cityplus chitchat
-
ఉత్సాహమే ఊపిరి
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ‘ఫ్ల్లారిషింగ్ ఇండియా’ చర్చావేదిక ఆసక్తికరంగా సాగింది. బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణాలో శుక్రవారం నిర్వహించిన ఈ చర్చా వేదికలో ప్రసిద్ధ రచయిత, కాలమిస్ట్ చేతన్ భగత్‌తో పాటు నగరంలోని వ్యాపార, ఇతర రంగాల మహిళలు, వారి జీవిత భాగస్వాములతో కలసి పాల్గొన్నారు. చేతన్ భగత్ మాట్లాడుతూ... ‘ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ నుంచి రైటర్‌గా మారడానికి స్పెషల్ ప్లాన్స్ ఏమీ చేయలేదు. అయితే అదో కాలిక్యులేటెడ్ రిస్క్. భారత్‌లో మార్పు కోరుకుంటున్నందు వల్లే నేను రైటర్‌ను అయ్యాను. నా ఆలోచనలు, రచనలు అందర్నీ చేరుకోవడానికి అనువైన మాధ్యమం ఎంటర్టైన్మెంట్. హీరోను కాకపోయినా... నేను మాట్లాడినప్పుడు యూత్ వింటోంది. మరింత మందిని చేరుకోవడానికి ఓ టీవీ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించబోతున్నా’ అని చెప్పుకొచ్చిన చేతన్... తాను రాజకీయాల్లోకి రావాలని కోరుకోవడం లేదన్నారు. హీరో వస్తున్నాడంటే పరిగెత్తే ఎనర్జీ, లైవ్లీనెస్ జీవితంలో నిత్యం నింపుకోవడం ముఖ్యమని ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు సలహా ఇచ్చారు. ‘జీవితం నలభై ఏళ్లకే అయిపోతుందనుకునే వాళ్లు ఒక్కసారి రాజకీయ నాయకులను చూస్తే ఎన్నో నేర్చుకోవచ్చు. పండు వయసులోనూ రాజకీయాలపై వారికున్న మక్కువ చూస్తుంటే... జీవితం ఇంకా ఎంతో మిగిలుందనిపిస్తుంది’ అంటూ మహిళలను ఉత్సాహపరిచారు. ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ ఫ్లో చైర్పర్సన్ మౌనిక అగర్వాల్ పాల్గొన్నారు. ఓ మధు -
కూలెస్ట్ సిటీ
అదా శర్మ.. హార్ట్‌ఎటాక్‌లో ‘హయాతి’గా అబ్బాయిల గుండెలను కొల్లగొట్టిన అమ్మాయి. ఇప్పుడు అల్లు అర్జున్ పక్కన ‘సన్నాఫ్ సత్యమూర్తి సినిమా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ స్టన్నింగ్ బ్యూటీ శుక్రవారంనాడు సిటీలో సందడి చేసింది. ప్రగతి నగర్‌లోని ‘నేచురల్స్’ స్పా అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభించేందుకు వచ్చిన ఆమెతో సిటీప్లస్ చిట్‌చాట్... ..:: శిరీష చల్లపల్లి నేను పుట్టింది కేరళలోని పాలక్కాడ్‌లో. నాన్న మర్చెంట్ నేవీలో కెప్టెన్. స్కూలింగ్ కేరళలోనే. సైకాలజీలో డిగ్రీ మాత్రం ముంబైలో చేశాను. అమ్మ క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో... నాకు కథక్ డ్యాన్స్పట్ల ఆసక్తి అనిపించింది. దీంతో కథక్‌లోనూ డిగ్రీ చేశాను. నేను జిమ్నాస్టిస్ట్ను కావడంతో కథక్ సునాయాసంగా నేర్చుకోగలిగాను, చేయగలుగుతున్నాను. ప్రస్తుతం మేం ఉంటున్నది ముంబైలో. నాకు మొదటినుంచి కల్చరల్ యాక్టివిటీస్ అన్నా... పురాతన నాటకాలన్నా, డ్యాన్స్ అన్నా చాలా ఇష్టం. కళాకారులంటే గౌరవం కూడా. నిజజీవితంలోనూ నేను అల్లరి పిల్లని. బ్యూటీ సీక్రెట్స్ పెద్దగా ఏమీ లేవు. నా రూమ్‌లో కాస్మొటిక్స్ కూడా అంతగా ఉండవు. మోడలింగ్ చేస్తుండగా... నేను ఓ షోలో మోడలింగ్ చేస్తుండగా ‘1920’ సినిమాలో ఆఫర్ వచ్చింది. అందమైన హీరోయిన్ పాత్ర అనుకున్నా. కానీ భయంకరమైన ఘోస్ట్ క్యారెక్టర్ అని తెలిశాక కొంచెం కంగారు పడ్డాను. అయితే పూర్తి కథ విన్నాక ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ సినిమా పూర్తయి రిలీజయ్యాక నన్ను నేను స్క్రీన్‌పై చూసుకొని... నన్ను నేను అద్దంలో చూస్కోవడానికి భయపడ్డాను. అయితే పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ కావడంతో అందరూ గుర్తు పెట్టుకున్నారు. అలా మొదటి సినిమాకే ఫిలింఫేర్ అవార్డ్ రావడం ఆనందాన్నిచ్చింది. హార్ట్ ఎటాక్... కొన్ని బాలీవుడ్ సినిమాలు చేశాక పూరీ జగన్నాథ్‌గారు నాకు కాల్ చేసి... ‘ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తీస్తున్నా. అందులో హీరోయిన్గా నువ్వు చేయాలి’ అన్నారు. ‘నాకు తెలుగు అస్సలు రాదు!’ అని చెప్పినా... ‘నువ్వే హీరోయిన్‌వి’ అనడంతో నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది. బై కో ఇన్సిడెన్స్ మూవీ పేరు కూడా హార్ట్ ఎటాక్. అలా ఆ సినిమాకోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. కూలెస్ట్ సిటీ... హైదరాబాద్‌లో నాకు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. సాధారణంగా షూటింగ్‌కి అమ్మనో, గార్డియన్నో తోడుగా తీసుకెళ్తాను. కానీ హైదరాబాద్‌లో షూటింగ్ స్పాట్‌కి ఒక్కదాన్ని వెళ్లడానికి అస్సలు సంకోచించను. నాకు ది కూలెస్ట్ మెట్రో సిటీ హైదరాబాదే! ఒకే రోజు రెండు సినిమాలు... నేను నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఈనెల 9న రిలీజ్ కాబోతోంది. అదే రోజు నేను చేసిన కన్నడ సినిమా రిలీజింగ్ కూడా ఉండటంతో కాస్త ఎగ్జైటింగ్‌గా ఉంది. బన్నీ చాలా కేరింగ్ పర్సన్! ఫ్రెండ్లీ నేచర్ తనది. ఈ మూవీలో నేను ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేశాను. వన్ ఆఫ్ మై బెస్ట్ రోల్ అని చెప్పుకోవచ్చు. బాగా బబ్లీ అండ్ నాటీ క్యారెక్టర్. నాకు సమంతా అండ్ నిత్యామీనన్ అంటే చాలా ఇష్టం. వాళ్లిద్దరూ ఉన్న సినిమాలో యాక్ట్ చేయడం సంతోషంగా అనిపించింది! -
సెలబ్‌డబ్ శివసేవ
ఆయన వేదికపైకి రాగానే.. ముందుగా ఎన్టీఆర్ పలకరిస్తాడు.. ఆ వెంటనే ఏఎన్నార్ తొంగిచూస్తాడు.. వీరిద్దరి వంతు పూర్తయ్యిందో లేదో నేనున్నానంటూ కృష్ణ వచ్చేస్తాడు. ఆపై శోభన్‌బాబు.. చిరంజీవి.. రాజశేఖర్.. ఇలా వెండితెర వేలుపులందరూ ఒకరి వెంట ఒకరు వచ్చి పలకరించి పోతుంటారు. వీరందరి స్వరాలను.. తన గళంలో ఇముడ్చుకుని.. నవ్వుల్ని పండించడంలో మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి దిట్ట. సినీరంగానికి చెందిన ఈ వ్యక్తి సినిమాల కన్నా తనదైన ప్రతిభతో జనాలకు దగ్గరయ్యారు. తనకు వచ్చిన కళను నలుగురినీ నవ్వించడానికి.. దాని ద్వారా వచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని, సంపాదనను నలుగురి కన్నీళ్లు తుడవడానికి వెచ్చిస్తున్నారు. ఆయన మనసుకు నచ్చిన పనుల గురించి గుర్తు చేసుకోమన్నప్పుడు.. ఇలా స్పందించారు. ..:: ఎస్.సత్యబాబు బహుశా నాలుగేళ్ల క్రితం అనుకుంటా.. నా తమ్ముడు సంపత్‌రెడ్డి వచ్చి ఓ విషయం చెప్పాడు. కూకట్‌పల్లిలో కూరగాయలు అమ్ముకునే వ్యక్తి మానసికంగా ఎదగని కూతుర్ని చూసి కుంగిపోకుండా మరికొందరు బుద్ధిమాంద్యం ఉన్న పెద్ద‘పిల్లల’కు ఆశ్రయం ఇస్తున్నాడని. ఎదుటివారి కష్టాలకు వెంటనే స్పందించే గుణం నాకు ఉందని తెలుసు కాబట్టే సంపత్ నాతో ఆ విషయం చెప్పాడేమో..! కళ్లలో నీళ్లు తిరిగాయి.. కొన్నిరోజుల తర్వాత వీలు చూసుకుని ఆ కూరగాయలు అమ్ముకునే శ్రీనివాస్‌ని కలిశాను. ఆయన తన కూతురి పేరు మీద నిర్వహిస్తున్న యామిని ఫౌండేషన్ అప్పట్లో ఇంకా బాలారిష్టాలు దాటలేదు. అక్కడికి వెళ్లి చూస్తే దాదాపు యాభై మంది వయసు ఎదిగినా మనసు ఎదగని పిల్లలు కనిపించారు. వారిని చూడగానే కళ్లలో నీళ్లు తిరిగాయి. కావాల్సిన తెలివితేటలు, ఆలోచించే శక్తి ఉన్న వాళ్లకే ఈ ప్రపంచంలో ఏదో రూపంలో కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి.. ఇలాంటి పిల్లల జీవనం ఎలా అని అనుకుంటేనే.. హృదయం ద్రవించింది. వెంటనే వాళ్లకు నాకు చేతనైనంత సాయం చేస్తానని మాటిచ్చాను. ఓ చారిటీ షో నిర్వహించి రూ.8 లక్షలు కలెక్ట్ చేశాను. మరో చారిటీ షో ద్వారా రూ.12 లక్షలు సమకూర్చగలిగాను. అది మొదలు ఆ సంస్థకు వీలైనన్ని మార్గాల్లో చేయగలిగినంత సాయం చేశాను. సినీ ప్రముఖుల సహకారంతో అక్కడ ఈవెంట్స్ నిర్వహించి, వచ్చిన ఆదాయాన్ని సంస్థకు అందించాం. సంస్థ నిర్వహణ మరింత మెరుగైంది. కొంతకాలానికి అక్కడ ఆశ్రయం పొందే పిల్లల సంఖ్య కూడా వందల్లో పెరిగింది. దాతలు కూడా స్పందిస్తున్నారు. నేను వెళ్లగానే నన్ను గుర్తుపట్టి.. చుట్టుముట్టేసి.. నేను చిన్న జోక్ వేసినా నవ్వేసే అమాయకపు ‘పిల్లల’ ఆనందం, పోటీలుపడుతూ కౌగిలించుకుని వదలనంత ఆప్యాయత వెలకట్టలేనివి. చేతనైనంత.. వైజాగ్‌లో నేను ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. నాకెందరో స్నేహితులున్నారక్కడ. మొన్నటి హుద్‌హుద్ తుఫాన్ తాకిడికి విశాఖ కకావికలమైంది. సినీ పరిశ్రమలో అందరితో పాటు నా వంతుగా కొంత సాయం చేశాను. ఇలాంటి సమయాల్లోనే కాదు.. అక్కడిక క్కడ స్పందించి అందించిన సందర్భాలూ ఉన్నాయి. గతంలో ఒకసారి ప్రొద్దుటూరులో ప్రోగ్రామ్‌కు వెళ్లాను. అయిపోయిన తర్వాత ఎవరో ఒకాయన వచ్చి దగ్గర్లోనే ఓల్డేజ్ హోం ఉంది కాసేపు ఉండి వాళ్లని ఎంటర్టైన్ చేయమని రిక్వెస్ట్ చేస్తే వెళ్లాను. ఆ సమయంలో అక్కడ కనీసం పడుకోవడానికి చాప కూడా లేని దుస్థితి చూసి చలించిపోయాను. వృద్ధాప్యంలో కూడా అన్ని కష్టాలా.. అనిపించింది. వెంటనే వాళ్లకి మంచాలు పంపించాను. ఈ మధ్యే ఎల్బీనగర్ వెళ్లినప్పుడు అక్కడ ఓ 8 ఏళ్ల చిన్నారి తీవ్రమైన డయాబెటిస్తో బాధపడుతోందని తెలిసింది. వాళ్లు నిరుపేదలు. మనసాగలేదు. చేతనైనంత ఇచ్చి వచ్చాను. పటాన్‌చెరులోని స్మైల్ ఓల్డేజ్హోమ్కి వెళ్లి ఓ వాలంటరీ కార్యక్రమం చేసి వచ్చాను. మన కనీస అవసరాలు తీరిపోయాక కష్టాల్లో ఉన్నవారి అవసరాలు సైతం మనవి అనుకోవడమే మనిషి గుణం అని భావించడానికి నా ఒకప్పటి అనుభవాలే కారణం. దారిద్య్రం ఎన్ని రకాలుగా హింసిస్తుందనేది స్వయంగా చవి చూసినవాణ్ని. ఆఫీస్‌బాయ్‌గా చేశా. బట్టల దుకాణంలో పనిచేశా. అన్నం పెడితే చాలంటూ ఇళ్లలో పనిచేసిన రోజులున్నాయి. అందుకే ఎవ రైనా అలాంటి సమస్యల్లో ఉన్నారంటే స్పందిస్తుంటా. -
కెమెరా ముందు సిగ్గు విడిచేస్తా..
కెమెరా ముందు నటించడానికి తనకెలాంటి భయ సంకోచాలూ లేవంటోంది బోల్డ్ బ్యూటీ అదితిరావు హైద్రీ. కెమెరా ముందుకు వచ్చానంటే, సంకోచాలన్నింటినీ పక్కనపెట్టి, సిగ్గు విడిచి నటించేందుకే ఇష్టపడతానని చెబుతోంది. ‘ఢిల్లీ 6’, ‘యే సాలీ జిందగీ’, ‘రాక్‌స్టార్’ చిత్రాల్లో ఇంటిమేట్ సన్నివేశాల్లో ప్రేక్షకులకు వేడెక్కించిన అదితి, ఇంటిమసీ మన జీవితాల్లో ఒక భాగమని, తెరపై అలాంటి సన్నివేశాల్లో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని చెబుతోంది. -
కాండీ టచ్!
వింత వింత చేష్టలు... గెటప్‌లతో ఎప్పుడూ న్యూస్‌లో ఉండే అమెరికన్ రియాల్టీ షో స్టార్ కిమ్ కర్దాషియన్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు తన అందచందాలతో అలరించిన అమ్మడు... లేటెస్ట్గా హెయిర్ కలర్ మార్చి, ఆ పిక్చర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసింది. ఇక చెప్పేదేముంది..! ఒకటే లైకులు... షేర్లు... కామెంట్లు! ‘వాస్తవానికి మడోనా హెయిర్ కలర్ నన్ను బాగా ఇంప్రస్ చేసింది. ఆ ప్రభావంతోనే నేనూ జుట్టు రంగు మార్చుకున్నా. ప్లాటినమ్ హెయిర్డ్ మడోనా పిక్చర్ ఎప్పుడూ నా కంప్యూటర్ రిఫరెన్స్ ఫోల్డర్లో ఉంటుంది. ఈ లుక్ కోసం చాలా రోజులు వేచి చూడాల్సి వచ్చింది. ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయడానికి ప్యారిస్ ఫ్యాషన్ వీక్ కంటే పెద్ద సందర్భం ఏముంటుంది! కానీ... ఈ నిర్ణయం ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదు. లాస్ట్ మినిట్‌లో తీసుకున్నది’ అంది కిమ్! -
మహిళా చిత్రం
మహిళల భావాలు, సమస్యలు... కాన్వాస్‌పై చిత్రాలుగా మలిచి చైతన్యం రగిలిస్తున్నాడు ఆర్టిస్ట్ సమీర్. అంతే కాదు... జంతుజాలం సంరక్షణ అవసరాన్నీ పెయింటింగ్స్‌లో ప్రతిబింబిస్తూ సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. సిటీతో పాటు ఇతర నగరాల్లో కూడా తన పెయింటింగ్స్‌ను ప్రదర్శిస్తున్న సమీర్‌ను ‘సిటీ ప్లస్’ పలుకరించింది... కళాహృదయం ఉన్నవాడు తన అనుభవాలు, అనుభూతులనే చిత్రాలుగా మలుస్తాడు. అప్పుడే సహజత్వం ఉట్టిపడే అందమైన చిత్రాలు జీవం పోసుకుంటాయి. నేనూ అంతే. కళ్లతో చూసినదాన్ని కుంచెతో కాన్వాస్‌పై పరచడానికి ప్రయత్నిస్తా. కవికి కవితలా... ఛాయాచిత్రకారుడికి ఓ అద్భుత చిత్రంగా... ఒక్కో దృశ్యం ఒక్కోరికీ ఒక్కోలా కనిపిస్తుంది. అలాగే నేను బొమ్మలు గీస్తున్నా. చూడ్డానికి పిచ్చిగీతల్లా ఉన్నా... కళాత్మక దృష్టితో చూస్తే ప్రతి గీతలోనూ ఓ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. నా పెయింటింగ్స్‌లో రోజువారీ కార్యకలాపాలుంటాయి. అంతులేని అభురుచి... వ్యాపార రీత్యా మేం లక్నో నుంచి సిటీకి వచ్చి స్థిరపడ్డాం. నాన్న హఫీజ్ షేక్ ఎప్పుడూ వ్యాపార లావాదేవీలతో బిజీగా ఉండేవారు. అమ్మ హజ్రా సుల్తానా గృహిణి. ఆమే నాకున్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించింది. మెహదీపట్నం న్యూ మోడల్ హైస్కూల్లో చదువుతున్నప్పటి నుంచి మాసబ్‌ట్యాంక్ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ వరకు డ్రాయింగ్ పోటీల్లో ముందుండేవాడిని. ఆ అభిరుచి మరింత పెరిగి, క్రియేటివ్ కోర్సులో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. దిల్లీలో జర్నలిజం చేశా. అదే ఏడాది లైన్ డ్రాయింగ్ ఆర్టిస్ట్‌గా ఓ యాడ్ ఏజన్సీలో చేరా. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీకి పీఆర్‌గా కూడా చేశాను. అలా అలా తిరిగి ప్రస్తుతం నగరంలో ‘త్రీమార్క్ సర్వీసెస్’ నడిపిస్తున్నాను. అదే సమయంలో పెయింటింగ్సూ వేస్తున్నా. మహిళలు, మూగజీవాలే నా సబ్జెక్ట్. వీటిపై ఎన్నో చిత్రాలు గీసి ప్రదర్శించాను. నా బొమ్మలు చూసిన వారంతా అభినందిస్తుంటే... శ్రమకు తగ్గ ఫలితం దక్కిందన్న ఆనందం కలుగుతుంది. నేను ఎంచుకున్న సబ్జెక్టును చిత్ర రూపంలో మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది లక్ష్యం. మహిళలను గౌరవించాలన్న థీమ్‌తో దిల్లీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం ఆ పనిలోనే బిజీ బిజీ! వీఎస్ -
మనసు పలికే...
డిగ్రీ చదివినా.. ఉద్యోగం చేస్తున్నా.. మనసు మాత్రం నటనపైనే. దానికి పొట్టి చిత్రాలను వేదికగా చేసుకొని.. అభిమానులను ఆకట్టుకుంటోంది నటి సుమలత. ఇటీవల సిటీలో జరిగిన అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సహాయనటి అవార్డు అందుకున్న సుమలతతో ‘చిట్‌చాట్’.. నటన, సంగీతం అంటే చాలా ఇష్టం. డిగ్రీ తర్వాత ఉద్యోగం కోసం నగరానికి వచ్చాను. ఒక డివోషనల్ చానల్లో టెక్నికల్ ఉద్యోగిగా చేరాను. అవసరం కోసం ఉద్యోగం చేస్తున్నా నటనపై ఉన్న ఇష్టం తగ్గలేదు. అవకాశం వస్తే తప్పకుండా నటించాలని, చిన్నప్పటి నుంచి కోరిక. అలా మొదటిసారి ఫ్రెండ్స్ తీసిన ‘మౌనంగానే’ షార్ట్‌ఫిలింలో నటించా. తొలిసారి కెమెరా ముందుకి వెళ్లినప్పుడు నటన గురించి ఏమీ తెలియదు. ఫ్రెండ్స్ గెడైన్స్‌లో నటించేశా. అలా కెమెరా ముందే ఓనమాలు నేర్చుకున్నా. గోపురం, ఇదే ప్రేమతో పాటు 10 షార్ట్ ఫిలింస్ చేశా. నటిగా ఈ ఏడాదిన్నర కాలంలో బుల్లి చిత్రాలతో పాటు ఫీచర్ ఫిలింస్‌లోనూ నటించాను. వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ‘నువ్వలా నేనిలా’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా చేశా. ఇదే నా బిగ్ స్క్రీన్ ఎంట్రీ. తర్వాత రొమాన్స్, వీకెండ్ లవ్ ఇంకా కొన్ని చిత్రాల్లో కూడా నటించాను. బుల్లి సినిమాలతో పాటు సిల్వర్ స్క్రీన్‌పై కూడా నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రలు చేయాలనేది నా కోరిక.