
అయ్యో పాపం.. ధైర్యంగా ఉండాల్సింది. పోరాడాలి కానీ ప్రాణాలు తీసుకుంటారా!ఇంత సున్నితమైతే ఎలా బతుకుతారబ్బా.ఎంత మరణానంతర సానుభూతి!! తట్టుకోలేకపోవడమే తప్పయిపోయిందా! మరి.. చావుకు కారణమౌతున్న వారిని ఏం చేద్దాం?వాళ్లకు కదా ముందు ఇవ్వాల్సింది కౌన్సెలింగ్?! నొప్పించొద్దని వాళ్లను కదా చెవి మెలిపెట్టాలి. ఇప్పుడు మరో ‘సుశాంత్’ చనిపోయాడు. ‘రెస్ట్ ఇన్ పీస్’ అని ఆకాంక్షించి ఏం లాభం? నికృష్టపు టీజింగ్‌ల కాష్టం.. కాలనిదే!
ఇంట్లో ముగ్గురూ మగవాళ్లే. ఈ మాటనే ఇంకోలా చెప్పాలి. ఇంట్లో ఆడవాళ్లెవరూ లేరు. ఉహూ.. ఇలాక్కూడా కాదు. ఇల్లు వట్టిపోయింది! అవును. తల్లి లేని ఇల్లు. తల్లిలాంటి అక్క లేని ఇల్లు. తండ్రి, ఇద్దరు కొడుకులు.. ఈ ముగ్గురే మిగిలారు. తల్లి నాలుగేళ్ల క్రితం చనిపోయింది. అక్క పెళ్లయ్యాక మెట్టినింటికి వెళ్లిపోయింది. సోమవారం రాత్రి ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు లేకుండా పోయాడు. పదిహేనూ పదహారేళ్లవాడు. ఉరి వేసుకున్నాడు. తండ్రి కూరగాయల కోసం బజారుకెళ్లాడు. తమ్ముడు తన గదిలో చదువుకుంటున్నాడు. ఎయిత్ క్లాస్. పదమూడేళ్ల వాడు. ఆ పదమూడేళ్ల తమ్ముడికి, పదహారేళ్ల అన్నకు ఫ్రెండ్‌షిప్. అన్నీ షేర్ చేసుకుంటారు.
ఉరి వేసుకునే ముందు రోజు అన్న తమ్ముడి ముందు సుశాంత్ మాట తెచ్చాడు. ‘‘సుశాంత్ అంతటివాడే ఆత్మహత్య చేసుకుంటే నేనెందుకు చేసుకోకూడదు’’ అన్నాడు. ఆ మాట తండ్రితో అని ఉంటే ఇంకోలా ఉండేది. తప్పకుండా ఇంకోలా ఉండేది. టెన్త్ తర్వాత కొడుకును ఏ కోర్సు చదివించాలన్న దానిపై చక్కటి ప్రణాళికలే వేస్తున్నాడు ఆ తండ్రి. కొడుకు బ్రిలియంట్. ఈ నెల 27న యూపీ టెన్త్ రిజల్ట్స్. మంచి ర్యాంకే వస్తుండేది. అయితే తండ్రికి అసలేమీ చెప్పకుండా, తమ్ముడికి మాత్రం చెప్పి వెళ్లిపోయాడు ఆ కుర్రాడు. తను చనిపోయాక తండ్రి చదువుకోడానికి మాత్రం చిన్న నోట్ పెట్టాడు.
‘‘నాన్నా నన్ను క్షమించు. నేనొక మంచి కొడుకును కాలేకపోయాను. నేను అమ్మాయిలా ఉంటానని, నా ముఖం ఆడపిల్లల ముఖంలా ఉంటుందని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. తట్టుకోలేకపోతున్నాను నాన్నా. ‘కిన్నర్’ అని కూడా పిలుస్తున్నారు. నా జీవితం నీ జీవితాన్ని కూడా చీకటి చేసేయకూడదు. అందుకే చచ్చిపోతున్నాను. నన్ను దీవించు నాన్నా. మళ్లీ జన్మలో మనింట్లోనే ఆడపిల్లగా పుట్టాలని దీవించు’’.. అని సూసైడ్ నోట్‌లో రాశాడు.
కన్నర్ అంటే ట్రాన్స్‌జెండర్. బంధువులు, వాళ్ల పిల్లలు అతడిని మరీ నేరుగా కిన్నర్ అని పిలవలేదు కానీ, కిన్నర్‌ని చూసినట్లే చూశారు. అలా అంటున్న విషయం, అలా చూస్తున్న విషయం తండ్రికి చెప్పలేదు. తల్లి ఉన్నా, అక్క ఉన్నా చెప్పుకునేవాడేమో. కొడుకు సూసైడ్ నోట్ చూడగానే తండ్రి చెట్టులా కూలిపోయాడు. ఉత్తరాఖండ్‌లోని చంపావత్ నుంచి వచ్చి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఉంటోంది ఆ కుటుంబం. తండ్రిది మొబైల్ బిజినెస్. లాక్‌డౌన్‌లో తండ్రీకొడుకులు ఇంట్లోనే ఉంటున్నారు. అప్పుడైనా అతడు కొడుకు మనోవేదనను గ్రహించి ఉండాల్సింది. కొన్నింటిని గ్రహించాల్సిందే. తప్పదు. వేదన పడేవాళ్లు పైకి చెప్పుకోలేరు. ఒక్క సంకేతాన్నయినా ఆయన గుర్తించవలసింది. ‘‘నా కొడుకు నార్మల్‌గానే ఉంటాడు. శారీరకంగా సున్నితంగా ఉన్నంత మాత్రాన కామెంట్ చేసేయడమేనా! ఎంత వయసని?! వాడిలో çపసితనమింకా పోలేదు. మాటలతో చంపేశారు’’ అని ఆ తండ్రి ఇప్పుడు దుఃఖపడుతున్నాడు.
మనసును పొడిచి చంపడానికి లోకం మీద మాటల కత్తులు అనేకం మనుషుల మధ్య తిరుగుతుంటాయి. వేరు చేసి, వేరుగా చూసే కత్తుల ‘రక్తయ్య’లూ ఉంటారు. వారిని తట్టుకునే నిరోధక కణాలు మృదు మనస్కులలో ఉండవు. బాలీవుడ్ యువ నటుడు 34 ఏళ్లవాడు. అతడే కిందామీద అయ్యాడు. అతణ్ణయితే ఒక్క మాట అనకుండా చంపేశారు. కోట్ల రూపాయల్ని కాకుండా గుర్తింపును కోరుకున్నాడు అతను. ‘నువ్వు బాగా చేస్తున్నావ్’ అని నోరు తెరిచి ఒక్క మాట అనకుండా చంపేశారు. అనే మాటల్ని, అనని మాటల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లడమే జీవితంలోని అసలైన గెలుపు అని సైకియాట్రిస్టులతో చెప్పించే పరిస్థితి వచ్చేవరకు తల్లిదండ్రులు ఆగకూడదు.
Comments
Please login to add a commentAdd a comment