కొత్త బంగారం
ఒకానొక రాత్రి– బయో కెమిస్ట్ అయిన డగ్లస్ పీటర్‌సన్‌కు భార్య అయిన కోనీ, ‘మనిద్దరి పెళ్ళీ ఇంక కొనసాగలేదు’ అని చెబుతుంది. భార్యని ఎంతగానో ప్రేమించే డగ్లస్, ఆమె లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేకపోతాడు. కోనీ ఆర్ట్ గ్యాలెరీలో పని చేస్తుంది. దంపతులు లండన్ నివాసులు. 18 ఏళ్ళ కొడుకైన ఎల్బీ కాలేజీలో చేరబోయేముందు కొంత మనో వినోదం కోసం తమ ముగ్గురికీ యూరప్ టూర్ ముందే బుక్ చేసుకునుంటాడు డగ్లస్. ఆ ప్రయాణం ముగ్గురికీ దిగులు పుట్టించి తమ తమ జీవితాలని పునరావలోకనం చేసుకునేలా చేస్తుంది.
ఈ పర్యటన గురించి డగ్లస్ పాఠకులకి చెప్తున్నప్పుడు, తనకి పెళ్ళయిన పాతికేళ్ళ చరిత్రనీ తవ్వుకుంటాడు. భార్యా, కొడుకూ తననుండి ఎలా దూరం అయ్యారో, తనెక్కడ తప్పు చేశానో అన్న డగ్లస్ ఆలోచనల సమాంతరమైన కథనం ఒకటి వినిపిస్తుంది. తల్లిదండ్రుల మధ్య పోట్లాటలు పెట్టి తన పని సాధించుకోవడం తెలిసిన టీనేజర్ ఎల్బీ. కొడుకు నుంచి డగ్లస్ ఎదురుకునేది నిర్లక్ష్యం, అగౌరవం, ఎగతాళీ. ఆమ్‌స్టర్‌డామ్ చేరినప్పుడు ఒక అకార్డియన్ వాయించే ఆస్ట్రే్టలియన్ అమ్మాయితో పారిపోతాడు ఎల్బీ. భార్య లండన్ తిరిగి వెళ్ళిపోతుంది. ఆఖరికి, డగ్లస్ ఒంటరిగానే ఇంటికి చేరుకుంటాడు.
డగ్లస్‌కు బయాలజీ గురించిన పరిజ్ఞానం బాగానే ఉంటుంది. జీవితం గురించే వీసమాత్రం కూడా తెలియదు. భార్య ప్రేమని తిరిగి పొందే అతని ప్రయత్నాలూ, కొడుకుతో తనకున్న సంబంధం పట్ల అతని దృష్టికోణమూ మనస్సుని తాకుతాయి. రెండు సమానాంతర కథనాలూ ఒకే ప్రశ్నని భిన్నమైన విధానంలో ప్రశ్నిస్తాయి: డగ్లస్‌ను కోనీ ఎందుకు వదిలి పెట్టింది! ఇద్దరివీ తూర్పూ పడమరా వంటి భిన్నమైన దృక్పథాలయినప్పుడు, అసలు డగ్లస్‌ను కోనీ పెళ్ళెందుకు చేసుకుంది?
తను ప్రేమించిన భార్యతో సంబంధం ఎలా నిలబెట్టుకోవాలో, పరాయివాడిగా ప్రవర్తించే కొడుక్కి ఎలా దగ్గిర అవ్వాలో అని ప్రయత్నించే వ్యక్తి కథ ఇది. కథనం హాస్యంగా, స్వీయనిందతో కూడుకున్నది. పుస్తకాన్ని చదివించేది డగ్లస్ పాత్రే. యూరప్‌ను కళ్ళకి కట్టేలా వర్ణిస్తారు రచయిత. పారిస్ వర్ణన అద్భుతంగా ఉంటుంది.
ఒకే ఒక్క వ్యక్తి దృక్కోణంతో కథనం సాగినప్పటికీ, డగ్లస్ పట్ల భార్యకీ, కొడుక్కీ ఉన్న అభిప్రాయాల గురించి కూడా పాఠకులకి తెలిసే రీతిలో పుస్తకం సాగుతుంది. ఎవరినీ జడ్జ్ చేయదు నవల. ఒక దగ్గిర కూర్చుని మాట్లాడుకునే అలవాటు లేకపోవడంవల్ల కుటుంబంలో తలెత్తే అపార్థాలు, సంబంధాలు చెడిపోవడం గురించి మాట్లాడుతారు రచయిత.
ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన డగ్లస్, పూర్తిగా మారిన మనిషి. తన వివాహం విచ్ఛిన్నం అవడం గురించి సంతోషం కలగనప్పటికీ ‘ఆ తరువాత తన జీవితం ఎలా సాగుతుందా!’ అన్న అతని భయం మట్టుకు వదులుతుంది. నిశితమైన విజ్ఞతతో రాయడం వల్ల కథకుని పాత్రలు వాస్తవంగా అనిపిస్తాయి. చదవడానికి చాలా సులభమైన నవలే కానీ కథనంలో ఉన్న హాస్యంలో తాత్విక లోతులు కనిపిస్తాయి.
ఈ నవల 2014లో వచ్చింది. స్పెక్సేవర్స్ సంస్థ రచయిత డేవిడ్ నికొల్స్‌ను ‘యు.కె. ఆథర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంచుకుంది. 2014లో మాన్ బుకర్ ప్రైజుకి ఈ నవల లాంగ్ లిస్ట్ అయింది. ఆడియో పుస్తకం కూడా ఉంది.
- కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment