ఆలోచన అలలపై వర్ణాల వాన!
చీకటి తొలగిపోతోంది. వెలుతురు విచ్చుకుంటోంది. ఆ సమయంలో సముద్రం ఎలా ఉంటుంది? ఒక్క సూర్యుడు అనేక అలలపై ఉయ్యాలలూగుతూంటాడు. ఆ వెలుతురు కేళిలో భూపాల రాగం వినిపిస్తుంది. వానపల్లి వెంకటేశ్వరరావు వర్ణ చిత్రాలు వీక్షకుడిలో ఆ రాగాలను ధ్వనిస్తాయి. ఆలోచనల అలలపై రంగుల వానను చిలకరిస్తాయి!
రాణ్మహేంద్రంలో జన్మించిన 35 ఏళ్ల వానపల్లి ఎనిమిదవ ఏట నుంచీ రంగులకు అభిమాని అయ్యాడు. అరచేతితో... అమ్మ గడపకు పసుపురాయడం, రెండు వేళ్లను కొబ్బరిచిప్ప పాలెట్‌లో ముంచి వీణపై తీగెలను స్పర్శించినట్లు కుంకుమలు అద్దడం రెప్పవేయకుండా చూసేవాడు. ఎదుగుతోన్నకొద్దీ మరిన్ని చిత్రాలు చూశాడు. తన ఊరి మహానుభావుడు దామెర్ల రామారావు చిత్రించిన రియలిస్టిక్ రూపసౌష్టవాలు, జైమినిరాయ్ జానపదాలు లేయర్‌పై లేయర్‌లా గుండె పొరలలో హత్తుకున్నాయి. బి.కాం చదివినా, హైద్రాబాద్‌లో డేటా క్వెస్ట్‌లో ఆరేళ్లు పనిచేసినా ‘నువ్వేమిటి? మమ్మల్నెప్పుడు బయటకు తెస్తావ్?’ అని లోపలి బొమ్మలు అలజడి చేస్తూనే ఉన్నాయి. జననీ జన్మభూమిశ్చ అనుకుని రాణ్మహేంద్రవరంలో తన ఆశలను విత్తాడు.
వానపల్లి కుంచె చివురించింది...‘దేవుని నమ్మినవాడు ఎన్నటికి చెడిపోడు’ అనే తత్వాన్ని ఒంటపట్టించుకుని! అతడి వస్తువు పౌరాణికం. పాత్రలు పౌరాణికం. దేవతల్లాంటి పల్లె మనుషులు కూడా. ఎంచుకున్న వాతావరణం తను పుట్టి పెరిగిన రాణ్మహేంద్రవరం పరిసరాలు.
వానపల్లికి కూడా దాదాపు అందరి చిత్రకారుల్లా గణేష్ ఇష్టమైన దేవుడు. హిందువుల్లోని అన్ని శాఖలు, బౌద్ధ జైన మతాలూ గణేష్‌కు ప్రాధాన్యతనిస్తాయి. ఎందరెందరో వేసిన గణేష్‌ను వానపల్లి కూడా వేశాడు, ఏమిటి ప్రత్యేకత? తన త్రీడీ అనుభవంతో గణేష్‌లో అదనపు డైమన్షన్‌ను చూపించాడు. అశోకవనంలో చెట్టుకొమ్మ నుంచి అప్పుడే దుమికిన (తోక కొమ్మను చుట్టుకునే ఉంది) పవనసుతుని సీతమ్మ దీవించడం, బాలాజీ దశావతారాలకు అతీతుడని ఆలోచింపజేయడం, తెలుగువారు వెయ్యేళ్లకు పైగా తమిళంలో పాడుకుంటోన్న పాశురాల రచయిత్రి గోదాదేవి, రేపల్లె వాసులకు బెడదగా మారిన కాళీయుడిపై తాండవం చేస్తోన్న బాలకృష్ణుడిని వానపల్లి భక్తితో చిత్రించారు.
‘జంక్ ఫుడ్’లాంటి వెస్టర్న్ టెంప్టేషన్స్‌కు లోనుగాకుండా మనం దూరం చేసుకున్న చద్ది అన్నాన్ని తాజాగా కలిపాడు వానపల్లి. ఇవి ఫోటోజెనిక్ కావు.‘ ఒరిజినల్స్‌లో రంగుల మేళవింపు ప్రత్యక్షంగా చూస్తేనే తెలుస్తుంది’ అంటారు కళారత్న సీఎస్‌ఎన్ పట్నాయక్. వానపల్లి తొలి ఎగ్జిబిషన్ ‘రంగుల వాన’ వైజాగ్‌లో త్వరలో ప్రారంభం కానుంది.
- పున్నా కృష్ణమూర్తి