సెలబ్‌డబ్ శివసేవ
ఆయన వేదికపైకి రాగానే.. ముందుగా ఎన్టీఆర్ పలకరిస్తాడు.. ఆ వెంటనే ఏఎన్నార్ తొంగిచూస్తాడు.. వీరిద్దరి వంతు పూర్తయ్యిందో లేదో నేనున్నానంటూ కృష్ణ వచ్చేస్తాడు. ఆపై శోభన్‌బాబు.. చిరంజీవి.. రాజశేఖర్.. ఇలా వెండితెర వేలుపులందరూ ఒకరి వెంట ఒకరు వచ్చి పలకరించి పోతుంటారు. వీరందరి స్వరాలను.. తన గళంలో ఇముడ్చుకుని.. నవ్వుల్ని పండించడంలో మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి దిట్ట. సినీరంగానికి చెందిన ఈ వ్యక్తి సినిమాల కన్నా తనదైన ప్రతిభతో జనాలకు దగ్గరయ్యారు. తనకు వచ్చిన కళను నలుగురినీ నవ్వించడానికి.. దాని ద్వారా వచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని, సంపాదనను నలుగురి కన్నీళ్లు తుడవడానికి వెచ్చిస్తున్నారు. ఆయన మనసుకు నచ్చిన పనుల గురించి గుర్తు చేసుకోమన్నప్పుడు.. ఇలా స్పందించారు.
..:: ఎస్.సత్యబాబు
బహుశా నాలుగేళ్ల క్రితం అనుకుంటా.. నా తమ్ముడు సంపత్‌రెడ్డి వచ్చి ఓ విషయం చెప్పాడు. కూకట్‌పల్లిలో కూరగాయలు అమ్ముకునే వ్యక్తి మానసికంగా ఎదగని కూతుర్ని చూసి కుంగిపోకుండా మరికొందరు బుద్ధిమాంద్యం ఉన్న పెద్ద‘పిల్లల’కు ఆశ్రయం ఇస్తున్నాడని. ఎదుటివారి కష్టాలకు వెంటనే స్పందించే గుణం నాకు ఉందని తెలుసు కాబట్టే సంపత్ నాతో ఆ విషయం చెప్పాడేమో..!
కళ్లలో నీళ్లు తిరిగాయి..
కొన్నిరోజుల తర్వాత వీలు చూసుకుని ఆ కూరగాయలు అమ్ముకునే శ్రీనివాస్‌ని కలిశాను. ఆయన తన కూతురి పేరు మీద నిర్వహిస్తున్న యామిని ఫౌండేషన్ అప్పట్లో ఇంకా బాలారిష్టాలు దాటలేదు. అక్కడికి వెళ్లి చూస్తే దాదాపు యాభై మంది వయసు ఎదిగినా మనసు ఎదగని పిల్లలు కనిపించారు. వారిని చూడగానే కళ్లలో నీళ్లు తిరిగాయి. కావాల్సిన తెలివితేటలు, ఆలోచించే శక్తి ఉన్న వాళ్లకే ఈ ప్రపంచంలో ఏదో రూపంలో కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి.. ఇలాంటి పిల్లల జీవనం ఎలా అని అనుకుంటేనే.. హృదయం ద్రవించింది. వెంటనే వాళ్లకు నాకు చేతనైనంత సాయం చేస్తానని మాటిచ్చాను. ఓ చారిటీ షో నిర్వహించి రూ.8 లక్షలు కలెక్ట్ చేశాను. మరో చారిటీ షో ద్వారా రూ.12 లక్షలు సమకూర్చగలిగాను. అది మొదలు ఆ సంస్థకు వీలైనన్ని మార్గాల్లో చేయగలిగినంత సాయం చేశాను. సినీ ప్రముఖుల సహకారంతో అక్కడ ఈవెంట్స్ నిర్వహించి, వచ్చిన ఆదాయాన్ని సంస్థకు అందించాం. సంస్థ నిర్వహణ మరింత మెరుగైంది. కొంతకాలానికి అక్కడ ఆశ్రయం పొందే పిల్లల సంఖ్య కూడా వందల్లో పెరిగింది. దాతలు కూడా స్పందిస్తున్నారు. నేను వెళ్లగానే నన్ను గుర్తుపట్టి.. చుట్టుముట్టేసి.. నేను చిన్న జోక్ వేసినా నవ్వేసే అమాయకపు ‘పిల్లల’ ఆనందం, పోటీలుపడుతూ కౌగిలించుకుని వదలనంత ఆప్యాయత వెలకట్టలేనివి.
చేతనైనంత..
వైజాగ్‌లో నేను ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. నాకెందరో స్నేహితులున్నారక్కడ. మొన్నటి హుద్‌హుద్ తుఫాన్ తాకిడికి విశాఖ కకావికలమైంది. సినీ పరిశ్రమలో అందరితో పాటు నా వంతుగా కొంత సాయం చేశాను. ఇలాంటి సమయాల్లోనే కాదు.. అక్కడిక క్కడ స్పందించి అందించిన సందర్భాలూ ఉన్నాయి. గతంలో ఒకసారి ప్రొద్దుటూరులో ప్రోగ్రామ్‌కు వెళ్లాను. అయిపోయిన తర్వాత ఎవరో ఒకాయన వచ్చి దగ్గర్లోనే ఓల్డేజ్ హోం ఉంది కాసేపు ఉండి వాళ్లని ఎంటర్‌టైన్ చేయమని రిక్వెస్ట్ చేస్తే వెళ్లాను. ఆ సమయంలో అక్కడ కనీసం పడుకోవడానికి చాప కూడా లేని దుస్థితి చూసి చలించిపోయాను. వృద్ధాప్యంలో కూడా అన్ని కష్టాలా.. అనిపించింది. వెంటనే వాళ్లకి మంచాలు పంపించాను. ఈ మధ్యే ఎల్‌బీనగర్ వెళ్లినప్పుడు అక్కడ ఓ 8 ఏళ్ల చిన్నారి తీవ్రమైన డయాబెటిస్‌తో బాధపడుతోందని తెలిసింది. వాళ్లు నిరుపేదలు. మనసాగలేదు. చేతనైనంత ఇచ్చి వచ్చాను. పటాన్‌చెరులోని స్మైల్ ఓల్డేజ్‌హోమ్‌కి వెళ్లి ఓ వాలంటరీ కార్యక్రమం చేసి వచ్చాను.
మన కనీస అవసరాలు తీరిపోయాక కష్టాల్లో ఉన్నవారి అవసరాలు సైతం మనవి అనుకోవడమే మనిషి గుణం అని భావించడానికి నా ఒకప్పటి అనుభవాలే కారణం. దారిద్య్రం ఎన్ని రకాలుగా హింసిస్తుందనేది స్వయంగా చవి చూసినవాణ్ని. ఆఫీస్‌బాయ్‌గా చేశా. బట్టల దుకాణంలో పనిచేశా. అన్నం పెడితే చాలంటూ ఇళ్లలో పనిచేసిన రోజులున్నాయి. అందుకే ఎవ రైనా అలాంటి సమస్యల్లో ఉన్నారంటే స్పందిస్తుంటా.