ఇంట్లో పంచండి
ఈ ఫొటోలో కనపడుతున్న ఇల్లు భలే ఉంది కదా. రెండు నిమిషాల్లో సొంతం చేసుకోవచ్చు. సింపుల్.. www.coveed.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. అందులో కనిపించే మోడల్స్‌లో ఏ ఇల్లు నచ్చితే ఆ ఇంటి ప్రింట్‌ను తీసుకొని, ఆ ప్రింట్‌ను అందులో ఉన్న డిజైన్‌లోకి అసెంబుల్ చేసుకొని. అంటే పిజా బాక్స్‌లాగా అన్నమాట. ఆ ఇంట్లోని గదుల్లాంటి డబ్బాల్లో సరుకులను నింపి.. కరోనా లాక్‌డౌన్‌లో సొంతూళ్లకు వెళ్లలేకపోయిన వలస కూలీలకు, అన్నార్తులకు ఇవ్వచ్చు. దీనికి ఈ తతంగమంతా ఎందుకు? డైరెక్ట్‌గా డబ్బాల్లోనే సరకులను పోసి ఇస్తే పోలా? అని నిట్టూర్చకండి. ‘ఇల్లులాంటి డబ్బాల్లో వాళ్లకు కావల్సిన పదార్థాలను పెట్టి ఇవ్వడం వల్ల కుటుంబంలో ఆత్మీయతను పంచే సొంత మనుషుల మధ్యలో ఉన్న భావన వాళ్లకు కలుగుతుంది.. భయం తగ్గి.. ఆత్యస్థయిర్యం పెరుగుతుంది. ఎందుకంటే కూటికోసం పొట్ట చేత పట్టుకొని వచ్చిన ఆ కూలీలకు ఈ కష్టకాలంలో అన్నంతోపాటు ఆప్యాయతనూ పంచి.. ఇంటి మీద బెంగను మరిపించాలి’ అంటారు లక్ష్మీమీనన్.
ఆమె ఎవరు?
కేరళకు చెందిన లక్ష్మీ మీనన్ సోషల్ ఎంట్రప్రెన్యూర్. ‘పూర్ లివింగ్’ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. కరోనా కష్టకాలంలో వలస కూలీలు, నిరాశ్రయులతోపాటు ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌గా ఉన్న నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులు, ఆహారపదార్ధాలను పంచేందుకు ’coveed for covid’ అనే పేరు మీద ఇలా ఇళ్లతో సేవలను అందిస్తున్నారు. coveed లోని వీడ్... వీడు .. అంటే మలయాళంలో ఇల్లు అని అర్థం. వెబ్‌సైట్‌లోని మోడల్స్‌లోని నచ్చిన ఇళ్లను ప్రింట్‌గా తీసుకొని దానికి కొంత మన సృజననూ జోడించి మరింత అందంగా తీర్చి.. వాటి మీద స్ఫూర్తిని చాటే మెసేజ్‌నూ రాసి మరీ సరకులను డొనేట్ చేయొచ్చు. ఇలాంటì క్రియేటివ్ సర్వీస్ లక్ష్మీ మీనన్‌కు కొత్త కాదు. కేరళకు వరదలు వచ్చినప్పుడూ ఇలాగే వినూత్న ఆలోచనలతో సేవలను అందించారు. ‘అవసరంలో ఉన్నప్పుడే సహాయం కోసం చూస్తారు. ఆ సహాయాన్ని కాస్త శ్రద్ధగా అందిస్తే.. అవతలి వాళ్లకు జీవితం మీద కొత్త ఆశ చిగురుస్తుం ది. అదే వాళ్లలో ధైర్యాన్ని నింపుతుంది. కరోనా కష్టంలో మనుషులకు కావాల్సింది ఆ ధైర్యమే. అది ఇల్లు మాత్రమే ఇవ్వగలదు. అందుకే ఈ ’coveed for covid’ అంటారు మీనన్.
చదవడం లేదట!
పిల్లలు బొత్తిగా పుస్తకం పట్టడం లేదని ఇక్కడ ఒక తండ్రి వాపోతున్నాడు. ఆ తండ్రిగారు క్రిస్ హెమ్స్‌వర్త్. ఆస్ట్రేలియన్ నటుడు. ‘అవెంజర్స్’ సీరీస్ లో ‘థోర్’ గా విఖ్యాతుడైన ఈ యోధుడు.. ఈ లాక్‌డౌన్‌లో పిల్లల్ని కుదురుగా ఒకచోట కూర్చోబెట్టి కనీసం ఒక గంటైనా చదివించలేక పోతున్నాడట! మూడు గంటలసేపు ‘బుజ్జీ.. కన్నా..’ అని బతిమిలాడితే ఇరవై అంటే ఇరవయ్యే నిముషాలు చదివి పుస్తకాలు పక్కన పెట్టేస్తున్నారని హెమ్స్‌వర్త్ కంప్లయింట్. ఈ హీరోగారికి ఏడేళ్ల కూతురు, ఆరేళ్ల కవల కుమారులు ఉన్నారు. కూతురు పేరు ఇండియా. అయినా ఏడేళ్లకు, ఆరేళ్లకు.. ఆ ఇరవై నిముషాలైనా.. చదవడం అటుంచి తిన్నగా కూర్చోవడం కూడా గొప్పేనని హెమ్స్‌వర్త్‌కి ఎందుకు అనిపించడం లేదో!!
అన్నదమ్ములు
స్థలం అమ్మితే వచ్చిన డబ్బుతో కాదు వీళ్లు సహాయం చేస్తున్నది. కేవలం సహాయం చేయడానికే స్థలం అమ్మి, ఆ వచ్చిన డబ్బుతో అన్నార్తులను ఆదుకుంటున్నారు. కర్ణాటకలోని కోలార్‌లో ఇద్దరు అన్నదమ్ములు ఈ లాక్‌డౌన్‌లో పేదలకు బియ్యం, ఇతర నిత్యావసరాలు సమకూర్చడానికి తమ ఇంటి స్థలాన్నే అమ్మేశారు! 25 లక్షల రూపాయలు చేతికి వచ్చాయి. ఆ డబ్బుతో వంట సామగ్రి కొని పంపిణీ చేస్తూ.. వంట చేసుకోలేని వాళ్ల కోసం ప్రత్యేకంగా వండిస్తూ రోజూ అన్నదానం చేస్తున్నారు. తజముల్ పాషా, ముజమిల్ పాషా అనే ఈ అన్నదమ్ములది చిక్‌బళ్లాపూర్ జిల్లా, చింతామణి తాలూకాలోని మొహ్మద్‌పూర్ గ్రామం. చిన్నవయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో కోలార్‌లో ఉంటున్న వీళ్ల అమ్మమ్మ చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించింది. ఆ విద్యాబుద్ధులు ఇప్పుడు సమాజానికి ఉపయోగపడుతున్నాయి.
పాటతో లాక్ చేశారు
లాక్‌డౌన్ మనుషులకే కానీ మెదళ్లకు కాదు. పిల్లలను ఒక చోట నిమిషం పాటు కదలకుండా కూర్చోబెట్టడం కన్నవాళ్లకే సాధ్యం కాదు. అలాంటిది ప్రధానమంత్రికి చేతనవుతుందా? ఏ మాత్రం కాదు. లాక్‌డౌన్ టైమ్‌లో స్కూళ్లు లేవు. కొన్ని స్కూళ్లలో ఏదో ఓ రెండు గంటల సేపు ఆన్‌లైన్ క్లాసులుంటాయి. ఆ తర్వాత రోజంతా ఖాళీ. ఊరికే కూర్చోవడం పెద్దవాళ్లకు ఇష్టమవుతుందేమో కానీ పిల్లలకు కాదు. కరోనా సంక్షోభంలో అస్సామీ లవ్‌సాంగ్‌ను బయటకు తీసింది రూపాలి ప్రాణమిత అనే గడుగ్గాయి. ఆమె పాటకు సంగీతాన్ని సమకూర్చాడు మరో గడుగ్గాయి. ఈ పిల్లల క్రియేటివిటీని చూడమని చెప్తున్నది ఆ సంగీత సాధనాలే. చెట్టు మొదళ్లు, కర్ర పుల్లలు, వస్తువులు ప్యాక్ చేయడానికి వాడే అట్టపెట్టెలు, డబ్బా రేకు, రెండు చిన్న కర్ర పుల్లలు... వీటితో ఈ పిల్లలిద్దరూ నాలుగు లక్షల అరవై వేల మంది వీక్షకులను సాధించారు. 13 వేల లైక్‌లు సంపాదించారు. అంతకంటే ఎక్కువగా ప్రశంసలను సొంతం చేసుకున్నారు.
వాలుజడను ముందుకు వేసుకుని పాటను ఆస్వాదిస్తూ, నీలిరంగు స్లిప్పర్స్‌లో దాగిన పాదాన్ని నేలకు సున్నితంగా తాటిస్తూ... సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా ఊగుతూ... అత్యంత ఆత్మవిశ్వాసంతో పాడింది ప్రాణమిత. చివరగా నమస్కారంతో ముగించింది. మూడున్నర నిమిషాల సేపు సాగిన ఈ పాటను ఫేస్‌బుక్‌లో చూసిన వాళ్లు ‘పాటలో సాహిత్యం అర్థం కాలేదు, కానీ పాటను ఆస్వాదించాను’ అని ఒకరు, ‘సంగీత సాధనాల ఏర్పాటులో పిల్లల సృజనాత్మకతకు ఫిదా అయిపోయాను’ అని ఒకరు ప్రశంసలు కురిపించారు. సంగీతానికి భాష లేదు, పిల్లలు చేసే ముచ్చటైన పనులకు ఆనందించడానికి మనసుకు ఎటువంటి పరిధులు ఉండవు. కొంతమంది సెలబ్రిటీలు లాక్‌డౌన్‌తో లైఫ్ బోరుకొడుతోందని విసుక్కుంటూ ఉంటే... ‘లైఫ్ అంటే ఇదీ’ అని చేసి చూపిస్తున్నారీ పిల్లలు. స్వచ్ఛమైన మనసుతో చూస్తే... ప్రతి సందర్భమూ ఒక గొప్ప ఆలోచనకు పునాది అవుతుంది.
మీకు మేమున్నాం...
‘మేము కూడా సైనికులమే’ అంటున్నారు ఢిల్లీ నగర వాసులు. నగరంలో కోవిడ్ – 19 కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. దానితో ఢిల్లీ అధికార యంత్రాంగం అహర్నిశలు పరుగులు పెడుతూ పనులు చేస్తోంది. ఈ మహమ్మారి మన వారియర్స్ అయిన పోలీసులను, నర్సులను కూడా విడిచిపెట్టటం లేదు. ఉద్యోగ విధుల్లో భాగంగా కరోనా బాధితులకు సేవలు చేస్తున్న వీరు కూడా ఆ వ్యాధికి గురవుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ‘యునైటెడ్ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ’ కొత్తగా ‘హమ్ భీ వారియర్స్’ అనే నినాదంతో ముందుకు వచ్చింది. ఈ గ్రూపులోని సభ్యులంతా తూర్పు ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు చెందిన పోలీసు బారికేడ్లను శానిటైజ్ చేస్తున్నారు. బారికేడ్ల దగ్గర పనిచేస్తున్న పోలీసులకు శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజ్ ఉచితంగా అందచేస్తున్నారు. ఈ సేవ వెనుక ఒక బలమైన కారణమే ఉంది. ఇక్కడ పనిచేసే పోలీసులంతా విధుల్లో భాగంగా ఎంతోమందితో మాట్లాడవలసి వస్తుంది.
ఆ కారణంగా వారు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. వారి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, వారి ద్వారా ఇతరులకు ఈ వ్యాధి సోకుండా కూడా చూసుకోవాలి. ఆ బాధ్యతను ఈ సంస్థ సభ్యులు చేపట్టారు. ఈ సభ్యులు.. అవసరంలో ఉన్నవారికి ఆహారం కూడా అందచేస్తున్నారు. వీరు రెండు టీమ్‌లుగా ఏర్పడి, పోలీసులకు సేవలు అందిస్తున్నారు. షాహ్‌దరా ప్రాంతంలోని బారికేడ్లన్నిటినీ ఇప్పటికే శానిటైజ్ చేసేశారు. రానున్న రోజుల్లో శాస్త్రి పార్క్, లోనీ, భజన్‌పూర్ ప్రాంతాల్లో కూడా ఈ సేవలు అందించే ఆలోచనలో ఉన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని, మరిన్ని ప్రాంతాల వారు ఇదే తరహా సేవలు చేయడానికి సన్నద్ధులవుతున్నారు. ‘‘ఇటువంటి విపత్కర సమయంలో పోలీసులు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. ఈ కారణంగానే వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే మేమందరం పోలీసుల దగ్గర ఉన్న బ్యారికేడ్లను శానిటైజేషన్ చేయటాన్ని ఒక ఉద్యమంలా ప్రారంభించాం’’ అంటున్నారు యునైటెడ్ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ’ జనరల్ సెక్రటరీ సౌరవ్ గాంధీ.
Comments
Please login to add a commentAdd a comment