చారిటీ..పార్టీ
స్వచ్ఛంద సంస్థ అడ్వకేట్స్ ఫర్ బేబీస్ ఇన్ క్రైసిస్ సొసైటీ (ఏబీసీ) ఆధ్వర్యంలో జరిగిన చారిటీ డిన్నర్... విందు వినోదాల మేలు కలయికగా అలరించింది. గచ్చిబౌలి హయత్ హైదరాబాద్ హోటల్‌లో శనివారం నిర్వహించిన ఈ ఆసక్తికర ఈవెంట్‌లో హీరో సుమంత్ సహా పలువురు నగర వ్యాపార, కార్పొరేట్ ప్రముఖులు పాల్గొన్నారు.
అమితాబ్‌బచ్చన్ సంతకం చేసిన ‘టూ బీ ఆర్ నాట్ టూ బీ’ కాఫీ టేబుల్ బుక్ నుంచి సల్మాన్‌ఖాన్ సైన్ చేసిన టీషర్ట్ దాకా... విభిన్న రకాల ఉత్పత్తులను సెలైంట్ ఆక్షన్ శైలిలో విక్రయించారు. పలువురు ప్రముఖ చిత్రకారుల చిత్రాలు, ఆభరణాలు సైతం ఈ ఆక్షన్‌లో ఆహూతుల కోసం కొలువుదీరాయి. ఎంట్రీ టిక్కెట్‌తో పాటు వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సిటీలో ఉన్న పలు అనాథ శరణాలయాలకు అందిస్తామని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు.