మనకు ఉన్న అనేక ఆరోగ్య సమస్యల పరిష్కారాల కోసం రకరకాల మందులు వాడుతుంటాం. వాటిల్లో కొన్నింటి దుష్ప్రభావాల వల్ల కొందరిలో జుట్టు రాలడం మామూలే.
జుట్టు రాల్చే మందులు
∙మొటిమలకు వాడేవి, ∙కొన్ని యాంటీబయాటిక్స్ కొన్ని యాంటీ ఫంగల్ మందులు, ∙కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ ∙నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు, ∙రక్తాన్ని పలచబార్చేవి ∙యాంటీకొలెస్ట్రాల్ మందులు ∙ఇమ్యునోసప్రెసెంట్స్ ∙కీమోథెరపీ మందులు. ∙మూర్చ చికిత్సలో వాడే మందులు, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్, ∙వేగంగా మూడ్స్ మారిపోతున్నప్పుడు నియంత్రణకు వాడే మూడ్ స్టెబిలైజేషన్ మందులు, ∙నొప్పినివారణకు వాడే ఎన్‌ఎస్‌ఏఐడీ మందులు, ∙స్టెరాయిడ్స్, ∙థైరాయిడ్ మందులు. ఇవి వెంట్రుక జీవితచక్రంలోని వివిధ దశల్లోకి జొరబడి జుట్టును రాలేలా చేస్తాయి.
వెంట్రుక దశలు
వెంట్రుక పెరుగుదలలో కెటాజెన్, టిలోజెన్, అనాజెన్ అనే దశలు ఉంటాయి.
టిలోజెన్ : మన మొత్తం జుట్టులో 10–15 శాతం ఎప్పుడూ ఈ దశలో ఉంటుంది. ఈ దశ మాడుపై ఉన్న వెంట్రుకలలో దాదాపు 100 రోజుల పాటు కొనసాగుతుంది. కనుబొమలు, కనురెప్పల్లో ఉండే వెంట్రుకల్లో ఈ దశ చాలాకాలం ఉంటుంది. ఈ దశలో వెంట్రుక తన పూర్తిస్థాయి పొడవులో ఉంటుంది. ఈ సమయంలో పీకితే వెంట్రుక కింద గసగసాల్లాంటి గుండ్రటి, తెల్లటి భాగం కనిపిస్తుంది.
కెటాజన్ : మొత్తం జుట్టులో కనీసం మూడు శాతం ఎప్పుడూ ఈ దశలో ఉంటుంది. నిజానికి వెంట్రుక పెరుగుదలలో ఇదో సంధి దశ. ఈ దశలో వెంట్రుక
2 – 3 వారాలు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక నిద్రాణంగా ఉండి, పెరుగుదల ఏమాత్రం ఉండదు.
అనాజెన్ : వెంట్రుక పెరుగుదల దశలన్నింటిలోనూ అనాజెన్ అనేది చురుకైనది. ఈ దశలో వెంట్రుక మూలంలో కణవిభజన వేగంగా జరుగుతుంటుంది. కింద కొత్త కణాలు వస్తున్న కొద్దీ పాత కణాలు ముందుకు వెళ్తుంటాయి. దాంతో కింది నుంచి వేగంగా వెంట్రుక పెరుగుతూ పోతుంది. ఈ దశలో ప్రతి 28 రోజులకు వెంట్రుక ఒక సెం.మీ. పెరుగుతుంది.
మనం వాడే మందులు జుట్టు పెరుగుదలలో ఉండే అనాజెన్, కెటాజెన్, టిలోజెన్ దశలను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా టిలోజెన్ ఎఫ్లువియమ్, అనాజెన్ ఎఫ్లూవియమ్ అనే రెండు రకాల మార్పులు వచ్చి జుట్టు రాలేలా చేస్తాయి.
టిలోజెన్ ఎఫ్లూవియమ్ : ఏదైనా ఆరోగ్య సమస్య కోసం మందులు వాడటం మొదలుపెట్టగానే వాటి ప్రభావంతో 2 నుంచి 4 నెలల్లో హెయిర్ ఫాలికిల్ విశ్రాంతిలోకి వెళ్తుంది. దాంతో జుట్టు మొలవడం ఆలస్యం అవుతుంది.
అనాజెన్ ఎఫ్లూవియమ్ : ఈ దశలో వెంట్రుకలు తమ పెరుగుదల దశలోనే రాలిపోతుంటాయి. మందు వాడటం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే ఇది కనిపిస్తుంది. ఉదాహరణకు కీమోథెరపీ తీసుకునేవారిలో అనాజెన్ ఎఫ్లూవియమ్ వల్లనే జుట్టురాలుతుంది. ఈ మందులు కేవలం తల మీది జుట్టే కాకుండా కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోయేలా చేస్తాయి.
మందుల వల్ల జుట్టు రాలుతుంటే...
∙సాధారణంగా మందులు మానేయగానే జుట్టు మళ్లీ వచ్చేందుకు అవకాశం ఉంది. ∙ ప్రత్యామ్నాయ మందులు వాడటం. ∙జుట్టు రాలడాన్ని అరికట్టే మందులు వాడటం ∙కీమోథెరపీ ఇచ్చే సమయంలో హైపోథెర్మియా అనే ప్రక్రియను ఉపయోగించడం. ఇందులో కీమోథెరపీ ఇచ్చే ముందరా... అలాగే ఇచ్చిన అరగంట తర్వాత మాడుపై ఐస్‌తో రుద్దుతారు. ఫలితంగా కీమోథెరపీలో ఇచ్చిన మందు ఫాలికిల్‌లోకి అంతగా ప్రవేశించదు. ఇది జుట్టు రాలడాన్ని చాలావరకు నివారిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment