
సమావేశంలో మాట్లాడుతున్న మర్రి శశిధర్‌రెడ్డి
- నీటి సద్వినియోగంపై ప్రజలను చైతన్యపరచాలి
- వాటర్‌షెడ్లతోనే అధిక లాభం
- గోదావరి వాటర్ యుటిలైజేషన్ సంస్థ అధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి
జహీరాబాద్/కోహీర్: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమ సంస్థ పూర్తిగా వ్యతిరేకిస్తోందని, అవసరమైతే అడ్డుకునేందుకూ సిద్ధమేనని గోదావరి వాటర్ యుటిలైజేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మెదక్ జిల్లా కోహీర్ మండలంలోని గొటిగార్‌పల్లి గ్రామంలో పదేళ్ల క్రితం నిర్మించిన వాటర్‌షెడ్‌లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు ప్రధానంగా నీటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. ముఖ్యంగా తక్కువ వ్యయంతో నిర్మించే వాటర్‌షెడ్‌లను ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ఈ క్రమంలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు తమ సంస్థ తరపున కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. గొటిగార్‌పల్లిలో ఇరిగేషన్ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ హన్మంత్‌రావు పదేశ్ల క్రితం చతుర్విద జల ప్రక్రియలో భాగంగా వాటర్‌షెడ్ నిర్మాణాలను ప్రోత్సహించారని గుర్తుచేశారు. రూ.60 లక్షలతో 2,500 ఎకరాల్లో గ్రామంలో రెండు వాటర్‌షెడ్లను అప్పట్లో నిర్మించారన్నారు.
రాజస్థాన్‌లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని, అక్కడ నిర్మించిన వాటర్ షెడ్లు ఉత్తమ ఫలితాలు ఇచ్చాయన్నారు. వాటర్‌షెడ్ల వినియోగంపై తమ సంస్థ ద్వారా తెలుగు రాష్ర్టాలతో పాటు దేశవ్యాప్తంగా వాటర్‌షెడ్‌లను ప్రోత్సహించేందుకు రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలకు సూచనలిస్తామన్నారు.
సమావేశంలో పర్యావరణ వేత్త పురుషోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్‌రావు, జహీరాబాద్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు మేఘనారెడ్డి, సర్పంచ్ రాచయ్య, కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామలింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు అష్రఫ్, మల్లన్న, రాందాస్, కండెం నర్సింహులు, శ్రీనివాస్‌రెడ్డి, జాఫర్, మాజిద్, సంగమేశ్వలతో పాటు అండాలమ్మ, నిరంజన్, రామేశ్వర్‌రెడ్డి ఉన్నారు.