
కౌన్సిల్‌పై యావతోనే అసెంబ్లీ స్థానాల పెంపు డిమాండ్
తెలంగాణ ఏర్పడటం దాదాపు ఖాయమయ్యిందన్న ఊపులో, కొత్త రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలన్న కొత్త డిమాండుతో ముందుకొచ్చారు తెలంగాణా కాంగ్రెస్ నాయకులు. ఈ మేరకు, జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ వైస్‌చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం తెలంగాణ పై ఏర్పాటైన జీవోఎంను మంగళవారం కలిశారు కూడా. పాలనా సౌలభ్యం కోసం అని వీరు చెప్పుకుంటున్నప్పటికీ, తెలంగాణ నేతల అసలు ఆంతర్యం వేరే ఉందని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలతో ఎగువ సభ విధాన పరిషత్ (లెజిస్లెటివ్ కౌన్సిల్) ఏర్పాటు కుదరదు కనుక, రాజకీయ ఉపాధి కేంద్రంగా కాంగ్రెస్ భావించే కౌన్సిల్ ఏర్పాటుకు అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచడమే మార్గమని వారి ఆలోచన అని తెలుస్తోంది.
రాజ్యాంగంలోని 171వ అధికరణ ప్రకారం, లెజిస్లెటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్య అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో మూడోవంతు మించకూడదు. అంతే కాకుండా, కౌన్సిల్ సభ్యుల సంఖ్య కనీసం 40 ఉండితీరాలి. ఈ లెక్కల ప్రకారం చూస్తే, 119 మంది ఉండబోయే తెలంగాణ రాష్ట్రంలో, అందులో మూడో వంతు 40 కంటే తక్కువ కావడం వల్ల కౌన్సిల్ ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. అందుకే ముందు జాగ్రత్తగా తెలంగాణ ఏర్పడ్డాక అసెంబ్లీలో సీట్ల సంఖ్యపై ముందుగానే తెలంగాణ బిల్లులో పొందుపరిచేలా చూడాలని జీవోఎంని కలిశారు తెలంగాణా ప్రతినిధులు.
రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో సమావేశమైన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు కొత్త రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంచడం మీద ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తీర్మాన సారాంశాన్ని మర్రి శశిధర్‌రెడ్డి బృందం ఈ రోజు సుశీల్ కుమార్ షిండేని కలిసి అందజేశారు.
రాజకీయ అస్థిరత ఉండకూడదని, పాలనా సౌలభ్యం ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నా, కాంగ్రెస్సులో తామరతంపరగా ఉండే రాజకీయ నిరుద్యోగులకి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ డిమాండ్ ప్రాణం పోసుకుందని తెలియవచ్చింది.