
ఏదైనా కారణాలతో కాస్త నొప్పి అనిపించగా మెడికల్ షాపుకు వెళ్లిపోయి నొప్పి నివారణ మందులు (పెయిన్‌కిల్లర్స్) కొని వేసుకోవడం చాలా ఎక్కువగా జరుగుతోంది. కొందరు తమకు తెలిసిన మందుల పేర్లు చెప్పి అదేపనిగా తీసుకుంటూ ఉంటే... మరికొందరు పెయిన్‌కిల్లర్ ఏదైనా ఇవ్వమని అడుగుతుంటారు. ఇలా డాక్టర్ చీటీ లేకుండానే ఆన్‌కౌంటర్ పెయిన్‌కిల్లర్స్ వాడటం మన సమాజంలో చాలా ఎక్కువే. అయితే ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన పురోగతి కారణంగా... ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, స్పాండిలోసిస్, ఇన్ఫెక్షియస్ జబ్బులకు చాలా కొత్తమందులు, గతంలో ఉన్న సైడ్‌ఎఫెక్ట్ లేని మందులు వస్తున్నాయి. కాబట్టి మునుపెప్పుడో డాక్టర్ రాసి ఇచ్చిన చీటీలోని మందులనే ఇంకా ఇప్పటికీ అదేపనిగా వాడటం సరైనది కాదు.
ఎందుకంటే దానికంటే మెరుగైనవీ, సైడ్‌ఎఫెక్ట్స్ గణనీయంగా తగ్గినవీ అయిన మందులు రోజురోజుకీ అందుబాటులోకి వస్తున్నాయి. పైగా ముందుతో పోలిస్తే ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న మందులు మరింత త్వరితంగా ఉపశమనం ఇవ్వడంతో పాటు చాలా చవకగా కూడా లభ్యమవుతున్నాయి. అందుకే డాక్టర్‌ను సంప్రదించాకే మందులు వాడాలి. ఇక నొప్పి నివారణ మందుల విషయానికి వస్తే ఇలా డాక్టర్‌ను సంప్రదించాకే వాడటం అన్నది మరింతగా అవసరం. దీనికి ఎన్నో కారణాలున్నాయి. ఉదాహరణకు... నొప్పి నివారణకు మందులు వాడే వారిలో చాలా మందికి వాటి కారణంగా వచ్చే దుష్ప్రభావాలపై అవగాహనే ఉండదు. కొన్ని దుష్ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అవి నొప్పి నివారణ మందుల వల్ల అన్న విషయం కూడా వారికి తెలియనే తెలియదు.
పెయిన్‌కిల్లర్స్ వాడుతున్నారా... జాగ్రత్త: నొప్పి నివారణ మందులను చాలా కొద్ది మోతాదుల్లోనూ, చాలా కొద్ది వ్యవధికోసం మాత్రమే వాడాల్సి ఉంటుంది. మోతాదు మించితే అవి శరీరంపై ఎన్నో దుష్పరిణామాలను కలగజేస్తాయి. నొప్పులను తగ్గించే విషయంలో అవి ఒక వరప్రదాయినులే. అయినప్పటికీ వాటిని ఉపయోగించే విషయంలో చాలా జాగరూకతతో వ్యవహరించాలి.
దుష్పరిణామాలివే...
►నొప్పి నివారణ మందులు కడుపులోకి వెళ్లగానే అవి పొట్టలోని లోపలి పొరలు మొదలుకొని రక్తనాళాల్లోని లోని పొరల వరకు... లోపలివైపు పొరలను (ఇన్నర్ లేయర్స్‌ను) దెబ్బతీస్తాయి. ప్రధాన రక్తనాళాల చివరన ఉండే సన్నటి నాళాలు, మూత్రపిండాల్లోని అతి సన్నటి నాళాలు దెబ్బతింటాయి. దానికి తోడు కొంతమందిలో వాంతులు, వికారం వంటివి కూడా కనిపిస్తాయి. మామూలుగానైతే కొన్ని యాంటాసిడ్‌ను తీసుకుంటూ నాలుగైదు రోజులు మాత్రమే నొప్పి నివారణ మందులు వాడాలి. అదేపనిగా అంతకుమించి వాడకూడదు.
►రెండు లేదా మూడు వారాలకు మించి నొప్పి నివారణ మందులు తీసుకునేవారిలో కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అందులో మూత్రపిండాలకు వచ్చే నెఫ్రోపతి అత్యంత ప్రమాదకరం. ముందుగా చెప్పుకున్నట్లుగా రక్తనాళాల చివరన ఉండే సన్నటి రక్తకేశనాళికలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి నివారణ మందుల వల్ల అన్ని అవయవాలకంటే కిడ్నీ దెబ్బతినే అవకాశాలు చాలా చాలా ఎక్కువ.
►కొందరిలో ఈ మందులతో పాటు అధిక రక్తపోటు కూడా అదనపు కారణమై ప్రధాన రక్తనాళాల చివరన ఉండే అతి సన్నటి రక్తనాళాలు దెబ్బతింటాయి. ఇలాంటివారిలో గుండె పనితీరుపై మరింత ఒత్తిడి పడి గుండెజబ్బులు కూడా రావచ్చు.
►ఈ మందులు పరిమితికి మించి వాడటం వల్ల కడుపులోని లోపల ఉండే పొరలు దెబ్బతినవచ్చు. ఇలాంటివారిలో కొందరికి మేజర్ సర్జరీ కూడా అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి.
►కొందరిలో రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేట్‌లెట్స్‌పై దుష్ప్రభావం పడి కోయాగ్యులోపతి వంటి సీరియస్ పరిస్థితికి దారితీయవచ్చు.
ఈ మందులు వాడే వారికి కొన్ని సూచనలు
నొప్పి నివారణ మందులు తప్పనిసరిగా వాడాల్సిన వారు వాటి దుష్పరిణామాలను తగ్గించుకోవడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి...
►ఇప్పటికే కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నవారు నొప్పి నివారణ మందులను వాడకూడదు.
►అల్సర్ ఉన్నవారు వాడకూడదు. ∙పరగడుపున ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు.
►గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ) ఉన్నవారు, గుండెజబ్బులతో బాధపడుతున్నవారు, హైబీపీ రోగులు వీటిని వేసుకోకూడదు.
►వీటిని వేసుకున్న తర్వాత నీరు ఎక్కువగా తాగాలి. ఎక్కువగా వాడాల్సి వస్తే కొన్ని రోజులు వ్యవధి అనంతరం మళ్లీ డాక్టర్ సలహా తీసుకుని ఆ మేరకే వాటిని వాడాలి.
►ఇవి వాడే సమయంలో తరచూ మూత్రపిండాలు, బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. చివరగా... పెయిన్‌కిల్లర్ వాడాల్సి వచ్చినప్పుడు మీరీ నొప్పి భరించగలరేమో చూసుకోండి. ఎందుకంటే వీటి వల్ల భవిష్యత్తులో వచ్చే నొప్పులు మరింత తీవ్రంగా ఉంటాయని గుర్తుంచుకోండి.
– డాక్టర్ కె. శివ రాజు సీనియర్ ఫిజీషియన్,
కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment