అదే నిజమైన క్రైస్తవం!
సువార్త
ప్రత్యుపకారం చేసే స్తోమత లేని దీనులకు చేసే సాయమే విశ్వాసికి అత్యంత ఆశీర్వాదకరమని యేసు ఇలా బోధించాడు. ఒక ధనవంతుడు గొప్ప విందు ఏర్పాటు చేసి పుర ప్రముఖులనందరినీ ఆహ్వానించాడు. అయితే వాళ్లంతా ఏవేవో సాకులు చెప్పి విందుకు రాలేమన్నారు. దాంతో నిరుపేదలు, వికలాంగులనందరినీ విందుకు తోడుకొని రమ్మని తన దాసుని పురమాయించగా, వాళ్లెంతో ఆనందంగా విందుకొచ్చారు. రాజవీధుల్లోని భిక్షగాళ్లను, కంచెల్లో పని చేసే కూలీలను కూడా పిలవమన్నాడతను. అలా కొత్త ఆహ్వానితులతో విందుశాల, అనుకోని ఆహ్వానంతో నిరుపేదల జీవితాలు నిండాయి. ధనికుని హృదయమూ ఆనందంతో నిండిపోయింది (లూకా 14:12–24).
గొప్ప వాళ్లంతా అహకారంతో తృణీకరించగా, ఆ అవకాశాన్నే అత్యానందంతో పేదలు, నిర్భాగ్యులు, అణగారిన వారికిచ్చిన దేవుని అద్భుతమైన ప్రేమను వర్ణించిన ఉపమానమిది. విందులో అగ్రస్థానాల్లో కూర్చుని ఆరగించవలసిన వాళ్లు తమ ఆధిక్యతను పోగొట్టుకుంటే, అదే విందులో చివర్న అంట్లు కడిగి, బల్లలు శుభ్రపరచి, అంతా ఊడ్చిపెట్టే అధములను హెచ్చించి, అవే అగ్రస్థానాల్లో కూర్చోబెట్టి విందు చేసిన దేవుని అసమానమైన ప్రేమను వర్ణించే మాటలే లేవు (యాకోబు 4:6). నేల మీద కూర్చోవలసిన వారు ధనికునితో సమానంగా కూర్చొని విందారగించే ఈ సన్నివేశం దేవుని రాజ్యంలో మాత్రమే సాధ్యం. సోషలిజం, కమ్యూనిజంలాంటి వ్యవస్థలు సిద్ధాంతాల్లో మాత్రమే ప్రతిపాదించిన సర్వసమానవత్వాన్ని కేవలం బోధించడమే కాదు, ఆచరించి చూపించిన నిజమైన సమానత్వవాది యేసుక్రీస్తు. దేవుడే మానవధారిౖయె యేసుక్రీస్తుగా దిగివచ్చి, తన పాదధూళితో సమానమైన మానవాళితో సహవసించడం, వారిని అక్కున చేర్చుకోవడం అనూహ్యమైన అంశం. అదే ప్రేమను ప్రతి విశ్వాసీ అలవరచుకోవాలి. విశ్వాసలు ప్రతి చర్యా, మాటల్లో అది ప్రతిబింబించాలి. గొప్ప వారికి గౌరవాన్నిచ్చి అగ్రహోదాలివ్వడం, పేదవారిని ఛీకొట్టడం లోక సంస్కృతి. దీనులు, పేదలు, అణగారిన వారిని అక్కున చేర్చుకోవడం దైవిక నియమం. సమాజంలో గొప్పవాళ్లకు సలాములు చేస్తూ, గులాములుగా బతికే నీచ సంస్కృతికి విశ్వాసులు, ముఖ్యంగా దైవసేవకులు ముందుగా స్వస్తి చెప్పాలి. దేవుని చిరునామాను నిరుపేదల్లో వెదికి, ఆయన గుండెచప్పుడును విలాసాల్లో తేలియాడే ధనికుల జీవితాల్లో గాక మురికివాడల్లో బతికే బడుగువాళ్ల జీవితాల్లో వినడం ప్రతి విశ్వాసీ అలవరచుకున్నప్పుడు ఈ లోకమే పరలోకమవుతుంది.ఈ లెంట్‌డేస్ (శ్రమదినాలు)లోమనం ఆకలితో ఉన్న పేదవాళ్లకు అన్నం పెడదాం, అభాగ్యుల ఆకలి తీర్చుదాం. నీళ్లు తోడి చెరువులో పోయడం అవివేకం, నిష్ఫలమైన కార్యం. నీళ్లు చెట్టుకు పోయాలి, చేనుకు తోడాలి, నీటితో దీనుల దాహం తీర్చాలి. అదే దేవుడు మెచ్చే నిజ క్రైస్తవం!!
– రెవ.డాక్టర్.టి.ఎ. ప్రభుకిరణ్