీ రాస్‌లీల రామ్‌–లీల, బాజీరావ్‌ మస్తానీల హిట్‌ జంట. దీపికను పద్మావతిగా, రణ్‌వీర్‌ను ఖిల్జీగా సెలక్ట్‌ చేసుకున్నాడు భన్సాలీ. ప్రియాంకా చోప్రాను కూడా చిన్న రోల్‌ చేసిపెట్టమని అడిగాడు. ముందు ఎస్‌ అంది. తర్వాత నో చెప్పింది. (ఇప్పుడు పద్మావతిలో ఉన్న అదితి రావ్‌ హైద్రీ పాత్రనే బహుశా అతడు ప్రియాంకకు ఆఫర్‌ చేసి ఉండాలి). రణ్‌వీర్‌కు ముందు భన్సాలీ షారుక్‌ని కూడా అనుకున్నాడు. ‘ఉమెన్‌ సెంట్రిక్‌’ కదా.. అని షారుక్‌ నవ్వి ఊరుకున్నారు.సినిమా పేరైతే ‘రాణీ పద్మావతి’ అన్నాడు కానీ, కథేంటో బయటపెట్టలేదు భన్సాలీ. ఇంకా అల్లుతూనే ఉన్నానన్నాడు. ఆగే ఓపిక మీడియాకు ఎక్కడిదీ! తనే అల్లేసింది. తీస్తున్నది భన్సాలీ కాబట్టి.. దండయాత్రకు వచ్చిన ఖిల్జీ చక్రవర్తి మీద పద్మావతికి ప్రేమ చిగురించే అవకాశాలున్నాయి అని రాసేసింది. పోనీ అప్పుడైనా ‘అది కాదు’ అన్నాడా భన్సాలీ! లేదు. ఆ తర్వాత అన్నాడు.. ‘లేదు.. లేదు.. వారిద్దరి మధ్యా ప్రేమ ఉండదు’ అని.. సేనలొచ్చి సెట్స్‌ని తగలబెట్టాక!!మరేంటి భన్సాలీ స్టోరీ? సెట్సే ఆయన స్టోరీ, డైలాగ్సే ఆయన స్టోరీ. మ్యూజిక్కే ఆయన స్టోరీ. దీపిక కళ్లు, రణ్‌వీర్‌ మీసాలు, షాహిద్‌ బక్కపలుచని చువ్వలాంటి దేహం.. ఇవీ ఆయన స్టోరీ. పద్మావతి ఆత్మగౌరవం అసలైన స్టోరీ. ‘రాణీ పద్మావతి’ అనే టైటిల్‌లోంచి సేఫ్‌సైడ్‌ ‘రాణి’ని కూడా తొలగించారు భన్సాలీ. రాణీ పద్మావతి చరిత్ర కథ. పద్మావతి భన్సాలీ కథ. నో కాంట్రావర్సీ.

అసలు కథేంటి?
రాణీ పద్మావతి అందాలరాశి. రావల్‌ రతన్‌ సింగ్‌ భార్య. రతన్‌సింగ్‌ రాజపుత్రుడు. 1302–03 లో మేవార్‌ చక్రవర్తి. అదే సమయంలో ఢిల్లీ చక్రవర్తి అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ. రాణీ పద్మావతి అందం గురించి విని ఉంటాడు ఖిల్జీ. ఎలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. దండయాత్ర చేసి రతన్‌సింగ్‌ని చంపేస్తాడు. ఇది తెలిసి రాణి పద్మావతి, మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.ఈ స్టోరీని చరిత్రకారులెవ్వరూ సమర్థించరు.  ఇదొక ఫిక్షన్‌. మన బాలీవుడ్‌ డైరెక్టర్‌ సంజయ్‌లీలా భన్సాలీ లాగే మాలిక్‌ మహ్మద్‌ జయసీ అనే కవి ఒకాయన ఉండేవాడు. 1540లో ఆయన దేవనాగరి భాషలో కొంచెం రియాల్టీని మిక్స్‌ చేసి ‘పద్మావతి’ అనే కావ్యఖండాన్ని సృష్టించాడు. మహ్మద్‌ జయసీ తనకు రెండొందల ఏళ్ల ముందునాటి సంగతిని ఇలా ఊహించి రాస్తే, ఇప్పుడు భన్సాలీ తనకు ఐదొందల ఏళ్ల ముందునాటి మహ్మద్‌ జయసీ కావ్యాన్ని సినిమాగా తీశాడు. జయసీ కావ్యంలో రాణీ పద్మావతి తన స్వాభిమానాన్ని కాపాడుకోడానికి ఖిల్జీకి దక్కకుండా ఆత్మాహుతి చేసుకుంటే.. ఇక్కడ భన్సాలీ సినిమాలో పద్మావతిని ఖిల్జీతో ప్రేమలో పడేయాలని మొదట అనుకున్నారట! ఆ అనుకోవడం ఎంతవరకు నిజమో కానీ, పద్మావతి కల్పిత పాత్ర అయినప్పుడు.. ఎలా తీస్తే ఏముందని యూనివర్శిటీ ప్రొఫెసర్లు కొందరు వాదించారు. ఏళ్లుగా ఉన్న నమ్మకం.. అది కల్పితంలోంచి పుట్టినదే అయినా.. వాస్తవంగా స్థిరపడిపోయినప్పుడు వాదనలు పని చేయవు. అందుకే పద్మావతి గురించి మనం విన్నదాన్నే ఇప్పుడు భన్సాలీ మనకు చూపించబోతున్నారు.

స్టిల్‌ వాటర్స్‌ రన్‌ డీప్‌
సినిమాలో షాహిద్‌ను రణ్‌వీర్‌ డామినేట్‌ చేశాడని సోషల్‌ మీడియాలో ట్రాల్స్‌ని బట్టి తెలుస్తోంది. పైగా షాహిద్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ట్రైలర్‌ ఫొటో కూడా రణ్‌వీర్‌ ఇమేజ్‌ని పెంచేలా ఉంది. నడుముపై భాగంలో బట్టల్లేకుండా ఖడ్గాన్ని జ్వాలల్లో పదును తేలుస్తున్న స్టిల్‌ అది! ‘స్టిల్‌ వాటర్స్‌ రన్‌ డీప్‌. హి విల్‌ రైజ్‌ ఆన్‌ ది ఫస్ట్‌ ఆఫ్‌ డిసెంబర్‌. వెయిట్‌ ఫర్‌ ఇట్‌’ అని ఆ స్టిల్‌కు గుంభనమైన ఒక వ్యాఖ్యను జోడించాడు షాహిద్‌. ఆ మాటల్లోని గూఢార్థం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. నిశ్చలంగా ఉన్న నీటి అడుగున లోతు ఎక్కువగా ఉంటుందని సాధారణ అర్థం. పైకి మామూలుగా ఉన్నాను, రిలీజ్‌ అయ్యాక నేనేంటో చూపిస్తాను అని షాహిద్‌ చెప్పదలచుకున్నాడా?

పద్మావతి ఫస్ట్‌ లుక్‌
పద్మావతి ఆర్ట్‌వర్క్‌ తప్ప పద్మావతి సినిమా వర్క్‌ మనకు ఇప్పటి వరకు లేదు. దీపికా పడుకోన్‌ పోస్టర్‌ రిలీజ్‌ అయ్యాక ఆ కొరత తీరింది. ఏ రాణి అయినా అందంగానే ఉంటుంది. ఈ రాణి మాత్రం స్టన్నింగ్‌ బ్యూటీ! ఆ డ్రెస్సు, జ్యుయలరీ, చేతులు ముకుళించిన ఆ సౌశీల్యం, చేతులు దించిన ఆ గాంభీర్యం.. పద్మావతికి భన్సాలీ ప్రాణ ప్రతిష్ట చేశారు. అయితే నుదుటి దగ్గర, బొట్టు కింద.. ఆమె రెండు కనుబొమలూ
కలిసిపోయిన లుక్‌ (యూనీబ్రో) కొందరికి నచ్చలేదు. చాలామందికి నచ్చింది. ‘చూస్తూ ఉండండి. మన అమ్మాయిలు వెంటనే ఈ లుక్కును ఫాలో అయిపోతారు’ అని ట్వీట్‌లు కూడా మొదలయ్యాయి.

ఆఫర్‌ ఇస్తే.. ఈ ముగ్గురూ ‘నో థ్యాంక్స్‌’ అనేశారు!

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement