పితృవాక్య పరిపాలనే పరమ ధర్మం | The paternal rule is the virtue | Sakshi
Sakshi News home page

పితృవాక్య పరిపాలనే పరమ ధర్మం

Published Sat, May 6 2017 11:11 PM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

పితృవాక్య పరిపాలనే పరమ ధర్మం

పితృవాక్య పరిపాలనే పరమ ధర్మం

తండ్రి అనేవాడు తనకేమిటని చూసుకోడు. తనకున్నది పిల్లలకిచ్చి వారు తృప్తిపడితే అదే సంతోషమనుకుంటాడు.

పితృ దేవోభవ
తండ్రి అనేవాడు తనకేమిటని చూసుకోడు. తనకున్నది పిల్లలకిచ్చి వారు తృప్తిపడితే అదే సంతోషమనుకుంటాడు. ఇది లౌకికమైన తండ్రికేకాదు, పరమేశ్వరుడు కూడా ఇదే బుద్ధితో ఉంటాడు. ఒకానొకప్పుడు సముద్రంలో హాలాహలం ఉత్పన్నమయి ప్రాణులన్నీ పడిపోతుంటే, తట్టుకోలేక తండ్రి అయిన పరమశివుడితో మొరపెట్టుకున్నాయి. ఆయన భార్యకు చెప్పుకున్నాడు. ‘మనం తల్లిదండ్రులం కదూ, మనం ఉండగా బిడ్డలు అలా బాధపడొచ్చా! పార్వతీ, నేను పుచ్చేసుకుంటా ఆ హాలాహలం’ అన్నాడు. ఆమెకూడా ‘సరే, మీ ఇష్టం’ అంది. తండ్రి కాబట్టి గబగబా వెళ్ళి చేతిలోకి తీసుకున్నాడు. ‘లోపలికి మింగినా, బయటికి వదిలినా లోకాలతోపాటూ లోకులూ పోతారు’ అని కంఠంలోనే  ఉంచేసుకుని మచ్చలేనివాడు కాస్తా నీలకంఠుడయ్యాడు. తండ్రిగా ఇంత కష్టాన్ని తాను సంతోషంగా స్వీకరించాడు. అదీ తండ్రి ఆర్తి అంటే.

తండ్రి తప్పుల్ని ఎంచడం, ‘ఆయనకేం తెలుసు, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను’ అనడం ఘోర అపచారం. తండ్రిని గౌరవించడం అంటే–తండ్రిని తండ్రిగా చూడడం, ఆయన మాటను శిరసావహించడం మాత్రమే. శ్రీరామాయణం లో ఒక సన్నివేశంలో రామచంద్ర మూర్తి లక్ష్మణస్వామితో  ఇలా అంటాడు–’ధర్మాన్ని గురించి తెలుసుకోవాలంటే ధర్మశాస్త్రాలేవీ చదవక్కరలేదు. తండ్రి చెప్పినమాట వినడమే బిడ్డల ధర్మం. ఆయనకు సేవచేయడమే ధర్మం. తండ్రిని ధిక్కరించడం ధర్మంకానే కాదు. నాకన్నీ తెలుసనుకోవడం పరమ అధర్మం’.
ఈవేళ సమాజంలో వింతపోకడ ఒకటి కనిపిస్తున్నది. ‘ఎవడి పెళ్ళి వాడి ఇష్టం. తండ్రికి చెప్పేదేమిటి?’అని. పుస్తకాలు తండ్రి కొనివ్వాలి, బడికి తండ్రి పంపించాలి. బట్టలు తండ్రి తీసివ్వాలి. కానీ ‘నాభార్య ఎవరో నేను నిర్ణయించుకుంటాను’. ఇది తప్పు. వివాహమనేది వ్యక్తిగత విషయం కానేకాదు. దానితో పలువురి ప్రత్యక్ష, పరోక్ష బాధ్యతలు, సమస్యలు, కుటుంబ గౌరవప్రతిష్ఠలు ముడిపడి ఉన్నాయి. పక్కన ఎటువంటి పిల్లవచ్చి కూర్చుంటే తన కుమారుడు సుఖశాంతులు పొందుతాడో తెలుసుకోగలిగిన వాడు తండ్రి ఒక్కడే. కాబట్టి కోడలిని నిర్ణయించే అధికారం తండ్రి ఒక్కడిదే.

రాముడికి సరైన ఇల్లాలిని వెతకండని దశరథుడు మంత్రులందరినీ పురమాయించాడు. ఇంతలో విశ్వామిత్ర మహర్షి రాక, తరువాత శివధనుర్భంగం అయ్యాయి. జనకమహారాజు బంగారు పాత్రలో నీళ్ళుపట్టుకొచ్చి కన్యాదానం చేస్తానన్నాడు. ‘‘ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవర్ని. క్షత్రియుడిని కాబట్టి శివధనుర్భంగం చేశాను. పిల్లను మీరిస్తారంటారేమో, నేను పుచ్చుకోను. ఆ పిల్ల నా భార్యగా ఉండాలో కాదో చెప్పవలసినవాడు నన్ను కన్న నాతండ్రి దశరథ మహారాజు. ఆయనకు కబురు చేయండి. ఆయన వచ్చి స్వీకరించ మంటే స్వీకరిస్తాను’’ అన్నాడు. అదీ రాముడి ప్రజ్ఞ. దానికి దశరథుడు పొంగిపోయాడు. ఆయన వచ్చి ’ఈమె నీకు భార్య’ అన్న తరువాత పాణిగ్రహణం చేశాడు.

తండ్రి అంటే రాముడికి ఎంత మర్యాదంటే...రామా! రామా! అని పిలిచే రామనామం గొప్పదే. కానీ తండ్రిపేరుతో కలిపి ‘దాశరథీ!’ అని పిలిస్తే చాలు ఉలిక్కిపడిపోతాడట! అమ్మో! నన్నెవరో మా నాన్న గారి పేరుతో పిలుస్తున్నారని పరవశించిపోతాడట! తండ్రిని గౌరవించే విషయంలో రాముడిని చూసి నేర్చుకోవాలి.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు


స్వరార్చకుడు
ఆరాధన

తాళ్లపాక అన్నమాచార్యులు అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ, అన్నమయ్య అంటే మాత్రం అందరం పులకిస్తాం. పదకవితా పితామహుడు, స్వరకర్త, దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి ఆద్యుడు అన్నమయ్య. తిరుమలేశుడంటే వల్లమాలిన భక్తితో అన్నమయ్య స్వామిపై 32 వేల పదములల్లి తరించాడు. ఆయన కీర్తనలతో తెలుగు నేల పులకించింది. చందమామరావే జాబిల్లి రావే అంటే పిల్లలు గోరుముద్దలు తింటారో తినరో కానీ, వేంకటేశ్వరుడు మాత్రం ఎంతో ఇష్టంగా నైవేద్యాలారగిస్తాడు. జో అచ్యుతానంద జోజో ముకుందా అంటూ అన్నమాచార్య కృతి ఆలపిస్తే చిన్నారులే కాదు... స్వామివారూ నిద్రలోకి జారుకోవలసిందే! సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం వైశాఖ శుద్ధ పూర్ణిమనాడు ఈ పుడమిపై అన్నమయ్యగా ఆవిర్భవించి, అదివో అల్లదివో హరివాసమూ అంటూ స్వామిని పొడగంటి, వినరో భాగ్యము విష్ణుకథా అంటూ కమ్మగా ఆలపించి, మెండైన బ్రాహ్మణుడుండేటి మెట్టుభూమి ఒకటే... ఛండాలుడుడుండేటి సరిభూమియునొకటే అంటూ కులమత భేదాలను నిరసించి ‘అదిగో అల్లదివో హరివాసమూ’ అంటూ స్వామి సేవలో తరించి నింగికెగసింది. ఈ పర్వదినాన అన్నమయ్య పదాలను పాడుకోవడమే కాదు, ఆ పదాలలోని పరమార్థాన్ని వంటబట్టించుకోవడమే ఆయనకు అర్పించే అసలైన పదార్చన.. స్వరార్చన.

అహింసా రాజహంస
బౌద్ధ వాణి

మొదటి నుండి సిద్ధార్థుడు హింసను ఒప్పుకునేవాడు కాదు. ఆయన జీవితంలో రెండు సంఘటనలు చాలా ముఖ్యమైనవి. వాటిలో ఒకటి హంస వృత్తాంతం. సిద్ధార్థుని పెదనాన్న కొడుకు దేవదత్తుడు. ఇద్దరూ స్నేహితులు. ఒకరోజున ఒక అందమైన హంస ఆకాశంలో ఎగురుతూ పోతోంది. దేవదత్తుడు బాణం సంధించి, హంసను నేలకూల్చాడు. అది రెక్కలు టపటప కొట్టుకుంటూ, బాధగా రోదిస్తూ వచ్చి, ఒక ఉద్యానవనంలో సిద్ధారున్ధికి దగ్గరలో పడింది. సిద్ధార్థుడు వెళ్లి, బాణం లాగి గాయాన్ని కడిగాడు. తోటలోని కొన్ని ఆకులు నలిపి, గాయం మీద ఉంచి, తన వల్లెవాటును చించి, కట్టుకట్డాడు. చల్లని నీటితో దాని ముఖాన్ని తుడుస్తుండగా పరుగు పరుగున దేవదత్తుడు వచ్చి– ‘‘ఈ హంస నాది. నాకు ఇవ్వు’’ అని అడిగాడు.

‘‘సోదరా! ఇది నాది. నీకు ఇవ్వను’’ అన్నాడు.‘‘దీన్ని కొట్టిన వాణ్ణి నేను. పడగొట్టిన వాడిదే హంస.’’ అన్నాడు దేవదత్తుడు.
‘‘దీన్ని రక్షించిన వాణ్ణి నేను. కాబట్టి రక్షించిన వాడిదే రాజహంస’’ అన్నాడు సిద్ధార్థుడు. ఇద్దరి వాదం వివాదంగా మారి చివరికి రాజసభకు చేరింది. హంస ఎవరిదో ఎవ్వరూ తేల్చలేకపోయారు. చివరికి మహామంత్రి కల్పించుకుని, హంసను సభమధ్యలో నిలబెట్టి, ‘‘మీ ఇద్దరూ పిలవండి. ఎవరి దగ్గరకొస్తే వారిదే హంస’’ అన్నాడు. అది సిద్ధార్థుడు పిలవగానే వచ్చి అతని భుజం మీద వాలింది.
కొన్ని రోజులు ఆ హంసను తన దగ్గరే ఉంచుకుని, గాయం మానగానే ఆకాశంలో వదిలేశాడు. ‘‘చంపడమే కాదు, స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్ని పంజరాల్లో బంధించినా హింసే’’ అని చాటిన ఆ కరుణాసముద్రుడు
 సిద్ధార్థుడు... గౌతమ బుద్ధుడు.
– డా. బొర్రా గోవర్ధన్‌

మేధాసంపదకుగురువు
అను గ్రహం

నవగ్రహాలలో గురువు మేధాసంపదకు, ఆధ్యాత్మిక శక్తికి, నైతికతకు కారకుడు. దేవగురువైన బృహస్పతినే నవగ్రహాలలో గురువుగా వ్యవహరిస్తారు. జ్యోతిష శాస్త్రరీత్యా గురువు సహజంగానే శుభఫలితాలను ఇచ్చే గ్రహం. అయితే, కొన్ని సందర్భాలలో గురుగ్రహం వల్ల కూడా కొన్ని చెడు ఫలితాలు సంభవిస్తాయి. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు, స్వక్షేత్రంలో ఉన్నప్పుడు, మిత్రక్షేత్రాల్లో ఉన్నప్పుడు, మిత్రగ్రహాలతో కలసి ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. చంద్రునితో కలసి కేంద్రాలలో ఉన్నప్పుడు గజకేసరి యోగం కలిగిస్తాడు. గురువు వల్ల శుభయోగాలు కలిగినప్పుడు గుకె దశాంతర్దశలలో మేధాసంపద, సాంఘిక గౌరవం, గురువుల అనుగ్రహం, న్యాయాధికారం, పాలనాధికారం, సంపద ప్రాప్తి కలుగుతాయి. గురుబలం గల వారు బోధన, పరిశోధన, న్యాయ, శాస్త్ర, ఆధ్యాత్మిక వృత్తుల్లో రాణిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో ఉంటే గురువులు, అధికారుల ఆగ్రహానికి గురికావడం, నష్టాల్లో కూరుకుపోవడం వంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక నష్టాలు, ఆరోగ్యభంగం, మనశ్శాంతి లోపించడం జరుగుతుంది. ఈ దుష్ఫలితాలు తొలగడానికి గురుజపం, పూజ, శనగలు, పసుపు వస్త్రాలు దానం ఇవ్వడం, కనక పుష్యరాగం ధరించడం మంచిది.

దేవునితో కాదు... దేవునిలో ఉండాలి!
సువార్త

దేవుడు చాలా పెద్దగా ఉంటాడా అన్నది పదేళ్ల బాలుకు సంశయం. అప్పుడే ఆకాశంలో వెళుతున్న ఒక విమానాన్ని చూపించి, అంతుంటాడు దేవుడని తండ్రి చెప్పాడు. ‘‘దేవుడంత చిన్నవాడా?’’ అన్నాడా బాలుడు నిరుత్సాహంగా. మరునాడు తండ్రి విమానాశ్రయానికి తీసుకెళ్తే అక్కడ విమానాల్ని దగ్గర నుండి చూసి ‘విమానాలు ఇంత పెద్దవా?’ అన్నాడా బాలుడు. ‘‘అవును, దూరం నుండి అన్నీ చిన్నవే. దేవుడూ అంతే. ఆయనకు సమీపంగా ఉంటే ఆయనెంత పెద్దవాడో అర్థమవుతుంది’’ అన్నాడు తండ్రి. ధర్మశాస్త్రోపదేశకుడొకాయన యేసును దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటిలోకి అతి ప్రాముఖ్యమైనదేది? అనడిగాడు. అత్యంత ప్రాముఖ్యమైనవి ఒకటి కాదు రెండున్నాయంటూ, అద్వితీయుడైన దేవుని సంపూర్ణంగా ప్రేమించాలన్నది మొదటిది కాగా, దేవుని సంపూర్ణంగా ప్రేమించినట్టే, మన పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించాలన్నది రెండవ ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని యేసు జవాబిచ్చాడు. ‘నిజమే, బలులివ్వడం, హోమాలు చేయడం కన్నా ముఖ్యమైనది. దేవుని, మన పొరుగువానిని ప్రేమించడమే ముఖ్యమని ఆ బోధకుడు అంగీకరించాడు. అందుకు యేసు నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవని అతనితో వ్యాఖ్యానించాడు (మార్కు 12:33)
 దేవునికి దూరంగా ఉండటం కన్నా, దగ్గరగా ఉండటం మంచిదే! కాని ఈ రెండింటి కన్నా దేవునిలో ఉండేవారు నిజంగా ధన్యులు. ఈ సాన్నిహిత్యంలో దేవుని మహాలక్షణాలు, ఆయన శక్తి విశ్వాసికి సొంతమవుతాయి. లోకమన్నా, లోకభోగాలన్నా అందరికీ ఆకర్షణే! దీపం çపురుగులకూ దీపానికి ఉన్న ఆకర్షణలాంటిదే ఇది.

చివరకు ఆ పురుగులన్నీ దీపం వెలుగులో తిరుగుతూనే దీపం మంటలో పడి అంతమవుతాయి. లోకానికి వెలుగు, మంట రెండూ ఉన్నాయి. లోకం వెలుగులో ఎదిగి బాగుపడాలనుకునేవారు చివరకు దాని మంటలో మాడి మసైపోక తప్పదు. మరణాంతకరమైన ఈ ‘ఆకర్షణ’ నుండి తప్పించుకునే ఒకే ఒక మార్గం దేవునికి దగ్గర కావడం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు మంట కారణంగా వెలువడేది కాదు. ఆయనే వెలుగు గనుక ఆ వెలుగులో విశ్వాసికి లోకానుబంధం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. దేవునికి సమీపమయ్యే కొద్దీ లోకాకర్షణకు దూరమై వాటన్నింటికీ అతీతుడవుతాడు విశ్వాసి. ప్రభువులో ఎదగడమంటే ఇదే. మొక్క నేల‘లో’ ఉంటేనే ఎదుగుతుంది, స్థిరపడుతుంది, ఫలాలనిస్తుంది. నేలలో పడకుండా నేలకు ఎంత సమీపంలో ఉన్నా ఆ విత్తనం మొక్కగా మారడం అసాధ్యం. అందుకే యేసు ‘నాలో’ ఉంటేనే ఫలిస్తారని బోధించాడు (యోహాను 15:4). విమానాన్ని దూరం నుండి చూసే వారి కన్నా అతి దగ్గరి నుండి చూసే వాళ్ళు గొప్పవాళ్లనుకోవడం భ్రమ. విమానంలో కూర్చొని ప్రయాణించే వారికే దాని శక్తి, వేగం, అదిచ్చే ఆనందం అర్థమవుతుంది. ఆయనలో ఎదగాలనుకుంటే ఆయనలో స్థిరంగా వేళ్లూనడం తప్ప వేరే మార్గం లేదు.
– రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్‌

సత్కార్యాల్లోనేసంతోషం.. సాఫల్యం
ఇస్లాం వెలుగు

అందమైన ఇల్లు, కోరుకున్న భార్య, రత్నాల్లాంటి బిడ్డలు, విలాసవంతమైన వాహనాలు, కావలసినంత బ్యాంకుబ్యాలెన్సు, బలం, అధికారం, – ఇంకా రకరకాల విలాసవంతమైన సాధనా సంపత్తి నిత్యం అందుబాటులో ఉన్నప్పటికీ, సంతోషం కోసం, సంతృప్తికరమైన జీవితం కోసం వెదుకులాట మానవసమాజంలో ప్రతినిత్యం మనం చూస్తున్నాం. అన్నీ ఉండి కూడా అనుభవించలేని అనేకమంది సంపన్నులూ మనకు పరిచయమే. అంటే ఇవన్నీ పాక్షిక ఆనందాన్ని మాత్రమే అందించగలవు కాని, పరిపూర్ణసంతోషానికి సోపానం కాలేవని మనకు అర్ధమవుతోంది. అయినా మనిషి అనాదిగా శాంతి, సంతోషాలకోసం తంటాలు పడుతూనే ఉన్నాడు. తనకు తోచిన ప్రయోగాలతోపాటు, తన లాంటి వారు చెప్పే సూత్రాలన్నిటినీ పాటిస్తున్నాడు. ఎవరెవరి చుట్టూనో తిరుగుతూ, చెప్పిందల్లా చేస్తూ, తృణమో పణమో సమర్పించుకుంటూ ఉన్నాడు. కాని ఎక్కడా శాంతి, సంతోషం లభించడంలేదు. ధనం ధారపోసి కొనుక్కుందామంటే, అది మార్కెట్లో లభ్యమయ్యే వస్తువుకూడా కాదాయె. మరేమిటీ మార్గం? మంచిజీవితం, శాంతి, సంతోషం, సంతృప్తి ఇవన్నీ ఎండమావేనా??

ఈ విషయాన్ని ఒక శిష్యుడు ప్రవక్త(స)వారిని అడిగాడు. అప్పుడాయన ‘అల్లాహ్‌ను బాగా స్మరించు. అనాథలను ఆదరించు. పేదసాదలకు శక్తిమేర సహాయం చెయ్యి.’ అని ఉపదేశించారు. అంటే, ఇలా చెయ్యడం ద్వారా నువ్వు కోరుకుంటున్న శాంతి, సంతోషాల మంచి జీవితం ప్రాప్తమవుతుంది అని అర్ధం. కాని దురదృష్టవశాత్తు నాలుగు రాళ్ళ సంపాదన సమకూరగానే మనుషుల్లో అహం పెరిగిపోతోంది. దైవాన్ని స్మరించడం తరువాత సంగతి, అసలు దైవాన్నే మరిచి పోయి, పేద సాదలను దగ్గరికి రానివ్వని పరిస్థితి నెలకొంటోంది. మరిక శాంతి లభించాలంటే ఎలా లభిస్తుంది.? కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో దైవాన్ని స్మరిస్తూ, సాధ్యమైనంతమేర మంచి పనులు చేస్తూ, చెడులకు దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి.

సత్కార్యాల్లో లభించే సంతోషం... సంతృపి ్తమరెందులోనూ లభించదు. ధర్మబద్ధమైన సంపాదన, ధర్మసమ్మతమైన ఖర్చు, సత్కార్యాల్లో సమయాన్ని వెచ్చించడం... ఇదిగనక మనం ఆచరించగలిగితే నిత్యసంతోషం, ఇహపరసాఫల్యం సొంతమనడంలో సందేహమే లేదు.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

నృసింహ జయంతి
ఒక పర్వం

శ్రీమన్నారాయణుని దివ్యావతారాలలో నాలుగవదైన  నృసింహావతారం అత్యంత విశిష్టమైనది. వైశాఖ శుద్ధ  చతుర్దశినాటి సాయంకాలం నరసింహమూర్తి హిరణ్యకశిపుని వధించేందుకు ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి.‘ఇందుగలడందులేడని సందేహము వలదు’ అన్న తన భక్తుడైన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసి చూపడానికి స్తంభం బద్దలు కొట్టుకుని వచ్చాడు. జగత్తు అంతటా తానున్నానని నిరూపించాడు.ఈ రోజు ఆచరించవలసిన విధులునృసింహ జయంతినాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి తలంటుకొని స్నానం చేసి స్వామివారికి షోడశోపచార పూజ జరిపి, శ్రీ నృసింహస్తోత్రం–శ్రీ నృసింహ సహస్ర నామ జపం చేసి పానకం–వడపప్పు, చక్రపొంగలి–దద్ధ్యోదనం నివేదిస్తే స్వామి వారి అనుగ్రహంతో సర్వసంపదలు లభిస్తాయి.ప్రాణభయం, శతృపీడ, దుష్టగ్రహాల వల్ల, భూత ప్రేత పిశాచాలు, శత్రువుల దుష్ట ప్రయోగాల వల్ల కలిగే బాధలను తక్షణమే నివారించి భక్తులను రక్షించి, ఆ ప్రయోగం చేసినవారిపైనే తిప్పికొట్టే అనుగ్రహమూర్తి – శ్రీ నారసింహుడుసర్ప, మృత్యు, అగ్ని, అకాల మరణ, శస్త్ర, వ్రణ, శతృపీడలవల్ల బాధపడ్డవారు, చెరసాల పాలబడ్డవారు, దుష్టులచే పీడించబడే సాధువులు శ్రీనృసింహస్వామిని జపధ్యాన ఉపాసనల ద్వారా పూజించినట్లయితే, తక్షణమే కష్టాలనుండి విముక్తి పొందుతారని పెద్దల మాట.

నయన మనోహరం... నేత్ర దర్శనం
ఒక విశేషం

తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం రోజున శ్రీవారి దర్శనానికి విశిష్టత ఉంది. మూలమూర్తి దర్శనం, సమర్పించే నివేదనలు, అలంకారాలు విభిన్నంగా ఉంటాయి. ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత మూలమూర్తికి ఎలాంటి ఆభరణాలు, అలంకారాలు లేకుండా  నిరాడంబర స్వరూపంతో దర్శన మిస్తారు. ఆభరణాలే కాకుండా నొసటన పెద్దగా ఉండే పచ్చ కర్పూరపు తిరునామాన్ని బాగా తగ్గించి, స్వామి నేత్రాలను దర్శించుకునే మహద్భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తారు. ఆ రోజు ఆభరణాల బదులు పట్టుధోవతిని  ధరింప చేస్తారు. 12:2 కొలతలతో పట్టు ఉత్తరీయాన్ని యజ్ఞోపవీతంగా అలంకరిస్తారు.  

స్వామివారి శిరస్సుపై కిరీటాన్ని తీసి పట్టువస్త్రాన్ని కిరీటం తరహాలో తలపాగా చుడతారు. బంగారు శంఖచక్రాలు, బంగారు కర్ణభూషణాలు, సాలిగ్రామ హారాలు అలంకరిస్తారు. మెడలో వక్షఃస్థల బంగారు అలమేలు మంగహారం అలంకరిస్తారు. కాళ్లకు కyì యాలు, పాదాలకు బంగారు తొడుగులు అలంకరిస్తారు. ఇలా ద్వాపర యుగంలోని నల్లని కృష్ణయ్యే వెంకటాద్రిలో గోవిందుడయ్యా అన్న రీతిలో దర్శనమిస్తాడు స్వామి. ఈ గురువారం రోజున కొందరికి తాము చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిందిగా హెచ్చరించినట్టుగా స్వామివారు గోచరిస్తారు. గురువారం మాత్రం ఆలయంలోనేకాదు తిరుమలలో కూడా ఏ చిన్న తప్పు చేయడానికీ సిబ్బంది భయపడతారు.గురువారం నాటి దర్శనాన్నే నేత్ర దర్శనం అని అంటారు.

ఆకారాలు వేరైనా అసలు పదార్థం ఒక్కటే!
ఒక బోధ

మనం చక్కెరతో ఎన్నో విధాలైన బొమ్మలు చేస్తాం. ఆకారాలు వేరైనా మూల పదార్థం ఒక్కటే. అదేవిధంగా, అన్ని ఉపాధులూ పరమేశ్వరుని వివిధ రూపాలే అనే జ్ఞానం కలిగితే ఆనందం కలుగుతుంది. సర్వమంటేనే పరమాత్మ. ఆకలిని పోగొట్టుకోవడానికి అన్నం మాత్రం చాలు. కానీ, మన నాలుక షడ్రసోపేతమైన పదార్థాలను కోరుతూ ఉంటుంది. నయనేంద్రియం కూడా అందమైన వస్తువులను దర్శించాలని ఆకాంక్షిస్తూ ఉంటుంది. దీనికి కారణం రుచులపై ఉన్న ప్రేమే. ఆధ్యాత్మిక విషయాలలోనూ అంతే! ఎందరో దేవతామూర్తులున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కొక్క మూర్తి విశేషంపై అనురాగం, భక్తీ ఏర్పతుంటుంది. ఆ మూర్తిని మాత్రం వారు చిత్తశుద్ధితో సేవించుకుంటే చాలు... ఆనందం, ఐశ్వర్యం, అంత్యాన మోక్షప్రాప్తీ కలుగుతాయి. అయితే తొందరపడి వైద్యులనూ, మందులనూ మార్చినట్లు దేవతలను మార్చకూడదు. ఎన్నిమూర్తులున్నా, పరమాత్మ ఒక్కటే. నదులన్నీ సముద్రంలోనే కదా కలిసేది... అదేవిధంగా మనుషుల ఆరాధనలకు గమ్యం ఈశ్వరుడే.

వీటిలో ఏది నిజం?
ఒక సందేహం

దక్షయజ్ఞంలో సతీదేవి యోగాగ్నితో భస్మమయ్యిందని అంటారు కదా, మరి సతీదేవి దేహాన్ని భుజాన ధరించి శివుడు నాట్యం చేస్తుంటే, విష్ణువు తన చక్రంతో ఆ శరీరాన్ని ఛేదించాడనీ, ఆ శరీర ఖండాలు పడిన చోట శక్తిపీఠాలు ఏర్పడ్డాయనీ శక్తిపీఠాల స్థలపురాణాలు చెబుతాయి. వీటిలో ఏది నిజం? ఈ రెండు అంశాలూ విభిన్న పురాణాలలో ఉన్నాయి. అయితే ఇక్కడ యోగాగ్నిలో దగ్ధమవడం అంటే బూడిదై పోవడం కాదు. యోగాగ్ని ద్వారా జీవచైతన్యం దేహాన్ని విడిచిపెట్టిందని అర్థం చేసుకోవాలి. పురాణ కథలన్నీ సంకేత వాదాలు. మనలోని యోగకేంద్రాలనే శక్తిపీఠాలంటారు.

మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న సప్త భూమికలలో యాభై శక్తిపీఠాలున్నాయి. పరమేశ్వరుని ఆధారం చేసుకున్న శక్తి వ్యాపించింది. ఆ వ్యాపించిన స్థానాలే శక్తి పీఠాలు. వ్యాపకత్వమే విష్ణువు. ఇలా శివ– శక్తి– విష్ణు తత్వాలుగా వ్యాపించిన శక్తి కేంద్రాలకు ఈ కథ మార్మిక సంకేతం. పురాణ కథలను మానవ స్థాయిలో చూడరాదు. వాటిలో అనేక మంత్ర– యోగ– తత్త్వ శాస్త్ర మర్మాలుంటాయి. పరస్పర విరుద్ధంగా ఉన్న అంశాలను ఒకదానితో ఒకటి సమన్వయం చేయాలి. అలా సమన్వయం చేసి తెలుసుకోవాలంటే శాస్త్ర పరిజ్ఞానంతో విశ్లేషణ చేసుకోవాలి. తొందరపడి నిర్ణయానికి రాకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement