భగవాన్ శ్రీ రమణ మహర్షితో ఆయన జీవించి ఉన్న కాలంలో మౌనంగా ముఖాముఖీ జరిపినవారిలో భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ కూడా ఒకరు! మొరార్జీ 1977 నుండి 1979 వరకు భారత ప్రధాని. ఆయనకు 1935 ఆగస్టులో రమణ మహర్షిని చూసే భాగ్యం కలిగింది. ఈ విషయాన్ని స్వయంగా తన ఆత్మకథ ‘ది స్టోరీ ఆఫ్ మై లైఫ్’ లో రాసుకున్నారు. ఆ రోజు శ్రీ రమణ మహర్షి సోఫా మీద ఆసీనులై ఉన్నారు. ఆయన ఒంటిపై ఉన్నది ఒక్క కౌపీనమే (గోచీ). ఆ ప్రసన్న వదనం వెలిగిపోతోంది. ఆ వదనం మీద మొరార్జీకి ఒక జ్యోతిశ్చక్రం కనిపించింది. ఆయన ఎదురుగానే కూర్చొని ఉన్నారు ఈయన. ఏమీ అడగలేదు. ఆయనా ‘ఏమిటీ’ అని అడగలేదు. దాదాపు గంటసేపు అలా భగవాన్ ముఖాన్నే చూస్తూ కూర్చున్నారు మొరార్జీ.
ఆ తర్వాత, వెళ్లేందుకు పైకి లేవగానే, భోజనం చేసి వెళ్లమని భగవాన్ సైగ చేశారు. ఆ దర్శనం మొరార్జీపై చెరగని ముద్రవేసింది. మహర్షి సన్నిధిలో కూర్చున్నప్పుడు దైవం ఆత్మజ్ఞానంగా మొరార్జీకి ప్రత్యక్షమయ్యారట. అంటే, ఆత్మజ్ఞానంలో ఆయనకు దేవుడు సాక్షాత్కరించాడు. ఢిల్లీలోని శ్రీ రమణ మహర్షి కేంద్రం 1979లో శ్రీ రమణ మహర్షి 99వ జయంత్యుత్సవాన్ని నిర్వహించింది. ఆ వేడుకలకు భారత ప్రధాని హోదాలో మొరార్జీ దేశాయ్ అధ్యక్షత వహించారు. ‘‘భగవాన్ శ్రీ రమణ మహర్షి ఎప్పుడూ ఉద్బోధలు చేయలేదు. ‘నేను జ్ఞానినే అయితే ప్రతి వారినీ జ్ఞానిగానే భావిస్తాను. ఇంక బోధించడానికి ఏముంది?’ అనేవారు. ఎవ్వర్నీ మార్చడానికి ప్రయత్నించలేదు. అసలు వారి సన్నిధి వల్లనే పరివర్తన కలిగేది’’.. అని రమణ మహర్షి సామీప్యంలో తనకు కలిగిన అనుభూతులను తన ప్రసంగంలో మొరార్జీ వెల్లడించారు. నేడు ఆ మహర్షి జన్మదినం.
బోధించడానికి ఏముంటుంది?!
Published Sat, Dec 30 2017 12:25 AM | Last Updated on Sat, Dec 30 2017 12:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment