బెదిరింపుల బాబు.. సభలో డాబు
పదే పదే కళ్లు పెద్దవి చేసి చూడటం, చూపుడు వేలు ప్రతిపక్షం వైపు చూపిస్తూ బెదిరించినట్లు మాట్లాడటం, అప్పుడే ఏమీ అయిపోలేదు.. ముందుంది ముసళ్ల పండగ అంటూ హెచ్చరించడం.. మొత్తమ్మీద ఇదీ మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు. 'ప్రపంచానికే పాఠాలు చెప్పాను, మీ నుంచి నేను పాఠాలు నేర్చుకోవాలా' అంటూ ప్రతిపక్షాన్ని తక్కువ చేసి మాట్లాడారు. 'సమాధానం చెబుతున్నా.. వినే ఓపిక ఉండాలి. ఓపిక లేకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే కుదరదు. పద్ధతి ప్రకారం సభ నడవాలి. నేను చెబుతా.. మీరు వినాల్సిందే' అంటూ తన నియంతృత్వ ధోరణిని చెప్పకనే చెప్పారు. 'ఊరికే అనవసరంగా మాట్లాడకండి, దీనికి.. దానికి లింకులు పెట్టొద్దు' అంటూ ఏం మాట్లాడుతున్నా పదే పదే అడ్డుపడ్డారు.
ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను చేసిన ప్రసంగంలో్ చంద్రబాబు పాలనా కాలం, అంతకుముందు, ఆ తర్వాత జీఎస్డీపీ లెక్కలు, వృద్ధిరేటు లెక్కలు అన్నింటినీ ససాక్ష్యంగా చూపించగా.. వాటిని కాదనడానికి లెక్కలేనన్ని తిప్పలు పడ్డారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, అడిగిన విషయాలు పక్కనబెట్టి అక్షరాస్యతలో అభివృద్ధి సాధించామని చెప్పుకొంటూ వచ్చారు. తాను ఏడుసార్లు ఎమ్మెల్యేను అయ్యానని, ఎవరి దగ్గర్నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని అంటూ.. కొత్త సభ్యులు సభకు వచ్చేముందు హోం వర్క్ చేసుకుని రావాలని, ఎవరో ఇచ్చిన కాగితాలు పట్టుకుని మాట్లాడటం సరికాదని అన్నారు.
వాస్తవానికి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ససాక్ష్యంగా కాగ్, సీఎస్ఓ లాంటి కేంద్ర సంస్థలు ఇచ్చిన లెక్కలనే చూపించినా, వాటిని పట్టుకుని వాళ్లూ వీళ్లూ ఇచ్చిన కాగితం ముక్కలంటూ అవంటే లెక్కలేనట్లు ప్రవర్తించారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రతిపక్షం నిలదీయగా.. 'మీరు కన్ఫ్యూజ్ అయ్యారు, ప్రజలను కన్విన్స్ చేయలేకపోయారు, మేం ప్రజలను ఒప్పించాం. ఇప్పుడే సంతకం పెడతావా అనడం కరెక్ట్ కాదు. ముందు మీరు కన్ఫ్యూజన్ నుంచి బయటకు రండి. మీరు మాత్రం రాజకీయం చేయాలనుకుంటున్నారు, రాజకీయాలు పనిచేయవు' అంటూ అర్థం పర్థం లేని సమాధానాలిచ్చారు తప్ప.. ఫలానా సమయానికి రుణాలు మాఫీ చేస్తామని మాత్రం చెప్పలేకపోయారు. కేవలం సంఖ్యాబలాన్ని, ఒకరిద్దరు గట్టిగా మాట్లాడే ఎమ్మెల్యేల అండదండలను చూసుకుని నోటికి వచ్చినట్లల్లా మాట్లాడారు. మొత్తమ్మీద గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు జరిగిన ఈ అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాన్ని దీటుగా ఎదుర్కోలేక.. బెదిరింపులు కొనసాగుతాయన్న సంకేతాలను మాత్రమే ముఖ్యమంత్రి ఇవ్వగలిగారు.