అగ్రరాజ్యాలను వణికిస్తున్న ఇబోలా!! | Ebola outbreak threatens major countries | Sakshi
Sakshi News home page

అగ్రరాజ్యాలను వణికిస్తున్న ఇబోలా!!

Published Tue, Aug 5 2014 11:36 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

అగ్రరాజ్యాలను వణికిస్తున్న ఇబోలా!!

అగ్రరాజ్యాలను వణికిస్తున్న ఇబోలా!!

మొన్నా మధ్య సార్స్.. ఆ తర్వాత హెచ్1ఎన్1.. ఇప్పుడు ఇబోలా! అగ్రరాజ్యాలకు వైరస్ భయాలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. తాజాగా ఇబోలా వైరస్ను చూసి అమెరికా సహా అగ్రరాజ్యాలన్నీ గజగజలాడుతున్నాయి. ప్రస్తుతం సియెర్రా లియోన్, లైబీరియా ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న ఈ వైరస్ నియంత్రణకు వందలాది మంది దళాలను మోహరించారు. ఇప్పటికే 887 మంది ఈ వైరస్ బారిన పడి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. పశ్చిమాఫ్రికా దేశాల్లో వైద్యవర్గాలు దీనిపై ఇప్పటికే చేతులెత్తేశాయి. సియెర్రా లియోన్, లైబీరియా, గినియా దేశాల్లో ఇబోలా వైరస్ను అదుపు చేసేందుకు 1218 కోట్ల రూపాయల సాయాన్ని ప్రపంచబ్యాంకు ప్రకటించింది. ఈ వైరస్ను వీలైనంత త్వరగా నియంత్రించకపోతే అత్యంత దారుణమైన పరిణామాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్ఓ) గత వారం హెచ్చరించింది. గడిచిన రెండు వారాల్లోనే ఈ వైరస్ బారిన పడి 61 మంది మరణించారు.

ముందుగా గినియాలోని అడవుల్లో గత ఫిబ్రవరిలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైంది. అప్పటినుంచి అక్కడ మరణాల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఆ తర్వాత పొరుగున ఉన్న లైబీరియా, సియెర్రా లియోన్లకు ఈ వైరస్ పాకింది. నైజీరియాలో పాట్రిక్ సాయెర్ అనే అమెరికా పౌరుడు లైబీరియా నుంచి వచ్చిన తర్వాత జూలై నెలాఖరులో మరణించాడు. అతడికి చికిత్స చేసిన వైద్యుడికి కూడా వైరస్ సోకింది!!

దీంతో అసలు ఈ వైరస్ సోకిన బాధితులకు వైద్యం చేయడానికే ఆరోగ్యబృందాలు భయపడిపోయాయి. పలు దేశాల్లో ఈ వైరస్కు భయపడి అసలు పాఠశాలలు తెరవడం మానేశారు. సాధారణ వైద్యులు వైద్యం చేసేది లేదని చెప్పడంతో భారీ సంఖ్యలో మిలటరీ వైద్యులను, వైద్య బృందాలను సియెర్రా లియోన్ తదితర ప్రాంతాలకు పంపారు. అక్కడే ఈ కేసుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. అక్కడినుంచి ఇతర ప్రాంతాలకు పాకడానికి ముందే దీన్ని అరికట్టాలని ప్రయత్నిస్తున్నారు.

కొన్ని ప్రాంతాలను క్వారంటైన్ చేసనట్టు ప్రకటించి, అక్కడినుంచి ఎవరినీ ఇతర ప్రాంతాలకు అనుమతించకుండా పక్డ్బందీగా చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు. లైబీరియా లాంటి దేశాల్లో దాదాపు అత్యవసర పరిస్థితి ప్రకటించినట్లు అయ్యింది. పరిస్థితి మెరుగయ్యేలోపే మరింత దారుణంగా తయారవుతోందని లైబీరియా సమాచార శాఖ మంత్రి లూయిస్ బ్రౌన్ వాపోయారు.

సమస్య పరిష్కారం ఎలా?
పెద్దపెద్ద ఫార్మా దిగ్గజాలన్నీ ఈ వైరస్ను అదుపు చేయలేక మల్లగుల్లాలు పడుతుంటే, అమెరికాలో చిన్న ఔషధ సంస్థ మాత్రం ఓ సీరమ్ను తయారుచేసింది. ప్రస్తుతానికి ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్న దీన్ని ఇద్దరు అమెరికన్లపై ప్రయోగిస్తున్నారు. ఈ ప్రయోగాలను అత్యంత రహస్యంగా చేస్తున్నారు. ఇది కొంత వరకు పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం కొంతవరకు ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ, పేద దేశాలకు ఇది ఎంతవరకు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మాత్రం ఇంకా చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement