ఆ గ్రామానికి ఆయనే భగీరథుడు! | tukaram kolekar: the water provider to Marthwada | Sakshi
Sakshi News home page

ఆ గ్రామానికి ఆయనే భగీరథుడు!

Published Thu, Feb 6 2014 11:59 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

ఆ గ్రామానికి ఆయనే భగీరథుడు! - Sakshi

ఆ గ్రామానికి ఆయనే భగీరథుడు!

 ‘‘తుకారామ్ కావాలండీ’’
 ‘‘ఈ ఊళ్లో  చాలామంది తుకారామ్‌లు ఉన్నారు. ఏ తుకారామ్ కావాలి?’’ అనే ప్రశ్న సహజంగానే వినబడుతుంది.
 ‘‘అదేనండీ... నీళ్ల తుకారామ్’’ అంటామో లేదో... వివరాలతో పాటు ఆయన గొప్పదనం గురించి కూడా చెబుతారు.  
 డెబ్బై యేళ్ల తుకారామ్ కోలెకర్ పేరు శ్రుంగర్ వాడి గ్రామ ప్రజలకు మాత్రమే కాదు... మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతీయులకూ  తెలుసు. తుకారామ్ నోటి నుంచి ‘సమాజసేవ’ అనే మాట పెద్దగా ఎప్పుడూ వినబడి ఉండకపోవచ్చు. కానీ ఆయన అక్షరాలా సమాజసేవ చేస్తున్నాడు.  ఊళ్లోని తొమ్మిది వందల గడపలకు నీటివసతి కలిపిస్తూ ‘శ్రుంగర్ వాడి భగీరథ’ గా
 కీర్తించబడుతున్నాడు.
 

 ఒకసారి గతంలోకి వెళదాం...
 రెండు సంవత్సరాల క్రితం శ్రుంగర్ వాడి కరువు బారిన పడింది. ఊళ్లో బావులన్నీ నీళ్లు లేక బిక్క ముఖం వేశాయి. నీటి కోసం ఊరి మహిళలు నాలుగైదు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్లాల్సి వచ్చేది. ఈ బాధలు చూసి తుకారామ్ మనసు చివుక్కుమంది.  ఊళ్లో నీటి కొరత తీర్చడానికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలనుకున్నాడు. వెంటనే తన బావి గుర్తుకు వచ్చింది. అన్ని బావుల్లాగే అదీ ఎండిపోయి ఉంది. దానికి దగ్గర్లోనే ఒక బోర్ వేయించాడు.
 
నీళ్ల కరువుతో అల్లాడుతున్న శ్రుంగర్‌వాడికి ఆ బోరుబావి కాస్త ఊరటనిచ్చింది. అయితే మహిళలు ఆ బావి దగ్గరికి రావడానికి చాలా దూరమే నడవాల్సి వచ్చేది. ఒక చేత్తో బిడ్డను ఎత్తుకొని, మరో చేత్తో బిందెను మోస్తున్న ఆడపడుచుల కష్టాలు తుకారామ్‌ను కదిలించాయి.
 
  ఊళ్లో అక్కడక్కడా పెద్ద పెద్ద ట్యాంకులు ఏర్పాటు చేసి పైపుల ద్వారా అందులో నీటిని నిలవచేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు గ్రామస్థులకు దూరం నడిచే బాధ పోయింది. దగ్గరల్లోనే కావలసినంత నీటిని తీసుకునే వీలుకలిగింది.
 
 ఇదంతా చేశాడంటే తుకారామ్ సంపన్నుడు అంటారు ఎవరైనా. కానే కాదు. అతని ముగ్గురు కుమారులూ దినసరి కూలీలు. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వారివి. అయితే  ఇదేమీ తన సేవాదృక్పథానికి అడ్డుకట్ట వేయలేదు. ఊరి క్షేమం కోసం తన  పొదుపుమొత్తాలను ఉపయోగించాడు. సరిపోకపోతే అప్పు చేశాడు. కుటుంబసభ్యుల నుంచి ఆర్థిక సహాయం అడిగాడు. తుకారామ్ పని కొందరికి వింతగా అనిపించింది. కొందరికైతే పిచ్చిగానూ అనిపించింది. మరో విశేషం ఏమిటంటే ‘‘నాయనా... ఎందుకిలా ఖర్చు చేస్తున్నావు!’’ అని తుకారామ్ కుమారులు ఏరోజూ తండ్రిని ప్రశ్నించలేదు. కోడళ్లు మాత్రం తీవ్ర అభ్యంతరం చెప్పేవాళ్లు.
 
 ‘‘మతార (ముసలాయన) ఎవరు చెప్పినా వినడం లేదు. ఇక ఆయనకు చెప్పడం కష్టమైన పని అని అర్థమైంది’’ అంటుంది తుకారామ్ కోడలు సింధూబాయి.
 
 ఆ ఊళ్లో కరెంటు వస్తూ పోతూ ఉంటుంది. అందుకని రోజూ రాత్రి బోర్‌వెల్ దగ్గర పడుకుంటాడు తుకారామ్. కరెంటు రాగానే బోర్‌వెల్ స్విచ్ ఆన్ చేస్తాడు.  ఇక్కడితో తృప్తి పడలేదు తుకారామ్.  ఊళ్లో మరిన్ని బోరు బావులు తవ్వించడానికి ప్రణాళికలు వేస్తున్నాడు. మొదట అయిష్టత ప్రదర్శించినా... ఇప్పుడు మాత్రం  కొడుకులతో పాటు కోడళ్లు కూడా తుకారామ్ పనిలో పాలుపంచుకుంటున్నారు.
 
 ‘‘మా చర్మం ఒలిచి చెప్పులుగా కుట్టించి ఇచ్చినా తుకారామ్, ఆయన కుటుంబసభ్యుల రుణం తీర్చుకోలేం’’ అంటాడు జోతిబాయి అనే గ్రామస్థుడు. ‘‘నువ్వేమైనా  కర్ణుడివి అనుకుంటున్నావా? నువ్వేమైనా కోటీశ్వరుడివా? ఎందుకలా డబ్బు ఖర్చు చేస్తున్నావు?’’ అని సన్నిహితులు మెత్త మెత్తగా తిట్టేవారు. ఆ తిట్లకు సమాధానంగా ఒక నవ్వు మాత్రం నవ్వేవాడు.
 
 ‘‘ఎందుకు చేస్తున్నావు ఈ పని?’’ అని ఎవరైనా రెట్టించి అడిగితే మాత్రం ‘‘దేవుడు చేయమన్నాడు’’ అనేవాడు.
 శ్రుంగర్‌వాడి ప్రజలు  ఆ దేవుడిని తనలోనే చూసుకుంటున్నారనే విషయం  ఆయనకు తెలుసోలేదో!
 
  ‘‘ఎందుకలా డబ్బు ఖర్చు చేస్తున్నావు?’’ అని సన్నిహితులు మెత్త మెత్తగా తిట్టేవారు. ఆ తిట్లకు సమాధానంగా ఒక నవ్వు మాత్రం నవ్వేవాడు. ‘‘ఎందుకు చేస్తున్నావు ఈ పని?’’ అని ఎవరైనా రెట్టించి అడిగితే మాత్రం-  ‘‘దేవుడు చేయమన్నాడు’’ అనేవాడు. శ్రుంగర్‌వాడి ప్రజలు  ఆ దేవుడిని తనలోనే చూసుకుంటున్నారనే విషయం  ఆయనకు తెలుసో లేదో!
 
 నీటి - నేటి నిజాలు!
 నీళ్లు లేకపోతే పిల్ల నివ్వరు!
 సౌరాష్ట్ర (గుజరాత్)లోని దెడ్హాన్ అనే మారుమూల గ్రామం కరువుకు పెట్టింది పేరు. ఈ ఊళ్లో అబ్బాయిలకు పిల్ల నివ్వడానికి భయపడతారు. ‘‘మా ఊళ్లో పెళ్లి కావాల్సిన అబ్బాయిలు అయిదువందలమంది వరకు ఉన్నారు.   మీ ఊళ్లో నీళ్లు లేకపోతే మా అమ్మాయిని మీ ఊరి అబ్బాయికిచ్చి ఏం ప్రయోజనం? అనే ప్రశ్న తరచుగా ఎదురవుతుంది’’ అంటున్నాడు దెడ్హాన్ సర్పంచ్ బాద్‌షా ఖాన్.
 
 మోస్ట్ కమర్షియల్!
 నీళ్లు అనేవి ఈ శతాబ్దపు ‘మోస్ట్ కమర్షియల్ ప్రాడక్ట్’గా మారాయి. ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షరాల సత్యం. ఒక బాకెట్ తాగు నీటిని సాధించడమనేది మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఒక సవాలుగా మారింది.  ఇది ‘నీటి’కి మాత్రమే పరిమితమై సమస్య కాదు.  సాంఘిక-ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం చూపుతుంది. ‘జల్ నహితో కల్ నహీ’ అనే పరిస్థితి వచ్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement