స్మార్ట్ఫోన్ బ్యాటరీ లైఫ్ను పెంచేందుకో యాప్!
మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ మాటిమాటికీ అయిపోతోందా? అది చూసి మీరు చిరాకు పడుతున్నారా? అయితే మీ కోసం ఇక్కడో యాప్ సిద్ధంగా ఉంది. కేవలం కొన్ని రకాల యాప్ల వల్ల మాత్రమే స్మార్ట్ఫోన్ బ్యాటరీ త్వరగా ఖర్చయిపోతుందని అమెరికాకు చెందిన ఓ ప్రొఫెసర్ చెప్పారు. ఆయన 'ఈస్టార్' అనే కొత్త యాప్ను రూపొందించారు. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ముందుగా బ్యాటరీని తక్కువగా వాడుకునే యాప్లు ఏంటో గూగుల్ప్లేలో చూపిస్తుంది.
ఇది ప్రతి యాప్కు కలర్ కోడ్తో ఫైవ్స్టార్ ఎనర్జీ రేటింగ్ ఇస్తుంది. దీని ప్రకారం అదే విభాగంలోని ఇతర యాప్లు ఎంత బ్యాటరీ వాడుకుంటాయో, ఇది ఎంత వాడుకుంటుందో తెలుస్తుంది. అందువల్ల ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలో యూజర్లు నిర్ణయించుకోగలరని ఈ యాప్ సృష్టికర్త, పర్డ్యూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్కు చెందిన వై చార్లీ హు చెప్పారు. ఇక ఇప్పటికే డౌన్లోడ్ చేసుకుని రన్ చేస్తున్న యాప్లు ఎంత వాడుకుంటున్నాయో కూడా చెబుతుంది. దాని ప్రకారం యూజర్లను హెచ్చరించి బ్యాటరీ లైఫ్ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. 'ఈస్టార్' యాప్ గూగుల్ ప్లేలో ఉచితంగా అందుతుంది.