శల్యసారథ్యం చేయవద్దు! | story about bagavadgeetha lines | Sakshi
Sakshi News home page

శల్యసారథ్యం చేయవద్దు!

Published Sun, May 15 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

శల్యసారథ్యం చేయవద్దు!

శల్యసారథ్యం చేయవద్దు!

భారతదేశంలో రాజై ఉండి సారథ్యం చేయవలసిన అవసరం లేనివాళ్లు ఇద్దరే. కృష్ణుడు, శల్యుడు. అయినా వాళ్లిద్దరూ సారథ్యం నేర్చుకున్నారు. అద్భుతంగా రథం నడిపేవారు.
కృష్ణుడు సారథ్యం చేసినా పొగడ్తలకు లొంగలేదు. అందుకే పార్థసారథి బిరుదు వహించాడు. పార్థసారథికి దేవాలయం కూడా ఉంది. భారతం కూడా ఏమంటుందంటే
యత్ర యోగీశ్వరః కృష్ణో, యత్రపార్థో ధనుర్ధరః
తత్రశ్రీ ర్విజయో భూతిర్ ధ్రువా నీతి ర్మతిర్మమ
... ఎక్కడ కృష్ణుడు సారథిగా ఉన్నాడో, ఎక్కడ మనం రథిగా ఉన్నామో అక్కడ విజయం ఉంటుంది - అని.

 మరి శల్యుడో..! ఆయన కృష్ణుడి కన్నా తక్కువేం కాదు. తక్కెట్లో పెడితే సరి సమానంగా తూగుతారు. సారథ్యంలో అంత గొప్పవాడు శల్యుడు. పైగా పాండవులకు మేనమామ. కురుక్షేత్ర యుద్ధం వస్తున్నదని తెలుసుకుని పాండవులకు సాయం చేద్దామని బయల్దేరాడు. ఆయన రాజ్యం ఇప్పటి ఆప్ఘనిస్థాన్ ప్రాంతంలో ఎక్కడో ఉండేది. దుర్యోధనుడు ఇది గ్రహించాడు. శల్యుడు పొగడ్తలకు లొంగిపోయేవాడని తెలుసు. శల్యుడు వచ్చాడంటే పాండవుల పక్షం వహిస్తాడని-శల్యుడు పరివారంతో సహా వచ్చే మార్గమంతటా వారు సేదదీరడానికి చలువ పందిళ్లు వేయించాడు, పాటలు పెట్టించాడు, మధురాన్నాలు చేయించాడు... ఇలా చాలా ఏర్పాట్లు చేయించాడు. ఇవి ఎవరు చేయిస్తున్నారో శల్యుడికి తెలియదు. పాండవులే చేయిస్తున్నారనుకున్నాడు.

‘‘పాండవులు కనబడరేం’’ అన్నాడు. వెంటనే దుర్యోధనుడు వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ’’మీరు మహానుభావులు, మీలాంటి సారథి ఎక్కడ ఉన్నాడు కనుక, విలాస విద్య అంత గొప్పగా నేర్చుకున్నారు, మీలాంటి ఉత్తములు ఎక్కడ దొరుకుతారు. పాండవులకు మేనమామ అయితే నాకు కాదా? ఆ గౌరవంతోనే వచ్చాను. ఇవన్నీ చేయడం నా అదృష్టం’’ అంటూ ఆకాశానికెత్తేసాడు. పొంగిపోయాడు శల్యుడు. పాండవులకు సహాయం చేద్దామని బయల్దేరినవాడు ఈ పొగడ్తలకు లొంగిపోయి, ‘‘నీకేం కావాలో చెప్పు. ఇచ్చేస్తా’’ అన్నాడు. చటుక్కున దుర్యోధనుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా, ’’మీరు మా పక్షాన ఉండండి’’ అనడిగాడు. ’’ఓ తప్పకుండా ఉంటాను’’ అన్నాడు. పొగిడాడు కదూ, మత్తు.. పరమ ప్రమాదకరమైన మత్తు. ‘‘తప్పకుండా వస్తా. మీ పక్షంలోనే ఉంటా’’ అని చెప్పాడు. దుర్యోధనుడు వెళ్లిపోయాడు.

 వెళ్లవలసింది పాండవుల ఇంటికి కదూ, శల్యుడు వెళ్లాడు అక్కడికి. ధర్మరాజు అంత కన్నా తెలివైనవాడు. అమిత వినయంగా ప్రవర్తించాడు. అన్నిటి కన్నా పైస్థానంలో కూర్చోబెట్టాడు. లోకంలో అన్నిటి కంటే ఎక్కువ మత్తెక్కించే మాట ఒకటుంది... ‘‘మీరు చెప్పకపోతే ఎవరు చెపుతారు సార్!’’ దానితో వాడికేం తెలియకపోయినా చెప్పడం మొదలెడతాడు నాలాగా. అందుకే ‘‘మీరు చెప్పండి. మేం వింటాం’’ అన్నారు పాండవులు.

శల్యుడు చెప్పడం మొదలెట్టాడు. చాలానే చెప్పాడు. అవన్నీ తెలిసిన విషయాలే అయినా ఏమీ తెలియనివాళ్లలా పాండవులు విన్నారు. పొంగిపోయాడు. ఏం కావాలని అడిగాడు. ‘‘మిమ్మల్ని ఇబ్బందిపెట్టం. మీరు ఇప్పటికే కౌరవుల పక్షం వహిస్తానని చెప్పి మాటిచ్చారు కదా! అందుకే  మీరు వారి పక్షంలోనే ఉండండి. కానీ మనసు మామీద పెట్టండి. మీ మేనల్లుడు పాండవుల్లో ఉన్నాడు. మేం గెలిచేటట్లు చూడండి. ఇది గుర్తు పెట్టుకోండి చాలు’’ అన్నారు.

 ‘‘ఓ తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను’’ అన్నాడు, శల్యుడు. మనసు పాండవుల దగ్గర, మనిషి కౌరవుల దగ్గర. యుద్ధానికి బయల్దేరాడు. నిజంగా మనసుపెట్టి చెయ్యగలడా? కర్ణుడికి సారథ్యం వహించమన్నాడు దుర్యోధనుడు. కోపమొచ్చింది శల్యుడికి. ఏమిటి, కర్ణుడికా, చెయ్యనుపోండి, అన్నాడు. మళ్ళీ పొగిడాడు దుర్యోధనుడు. తప్పకుండా చేస్తానన్నాడు. ఇక సారథ్యం వహిస్తూ ముందుకెడుతున్నాడు. కానీ మనసు పాండవుల మీద ఉంది. కర్ణుడితో ‘నువ్వు కాకివి’ అన్నాడు. పాండవులు హంసలాంటి వారన్నాడు. అర్జునుడితో యుద్ధం చేయడానికి నీకున్న అర్హతలేమిటన్నాడు, అర్జునుడి ముందు నీ శక్తి ఏ పాటిదన్నాడు.

ఇలా తిడుతుంటే కర్ణుడు తెలిసిన అస్త్రాలు కూడా మర్చిపోయాడు. ఇదెక్కడి ప్రారబ్ధం, ఇదెక్కడి సారథ్యం అనుకున్నాడు కర్ణుడు. దీనినే శల్య సారథ్యం అంటారు. అంటే అటువంటివాడు మన పక్షంలో ఉన్నా ఎదుటి పక్షానికి ఉపకారం చేసి మన నాశనానికి కారణమౌతాడు. చివరకు కర్ణుడు చచ్చిపోవడానికి కారణాల్లో శల్యుడు కూడా ఒకడయ్యాడు. ఎందుకొచ్చిందీ ప్రారబ్ధం శల్యుడికి? దుర్యోధనుడితో ముందే ‘‘నువ్వెన్ని చెప్పు. కావాలంటే నువ్వు చేసిన ఏర్పాట్ల ఖర్చంతా ఇచ్చేస్తాను. నేను ఎందుకు బయల్దేరానో, ఆ పని వదిలిపెట్టి ఇంకో పనిమీద రాను’’ అని తెగేసి చెప్పి ఉండొచ్చు. అలా అనగలిగాడా? పొగడ్తలకు లొంగిపోయాడు. అలా అనలేకపోయాడు. రెండు చోట్ల అదీ వైరిపక్షాల్లో మాటిచ్చాడు. ఏమయిపోయాడు?

అందుకే మాటకు నిలబడడం రావాలి. పొగడ్తలను ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకే పట్టించుకోవాలి. అంతకన్నా ఎక్కువ పుచ్చుకున్నారనుకోండి. అది అలవాటు చేసుకుంటే పాడైపోతారు. ఇది శీలవైభవం. మీరు ఎక్కడ ఉన్నా శాంతిగా ఉండాలి. మీరు పిల్లలుగా ఉంటే తల్లిదండ్రులు సంతోషపడాలి, మీరు తల్లిగా ఉంటే మీ పిల్లలు ఆనందించాలి, మీరు క్లాస్‌రూమ్‌లో ఉంటే క్లాస్ టీచర్ సంతోషపడాలి, మీరు స్నేహితుడిగా ఉంటే మీ స్నేహితులందరూ సంతోషించాలి,  మీరు భార్యగా ఉంటే మీ భర్త మిమ్మల్ని చూసి గర్వపడాలి...ఇలా మీరు ఏ స్థానంలో ఉంటే అది చూసి అవతలివారు పొంగిపోవాలి. అలా శీలవైభవాన్ని అందరూ అలవర్చుకున్ననాడు సమాజం సుభిక్షంగా ఉంటుంది.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement