కీర్తన , రక్ష ,క్రితిక
‘కనీసం 5.6 అడుగుల ఎత్తుండాలి. తీరైన శరీరాకృతి కావాలి. చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. ఇవన్నీ ఉన్నా ర్యాంప్‌వాక్, హావభావాలు పలికించడం వగైరాల్లో ముందస్తు శిక్షణ తప్పనిసరి...’మోడలింగ్ రంగంలో ప్రవేశించాలనుకునే అమ్మాయిలకు కావాల్సిన అర్హతలివి అని ఇన్‌స్టిట్యూట్స్ చెబుతాయి. అయితే ఇది గతం. ఇప్పుడు క్షణాల మీద మోడల్ అయిపోవచ్చు. టాప్ మోడల్స్‌కు సవాల్ విసరవచ్చు. అవును... సోషల్ మీడియా సృష్టిస్తోంది‘ఇన్‌స్టా’ంట్ మోడల్స్. సిటీకి చెందిన పలువురు యువతులు ఇన్‌స్టా మోడల్స్‌గా ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నారు.
సాక్షి, సిటీబ్యూరో :డిజిటల్ విప్లవం, సమాచార వ్యవస్థను దాదాపు పూర్తిగా చేతుల్లోకి తీసుకున్న నేపథ్యంలో..విభిన్న రంగాలకు సంబంధించి అప్పటిదాకా ఉన్న ప్రతి సూత్రాన్నీ తిరగరాయాల్సి వస్తోంది. దీనికి తాను కూడా అతీతం కాదని మోడలింగ్ రంగం స్పష్టం చేస్తోంది. సోషల్ మీడియా విజృంభణతో ఇంట్లో కూర్చుండగానే సిటీ అమ్మాయిల్ని ఓవర్‌నైట్ మోడల్స్‌గా మార్చేస్తున్న వాటిలో ప్రధాన పాత్ర ఇన్‌స్టాగ్రామ్‌దే.
ఈ–మోడల్స్ ఏం చేస్తారంటే...
సోషల్ వేదికగా హల్ చల్ చేస్తున్న ఈ అందమైన అమ్మాయిలను పలు సంస్థలు సంప్రదిస్తుంటాయి. వీరికి తగినంత రెమ్యునరేషన్ ముట్టజెప్పి, తమ సంస్థల తరపున బ్రాండింగ్, ప్రమోషన్ వంటి ప్రచారాల్లో భాగం చేస్తాయి. అయితే చాలా వరకూ ఇదంతాడిజిటల్ అడ్వర్టయిజ్‌మెంట్‌కే పరిమితం అనేది గమనార్హం.ఈ మోడల్స్ ర్యాంప్‌వాక్‌లూ గట్రా చేయరు. తమ క్లయింట్స్ కోరిన విధంగా డ్రెస్ చేసుకోవడం లేదా ఫలానా బ్రాండ్‌కి చెందిన ఉత్పత్తి తాను వినియోగిస్తున్నానని చెప్పడం వంటివి చేస్తారు. అంతేకాకుండా అవసరమైతే ఆఫ్‌లైన్ ఈవెంట్ కోసం సంస్థ నిర్వహించే ప్రచారకార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అవన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తమ అకౌంట్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు కాబట్టి వారికి ఉన్న ఫాలోయర్స్ దృష్టిని అవి ఆకర్షిస్తాయి. తద్వారా తమ ఉత్పత్తి/సంస్థకు యువతరంలో తగిన ప్రచారం లభిస్తుందని వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి.
మోడరన్.. మోడలింగ్...
కాఫీషాప్స్, రెస్టారెంట్స్, పబ్స్, క్లబ్స్, జిమ్స్...వంటి ఆధునిక వ్యాపారాలు ఈ మోడల్స్ వెంట క్యూ కడుతున్నాయి. తక్కువ వ్యయంతో తమ టార్గెటెడ్ కస్టమర్స్‌ని చేరుకోవడానికి దీన్ని సరైన మాధ్యమమని భావిస్తున్నాయి. మరోవైపు కాలేజీల్లో చదువుకుంటూ సరదాగా సోషల్ మీడియాలో అడుగుపెట్టి సడెన్‌గా సెలబ్రిటీలు అయిపోతున్న అమ్మాయిలకు ఈ మోడలింగ్ అవకాశాలు చక్కటి పార్ట్ టైమ్ ఆదాయ మార్గాలుగా మారాయి.
ఫాలోయర్స్ ఉంటే...అవకాశాల పంటే...
నగరానికి చెందిన యువతి రక్ష (21) ప్రస్తుతం నిఫ్ట్‌లో డిజైనింగ్ కోర్సు చేస్తోంది. తరచుగా విభిన్న రకాల డిజైనర్ దుస్తులు ధరించిన ఫొటోలతో తన ఇన్‌స్టాను నింపేసే ఈ అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 5వేలకు పైగా ఫాలోయర్స్ ఏర్పడ్డారు. దీంతో సిటీకి చెందిన పలు సంస్థలు ఆమెకు మోడల్‌గా రెడ్ కార్పెట్ పరిచాయి. సిటీకే చెందిన మరో అమ్మాయి కృతికా సింగ్ రాథోర్ (24)కి ఏకంగా 50 వేల మంది ఫాలోయర్స్ ఉండడంతో ఆమె టాప్ ప్లేస్‌లో ఉంది. ఈమెకు పెద్ద పెద్ద సంస్థల నుంచి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. ‘మోడలింగ్‌లో ముందు నుంచీ ఉన్నాను. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేశాక నాకున్న ఫాలోయర్స్ పెరిగారు. ఇది మరిన్ని సంస్థలకు నన్ను పరిచయం చేసింది’ అంటూ ‘సాక్షి’కి చెప్పింది కృతిక. అలాగే 21 వేల మంది ఫాలోయర్స్ ఉన్న తనుషా బజాజ్ (24), 38 వేల మంది ఫాలోయర్స్ ఉన్న కీర్తనారెడ్డి (23), 13 వేల మంది ఫాలోయర్స్ ఉన్న రచనారెడ్డి (20)... తదితర సిటీ అమ్మాయిలంతా తమకున్న ఫాలోయర్స్ సంఖ్యతో టాప్ బ్రాండ్స్, కంపెనీల నుంచి మంచి మంచి మోడలింగ్ అవకాశాలు పొందుతున్నారు. సిటీ నుంచి డిజిటల్ యుగపు మోడల్స్‌గా రాణిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment