తెలుగు హీరోలు కూడా మారిపోతున్నారు!
మన హీరోలలో కూడా మార్పు వస్తోంది. వారు కూడా కాలానుగుణంగా మారడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఈ మార్పు బాలీవుడ్, కోలివుడ్లతో పోల్చుకుంటే చాలా నిదానంగా జరుగుతోంది. హిందీ, తమిళం, మళయాల హీరోలు మూస చిత్రాలకు చాలా వరకు స్వస్తి పలికారు. మల్టీస్టార్ చిత్రాలలో నటిస్తున్నారు. కథలలో కొత్తదనంతోపాటు, ఎటువంటి పాత్రనైనా చేస్తున్నారు. జనం మెప్పు పొందుతున్నారు. మన హీరోలు కూడా అదేబాటలోకి వెళుతున్నారు.
హీరోలలో మార్పు తప్పనిసరిగా రావలసిన అవసరం ఏర్పడింది. తెలుగు సినిమా రంగంలో కూడా హీరోలు కాస్త ఆలస్యంగానైనా అది గుర్తించారు. ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మూస కొట్టుడు తగ్గింది. ఎప్పుడూ ఒకే మూసలో పోతే ప్రేక్షకులు హర్షించరని మనవాళ్లకి అర్ధమైపోయింది. అందుకే స్టార్ హీరోలు కూడా రూటు మార్చుకుంటున్నారు. దీంతో తెలుగు సినిమా రూపురేఖలు మారే అవకాశం ఉంది. కొత్తకొత్త కథలతోపాటు, కొత్త పాత్రలు కూడా తెలుగుతెరపై కనిపించడానికి వీలవుతుంది.
మన తెలుగు హీరోలు కూడా బాలీవుడ్, కోలీవుడ్ తరహాలో ప్రయోగాలు చేయటానికి ఏమాత్రం వెనుకాడటంలేదు. టాప్ హీరోలగా వెలిగిపోతోన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జునలతోపాటు రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్, నాగ చైతన్య, రాణా వంటి యంగ్ హీరోలు కూడా మల్టీస్టారర్ చిత్రాలలో నటించడానికి సై అంటున్నారు. హీరోగా పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన సాయి కుమార్ విలన్గా నటించి మెప్పించారు. ఇప్పుడు మరో హీరో జగపతి బాబు కూడా విలన్గా నటిస్తున్నారు. హీరోలు కూడా నటనకు ప్రాధాన్యత ఇచ్చి విభిన్న తరహా పాత్రలలో నటించడం టాలీవుడ్లో ఓ శుభపరిణామంగా భావించవచ్చు.
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకటేష్-మహేష్ బాబు నటించారు. అది బంపర్ హిట్ అయింది. మసాలా సినిమాలో వెంకటేష్-రామ్ నటించారు. మంచు ఫ్యామిలీ ‘పాండవులు పాండవులు తుమ్మెదా’లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, విష్ణు, మనోజ్లతోపాటు తనీష్, వరుణ్ సందేశ్ నటించారు. అక్కినేని ఫ్యామిలీ మనం సినిమాలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ - వెంకటేష్, పవన్ కళ్యాణ్-మహేష్ బాబులు కూడా త్వరలో మల్టీస్టార్ చిత్రాలలో నటించబోతున్నట్లు సమాచారం. మహేష్ లాంటి స్టార్ హీరోలు కూడా వేరే హీరో సినిమాలకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించే లెజెండ్ చిత్రంలో జగపతిబాబు విలన్గా నటిస్తున్నారు. జగపతిబాబు మరో చిత్రంలో హీరోకు అన్నగా కూడా నటించబోతున్నారు. అలాగే హీరో రాజశేఖర్ కూడా ఒక చిత్రంలో హీరోకు అన్నగా నటించబోతున్నట్లు సమాచారం. కథలు బాగున్న పరభాషా సినిమాలను తెలుగులోకి తెస్తున్నారు. వెంకటేష్ దృశ్యం అనే మళయాల సినిమా రీమేక్లో నటించబోతున్నారు. ఇవి మన హీరోల్లో వచ్చిన మార్పుకి నిదర్శనంగా భావించవచ్చు.
s.nagarjuna@sakshi.com