మీ పట్టుచీర భద్రమేనా..? | Tips For Caring Costly Silk Sarees | Sakshi
Sakshi News home page

మీ పట్టుచీర భద్రమేనా..?

Published Wed, Aug 8 2018 11:40 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Tips For Caring Costly Silk Sarees  - Sakshi

హిమాయత్‌నగర్‌: హిమాయత్‌నగర్‌కు చెందిన నీలిమారెడ్డి ఓ షాపింగ్‌ మాల్‌లో రూ.25వేలతో పట్టు చీర కొనుగోలు చేసింది. అయితే అది మూడు వారాలకే పట్టు కోల్పోయింది. బంజారాహిల్స్‌కు చెందిన మహాలక్ష్మి ఓ స్టార్‌ హోటల్‌లో నిర్వహించిన ఎక్స్‌పోలో రూ.18వేలతో పట్టు చీర తీసుకుంది. అదికాస్త నెల రోజులకే దారాలు రావడంతో అవాక్కయింది. వీరిద్దరే కాదు... ఇలా ఎంతోమంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అతివలు ఎంతో ఇష్టపడే పట్టు చీరలు పదిలంగా ఉండాలంటే ఎలా? నాణ్యమైన పట్టును గుర్తించి కొనుగోలు చేయడం, దాన్నితగిన జాగ్రత్తలతో భద్రపరచడమే దీనికి పరిష్కారం.

ఇదీ అసలైన పట్టు...  
పట్టు దారాల్లో యానిమల్‌ ఫైబర్, ఫ్లాంట్‌ ఫైబర్, మ్యాన్‌మేడ్‌ ఫైబర్, మినరల్‌(ఆస్‌బెస్టాస్‌) ఫైబర్‌ తదితర రకాలు ఉంటాయి.   
యానిమల్‌ ఫ్లాంట్‌ దారాలను నేచురల్‌ ఫైబర్‌గా, మిగిలిన వాటిని సింథటిక్‌ ఫైబర్‌గా పరిగణిస్తారు.  
యానిమల్‌ ఫైబర్‌ జుట్టు, ఊలు మాదిరిగా ఉంటుంది. దీన్ని కాలిస్తే జట్టు కాలిన వాసన వస్తుంది. గుండ్రంగా పూసలా మారి పౌడర్‌లా తయారవుతుంది. చీర చివర్లోని పోగులను కాల్చి, ఈ పట్టును నిర్ధరించుకోవచ్చు.  
పాలిస్టర్, నైలాన్, రేయాన్‌ల దారమైతే త్వరగా కాలిపోతుంది. ఈ దారం కాలిపోయిన తర్వాత పూసలా గట్టిగా తయారవుతుంది.  
మల్బరిలో రీల్‌ మల్బరి, డూపియన్, స్పిన్, నాయిల్, మట్కా, త్రోస్టర్, ఫెసుదా తదితర రకాలు ఉంటాయి. టస్సార్‌లో రీల్డ్‌ బస్సార్, కరియా, చిచా, జరీ తదితర ఉన్నాయి.  
పట్టు వస్త్రాల తయారీలో వినియోగించే దారాలు, రంగులు, డిజైన్స్‌ను బట్టి ధర నిర్ణయిస్తారు.  
పట్టు వస్త్రాలు మరీ ఎక్కువగా, మరీ తక్కువగా మెరిస్తే నిశితంగా పరిశీలించాలి. అసలైన పట్టు బంగారంలా మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఆ దుస్తులపై ఎలాంటి గీతలు ఉండవు.  

శుభ్రత.. భద్రత   
పట్టు వస్త్రాలు ఎక్కువగా నీటిని పీల్చుకొని, వదిలే గుణాలను కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువ సమయం నీటిలో ఉంచితే రంగు పోతుంది.  
శుభ్రతకు గోరు వెచ్చని మంచినీరు మాత్రమే వినియోగించాలి.  
సబ్బు, బేబీ షాంపూను వీలైనంత తక్కువగా వాడాలి.  
రంగు చీరలు అయితే అంచును నీళ్లలో తడిపి, చేతితో రుద్ది రంగు పోతుందో లేదో పరిశీలించాలి. 10 చుక్కల నిమ్మకాయ రసం వేసి, దానిలో చీరను ఉంచి వెంటనే ఉతకాలి.  
పట్టు వస్త్రాలను శుభ్రత తర్వాత గట్టిగా పిండకుండా, మలవకుండా నీడలో ఆరేయాలి.   
తేమగా ఉన్నప్పుడు ఇస్త్రీ చేస్తే వేడి ప్రభావం దుస్తులపై పడదు.  
మడతలను ప్రతి మూడు నెలలకు ఒకసారైనా మార్చాలి.  
బీరువాలో భద్రపరిచే సమయంలో కలరా గోళీలు కాకుండా గంధపు చెక్క ముక్కలు గుడ్డలో చుట్టి ఉంచాలి. మిరియాలను ఒక వస్త్రంలో చుట్టి చీరల మధ్యలో ఉంచినా మంచిదే. దీనివల్ల తేమ చెరకుండా ఉంటుంది.

తొలుత ఇబ్బంది...   
పట్టు చీరలంటే నాకు చాలా ఇష్టం. అయితే తొలుత సాధారణ చీరలలాగే దానినీ వాష్‌ చేశాను. దాంతో కలర్‌ పోవడం, దారాలు రాలిపోవడం జరిగింది. ఆ తర్వాత పట్టు చీరల శుభ్రత, భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాను.   – పావనీరెడ్డి, అత్తాపూర్‌

జాగ్రత్తలు అవసరం...  
పట్టు చీరల విషయంలో చాలా కేర్‌ తీసుకోవాలి. నేను కూడా మొదట్లో సమస్యను ఎదుర్కొన్నాను. ఆ తర్వాత చేనేత రంగానికి చెందిన వాళ్లని అడిగి తెలుసుకున్నాను. వాళ్ల సలహాలు, సూచనలు పాటించాను. ఇప్పుడు నా దగ్గరున్న పట్టు చీరలు తళతళ మెరుస్తున్నాయి.    – గ్రేస్, మియాపూర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement