దొంగ జబ్బు | theft of a child wanting a thrill | Sakshi
Sakshi News home page

దొంగ జబ్బు

Published Tue, Sep 12 2017 12:08 AM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

దొంగ జబ్బు

దొంగ జబ్బు

క్రైమ్‌  పేరెంటింగ్‌

పర్సులో పైసలు ఉంటాయి.
చేతిలో క్యాష్‌ ఉంటుంది.
పాకెట్‌లో క్రెడిట్‌ కార్డు ఉంటుంది.
అవసరమైతే చెక్‌ బుక్‌ ఉంటుంది.
కానీ.. కొట్టుకొచ్చేస్తే.. మజా ఉంటుంది!
ఆ థ్రిల్లే వేరు.
దొంగతనం ఒక థ్రిల్‌ అనుకునే పిల్లలకు
అది ఒక రోగమనీ, అది ఒక నేరమనీ...
పేరెంట్స్‌ తెలియజెప్పాలి.


ఆనందీ.. నా వాచ్‌ కనడట్లేదు’’ గదిలో వెదుకుతూ కంగారుగా అడిగింది ఆనంది కజిన్‌ నిధి. ‘ఎక్కడ పెట్టావ్‌?’’ అడిగింది ఆనంది. ‘‘ఇక్కడే పెట్టా.. ఇందాక స్నానానికెళ్తూ కూడా చూశా ఆనందీ..!’’ డ్రెస్సింగ్‌ టేబుల్‌ సొరుగులన్నీ సోదా చేస్తూ చెప్పింది నిధి. ఇక్కడే పెడితే ఎక్కడికీ పోదు. నువ్వేం టెన్షన్‌ పడకు’’ అంటూ డ్రెస్సింగ్‌ టేబుల్‌ పక్కనే ఉన్న ర్యాక్‌లో వెదుకుతూ భరోసా ఇచ్చింది ఆనంది. ఏమర్రా టిఫిన్‌కి రారా?’’ అంటూ గదిలోకి వచ్చింది వాణి. వాళ్ల హడావుడి చూసి ‘‘ఏమైంది? ఏంటీ వెదుకుతున్నారు?’’ అని ఆరా తీసింది ఆనంది తల్లి వాణి.దీని వాచ్‌ కనపడట్లేదంట’’ నిధిని చూపిస్తూ చెప్పింది ఆనంది. ఎక్కడ పెట్టావ్‌?’’ సేమ్‌ క్వశ్చన్‌ వాణి నుంచి కూడా. ‘ఇక్కడే పెట్టా పిన్నీ..’’ ఏడుపు మొహంతో నిధి.‘ఇక్కడే పెడితే ఎక్కడికీ పోదుగాని.. ముందు టిఫిన్‌ తినండి చల్లారిపోతుంది. ఆనక వెదుకుదురు గానీ.. రండి రండి’’ అంటూ వాళ్లను టిఫిన్‌ కోసం తొందరపెట్టి హాల్లోకి వెళ్లింది వాణి. అయినా వాళ్లు నింపాదిగా ఆ గదంతా గాలించి నిరాశ, నీరసంతో హాల్లో డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వచ్చారు. దొరికిందా?’’ ఆత్రంగా వాణి.

‘‘ప్చ్‌ .. లేదమ్మా’’ పెదవి విరుస్తూ  కుర్చీలో కూలబడింది ఆనంది. ‘‘ఇంతలోనే ఎటు పోతుందే.. సరిగ్గా వెదికారా?’’ ప్లేట్‌లో టిఫిన్‌ పెడుతూ వాణి. ‘‘మూల మూలా.. గాలించాం’’ తనూ కుర్చీలో కూలబడుతూ చెప్పింది నిధి.‘‘తిన్నాక... ఎక్కడ పెట్టారో గుర్తుతెచ్చుకొని వెదకండి.. దొరుకుతుంది.. ఎక్కడికీ పోదు. ముందు తినండి’’ అంది వాణి వాళ్లను ఉత్సాహ పరిచేందుకు. కాని ఆమె మనసులో ఏదో అనుమానం. వారం కిందట.. ఆమె ఆడపడచు కూతురు వచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఆ పిల్ల చెవిపోగులు మిస్సయ్యాయి. దొరకలేదు. ఇప్పుడేమో తన అక్క కూతురి వాచ్‌. వాణీ అనుమానం పనిమనిషి లక్ష్మి మీదకు మళ్లింది. మళ్లీ వెంటనే ‘ఛీఛీ లక్ష్మి అలాంటిది కాదు. ఎన్నాళ్లబట్టి పనిచేస్తోంది ఈ ఇంట్లో? ఏ రోజూ ఓ  చిన్న స్పూన్‌  పోయిన దాఖలా కూడా లేదు. ఆమె మీద అనుమానం రావడమే తప్పు!’ అనుకుంది వాణి. మరి ఏమైనట్టు? ఆలోచనలో పడింది.

అమ్మ మీదొట్టు..
‘‘హేయ్‌.. ఈ నెయిల్‌ పాలిష్‌ ఎక్కడిది నీకు?’’ కాలేజ్‌ క్యాంటీన్‌లో కూర్చొని గోళ్లకు రంగు అద్దుకుంటున్న సునంది ఆ ప్రశ్నకు ఒక్కసారిగా ఉలిక్కిపడి తల పైకెత్తి చూసింది. వినీత. ‘ఆ... నాదే..’ కొంచెం తత్తరపాటు, ఇంకాస్త కలవరపాటుతో ఆన్సర్‌ చేసింది సునంది. ‘‘సునందీ.. అబద్ధం చెప్పకు. ఇది నాది’’ చూపుడు వేలుతో బెదిరిస్తున్నట్టుగా అన్నది వినీత.‘నేనేం చెప్పట్లేదు. మదర్‌ ప్రామిస్‌.. ఇది నాదే’’ అన్నది తల మీద చెయ్యి పెట్టుకుంటూ సునంది.ఆ సంభాషణ గొడవలా ఉండేసరికి అక్కడున్న వాళ్లంతా గుమిగూడారు ఏమైందంటూ!‘‘ఇది నా నెయిల్‌ పాలిష్‌ దొంగిలించింది’’ సునంది వైపు చూపిస్తూ ఫిర్యాదు చేసింది వినీత.‘‘హా... మీ కజిన్‌ యూఎస్‌ నుంచి పంపిందని చూపించావ్‌ అది ఇదే కదా?’’ అంది వాళ్ల క్లాస్‌మేట్‌ ఒకమ్మాయి సునంది పక్కన కూర్చుని ఆమె చేతుల్లోని నెయిల్‌పాలిష్‌ బాటిల్‌ తీసుకుంటూ.

తలూపుతూ ‘‘యా ..’’ అంది వినీత. ‘జస్ట్‌ షటప్‌.. ఇది నాది’’ అని ఆ అమ్మాయి చేతుల్లోని నెయిల్‌ పాలిష్‌ బాటిల్‌ తీసుకొని బ్యాగ్‌లో వేసుకొని అక్కడి నుంచి లేచి విసవిసా వెళ్లిపోయింది సునంది. ‘దొంగ మొహంది.. ఆ రోజు నీకు చూపించి బ్యాగ్‌లో పెట్టానా.. అంతే ఇంటికెళ్లి చూసేసరికి లేదు. ఎక్కడ పోయిందో అనుకున్నా.. ఇదిగో ఇప్పుడు చూశా దాని చేతిలో’’ అంది అక్కసుగా వినీత. ‘‘నిజంగా అది దొంగదే. మొన్న గ్రేస్‌ టిఫిన్‌ బాక్స్‌ కూడా దొంగతనం చేసిందట తెల్సా?’’ అంది ఆ క్లాస్‌మేట్‌. చెప్తా దీని పని’’ అనుకుంటూ తనూ అక్కడి నుంచి వెళ్లిపోయింది వినీత.

సెక్యూరిటీ చెక్‌
‘‘మేమ్‌... మీ బ్యాగ్‌ చెక్‌ చేయాలి ఒకసారి’’ బిల్‌కట్టి బయటకు వెళుతుంటే సెక్యూరిటీ అతను ఆపాడు ఆనందినిని. ‘‘వాట్‌ డు యూ మీన్‌’’ అరిచింది కోపంగా ఆనంది. ‘‘సారీ... మేమ్‌ బజర్‌ మోగుతోంది’’ అన్నాడతనుæ కూల్‌ అండ్‌ కామ్‌గా. ‘‘మేం బిల్‌ కట్టాం. ఇదిగో రిసీట్‌’’ అంది పక్కనే ఉన్న ఆనంది చెల్లెలు సునంది. ‘అదే మేమ్‌. ఒక్కోసారి పొరపాటుగా మాగ్నెటిక్‌ సెక్యూరిటీ ట్యాగ్‌ ఉన్నా బజర్‌ వస్తుంది. అందుకే చూడాలి. అది ఉంటే మీకూ ప్రాబ్లమే. దాన్ని మీరు తీసుకోలేరు’’ అన్నాడు.బిగుసుకుపోయింది సునంది. ఆ ఇద్దరి చేతుల్లో ఉన్న రెండు కవర్లను తీసుకున్నాడు సెక్యూరిటీ అతను. ఆనంది బ్యాగ్‌లో అన్నీ సవ్యంగానే కనిపించాయి. సునంది బ్యాగ్‌లో రెండు మాత్రమే బిల్డ్‌ గూడ్స్‌ ఉన్నాయి. పెర్‌ఫ్యూమ్‌ బాటిల్, లెదర్‌ జాకెట్, చిన్న వాలెట్‌ వంటివన్నీ బయటపడ్డాయి. అవి చూసి ఆనంది షాక్‌ అయింది. సునంది బిక్కచచ్చిపోయింది. చుట్టూ ఉన్నవాళ్లు చిత్రంగా చూడసాగారు. అవమానం తట్టుకోలేకపోయింది ఆనంది. బిల్‌ చేసిన వాటిని కూడా అక్కడే వదిలేసి తల దించుకుని బయటకు నడిచింది. ఆ వెనకే సునంది.
దొంగను కాను

‘‘అమ్మా.. ఇప్పుడర్థమైంది ఆ రోజు నిధి వాచ్‌ తీసింది ఇదే. దీని బ్యాగ్‌ చూడు.’’ అంటూ సునంది బ్యాగ్‌ను వాళ్లమ్మ ముందుకు తోసింది ఆనంది. షాపింగ్‌ నుంచి వచ్చాక సునంది వల్ల జరిగిన ఇన్‌సల్ట్‌ను పేరెంట్స్‌ ముందు బయటపెట్టింది ఆనంది. వాళ్లకూ అది షాకే. ఎందుకో ఆనందికి అనుమానం వచ్చి చెల్లి బ్యాగ్‌ వెదికింది. తన అనుమానం నిజమని తేలింది. ఆ బ్యాగ్‌నే ఇప్పుడు  వాళ్ల ముందుకు తోసింది. అందులోంచి చెవి పోగులు, వాచ్, నెయిల్‌ కట్టర్, పోర్కులు, స్పూన్లు, షాంపూ బాటిల్స్, నెయిల్‌పాలిష్‌ బాటిల్స్, కప్స్, బ్రాండెడ్‌ ఇన్నర్స్, పెర్‌ఫ్యూమ్‌లు ఉన్నాయి. అవన్నీ చూసి పేరెంట్స్‌కి నోటమాట రాలేదు. ‘ఈ లెక్కన నాన్న దగ్గర కూడా డబ్బు తీసింది నువ్వేనన్నమాట’’ నివ్వెరపోతూ అన్నది వాణి. తలదించుకుంది సునంది.

‘‘నువ్వెందుకే తలదించుకుంటావ్‌.. నిన్ను కన్నందుకు మేం దించుకోవాలి’’ అంటూ సునంది చెంప చెళ్లుమనిపించింది వాణి. ఆ హఠాత్పరిణామానికి బిక్కచచ్చిపోయిన సునంది కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. చెంప రుద్దుకుంటూ ‘‘నాన్నా.. ’’ అంటూ వాళ్ల నాన్నమీద పడిపోయింది. నేను కావాలని చేయట్లేదు నాన్నా! బయటకు వెళ్లినప్పుడు.. ఎవరి దగ్గరైనా ఏదైనా చూసినప్పుడు.. మీరెవరూ నన్ను పట్టించుకోనప్పుడు ఇలాంటి బుద్ధి పుడుతోంది. అలా అందరికన్ను కప్పి వాటిని తీస్తుంటే థ్రిల్లింగ్‌గా ఉంటోంది. అదంతా ఏదో ట్రాన్స్‌లో జరిగిపోతోంది నాన్నా.. ప్లీజ్‌.. నాన్నా.. నన్ను దొంగ అనొద్దు.. నేను దొంగను కాను’’ అంటూ ఏడుస్తూ్తనే అంది సునంది.‘‘దొంగతనం చేసి దొంగను కానంటావేంటే? తప్పించుకోవడానికి  ఈ వేషం కూడానా?’’ అంటూ వాణి ఇంకేదో అనబోతుంటే చెయ్యెత్తాడు ఆమె భర్త ఆపు అన్నట్టుగా. ‘‘ఇంకేం మాట్లాడొద్దు’’ అని కళ్లతోనే నెమ్మదిగా భార్యను వారించి కూతురిని లోపలకు తీసుకెళ్లాడు. బిడ్డ మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్నాడు ఆ తండ్రి.. తన కూతురికి కౌన్సెలింగ్‌ అవసరమని గ్రహించాడు. మానసిక వైద్యుడి సహాయం అవసరమనీ తెలుసుకున్నాడు.

ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటే..
ఇలాంటి వాళ్లను ట్రీట్‌ చేయడానికి థెరపిస్ట్‌ అవసరం తప్పనిసరి. థ్రిల్‌ కోసం, అటెన్షన్‌ కోసం దొంగతనం చేస్తున్నా.. దాన్ని తగ్గించడానికి ప్రొఫెషనల్‌ సైకోథెరపిస్ట్‌ సహాయం తీసుకోవాల్సిందే. అయితే, అంతకంటే ముందు పేరెంట్స్‌ కూడా కొన్ని విషయాలను గమనించి పిల్లలను మార్చే ప్రయత్నం చేయాలి. అసలు పిల్లలు ఇలాంటి నెగటివ్‌ థ్రిల్స్‌ను ఎందుకు కావాలనుకుంటున్నారో చూడాలి. ‘ఆత్మస్థైర్యం తగ్గి అలా ప్రవర్తిస్తున్నారా లేక.. ఏ రకంగానైనా సరే ఇంట్లో, బయటా తమ మీదకు దృష్టి మరల్చుకోవడానికి ఈ పద్ధతిని అవలంబిస్తున్నారా’ అన్నది నిర్థారించుకోవాలి. అలాగే పిల్లలు దొంగతనం చేస్తే గిల్ట్‌ ఫీలింగ్‌తో తల్లిదండ్రులు ఖండించలేకపోవచ్చు. కాని అది పిల్లల భవిష్యత్‌కు ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటివాటిని సమర్థించకూడదు.

అటెన్షన్‌ కోసమైనా, లో సెల్ఫ్‌కాన్ఫిడెన్స్‌తోనైనా లేదంటే దొంగతనం కోసం దొంగతనం చేసినా అది తప్పని చెప్పాలి. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో వివరించాలి. అంతేకాదు, ఇంకోసారి అలాంటి పిచ్చిపని చేస్తే పనిష్మెంట్‌ ఉంటుందని హెచ్చరించాలి. అది తప్పని ఇంట్లోవాళ్లంతా చెప్పాలి. షాప్‌లిఫ్టింగ్‌ చేస్తుంటే షాప్‌కి పంపించబోమని, కావల్సినవి చెప్తే తామే తెచ్చిపెడతామని స్పష్టం చేయాలి. ఒకవేళ ‘వెళ్లాల్సిందే’ అని పిల్లలు మొండికేస్తే దగ్గరుండి పేరెంట్స్‌ తీసుకెళ్లాలి తప్ప ఒంటరిగా పంపించకూడదు. అన్నిటికీ మించి పిల్లలు ఈ స్థితికి రావడానికి తమ అశ్రద్ధ ఏమైనా కారణమా అని పెద్దవాళ్లూ ఆలోచించాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి.
 – డాక్టర్‌ పద్మ పాల్వాయి, చైల్డ్‌ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌
- శరాది

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement