న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రానున్న ఎన్నికల లోపే ఆ రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల లోపు అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యం కాని పక్షంలో ‘తెలంగాణ ప్రొవిజనల్ అసెంబ్లీ’ పేరుతో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలతోనే సభను కొనసాగించాలని కోరారు. అసెంబ్లీ స్థానాలను పెంచిన తరువాతే శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. పార్టీ సీనియర్ నాయకుడు, జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో సుమారు 30 మంది టీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు మంగళవారం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు.
అసెంబ్లీలో తక్కువ స్థానాలు ఉంటే రాజకీయ అస్థిరత ఏర్పడి, మరో జార్ఘండ్‌లా మారే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ‘విభజన తరువాత తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలే ఉంటాయి. దాంతో రాజకీయంగా చాలా సమస్యలు వస్తాయి’ అని తెలిపారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్థానాలను పెంచుకునే పద్ధతులను షిండేకు శశిధర్ రెడ్డి తెలిపారు. ‘425 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ను విభజించాక ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 22 అసెంబ్లీ స్థానాలను మాత్రమే కేటాయించారు. ఆ తరువాత ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచే అంశాన్ని ఉత్తరప్రదేశ్ పునర్విభజన చట్టం-2000లో పొందుపర్చి, అసెంబ్లీ సీట్ల సంఖ్యను 70కి పెంచారు. అప్పటివరకు ఎన్నికలు నిర్వహించకుండా, అప్పుడున్న ఎమ్మెల్యేలతో ఉత్తరాంచల్ ప్రొవిజనల్ అసెంబ్లీని ఏర్పాటు చేశారు’ అని ఆయన షిండేకు వివరించారు.
ఒక్కో లోక్‌సభ సీటు పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలు
రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా ఎంపీ స్థానాల పరిధిలో ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను పెంచుకునే వెసులుబాటు కూడా ఉందని మర్రి శశధర్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో కూడా హర్యానా మాదిరిగా ఒక్కో పార్లమెంట్ పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. దాంతో తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక 153కు పెరుగుతుందని, శాసనమండలిని కూడా కొనసాగించవచ్చని సూచిం చారు. వీరి వాదనలను సావధానంగా విన్న షిండే ఈ ప్రతిపాదనలను పరిశీలించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి సూచించినట్లు తెలిసింది.
ఇదే సందర్భంలో భద్రాచలం డివిజన్‌ను పూర్తిగా తెలంగాణలోనే కొనసాగించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. షిండేను కలిసిన వారిలో ఎంపీలు నంది ఎల్లయ్య, వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు పి.శంకర్‌రావు, ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి, జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్, పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి, సీనియర్ నేతలు మల్లు రవి, కోదండరెడ్డి తదితరులున్నారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. తమ ప్రతిపాదనలకు కాంగ్రెస్ నేతలతో పాటు, టీఆర్‌ఎస్‌లోని ముఖ్యనాయకుడు కూడా మద్దతు తెలిపారని మర్రి వెల్లడించారు.