ఫ్యాషన్ టెక్
టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్న వేళ.. నేటి యువత కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. క్లాస్ రూమ్‌లో నేర్చుకున్న పాఠాలను.. ప్రాక్టికల్స్‌లో పక్కాగా ఇంప్లిమెంట్ చేసి అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. అలాంటి అద్భుతాలకు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలే జీ వేదికైంది.
కాలేజీలో శుక్రవారం జరిగిన ‘అక్షర 2కె15’ టెకీ అండ్ కల్చరల్ ఫెస్ట్‌లో ఇంజనీరింగ్ విద్యార్థులు అదరగొట్టారు.
టెకీ ఫెస్ట్‌లో పోటాపోటీగా సత్తాచాటిన విద్యార్థులు.. కల్చరల్ ఈవెంట్‌కు వచ్చే సరికి తమలోని కొత్త కోణాన్ని ర్యాంప్‌పై నడిపించారు. సినీ తారలు.. ప్రొఫెషనల్ మోడల్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఫ్యాషన్ నడకతో మతులు పోగొట్టారు. ఇక టెక్నికల్ ఈవెంట్‌లో నయా ఆవిష్కరణలతో విద్యార్థులు అదరహో అనిపించారు.
పీస్ ఆప్ ఆర్ట్
చాక్ పీస్, ఎరైజర్, కొయ్య.. ఏవైనా ఆ కుర్రాడి చేతిలో పడితే కళాకృతిగా మారిపోతాయి. మెకానికల్ ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతున్న సాయిప్రసాద్ మైక్రో ఆర్ట్‌లో మెగా పెర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తున్నాడు. లక్ష్మీదేవి, వినాయకుడు, బుద్ధుడి ప్రతిమలు, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ షిప్, షాట్ గన్.. ఇలా రెండు వందల మైక్రో వండర్స్ రూపొందించి ఈ ప్రదర్శనలో ఉంచాడు.
మా దారి.. రహదారి..
దూరాలను దగ్గర చే సేది రహదారులే. అలాగే షార్‌టకట్ అంటే ఎవరికైనా ఆసక్తే. ఈ రెండింటినీ కలుపుతూ సుదూర ప్రాంతాలను
అతి తక్కువ కాలంలో చేరుకునే విధంగా రహదారుల నమూనాను రూపొందించారు సివిల్
ఇంజినీరింగ్ చదువుతున్న సంజయ్, సాయినివాస్, సౌమ్య, సుధీర్ కుమార్ . దీనికి ప్రాథమిక నమూనాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న రాజధాని ప్రాంతాన్ని ఎంచుకుని.. రహదారులను అందంగా
ఆవిష్కరించారు.
సోలార్ కమ్ ఎలక్ట్రికల్ కార్
‘మేం రూపొందించిన ‘క్రీడ్ ఈవీ-2015’ కారు బ్యాటరీతో పాటు సోలార్ శక్తితో కూడా నడుస్తుంది. ఇది వంద శాతం ఎకో ఫ్రెండ్లీ. ఇందులో ముగ్గురు మనుషులు కూర్చుని హాయిగా ప్రయాణం చేయవచ్చు. ఏదైనా సమస్య వచ్చినా రిపేర్ చేయడం చాలా సులువు. ఇది గంటకు 25 నుంచి 30 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది’ అని క్రీడ్
ఈవీ టీం తెలిపింది.
రోబో.. సెన్సార్‌స..
టెక్నికల్ ఫెస్ట్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూ ఈసీఈకి చెందిన టీమ్ అమినాబీ, శ్రీలక్ష్మిలు సెన్సార్ సిస్టమ్‌ను రూపొందించారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌కి ఈ సెన్సార్స్ అమర్చడం ద్వారా ట్రాఫిక్ పోలీస్ ఉన్నా.. లేకపోయినా.. రద్దీని బట్టి సిగ్నల్ మారిపోతుంది. రోబో తయారీ, వినియోగాన్ని వివరిస్తూ మెకానికల్ బ్రాంచ్‌కు చెందిన సమీర్ ఖాన్ అండ్ టీమ్ తాము రూపొందించిన రోబోను ప్రదర్శించారు. రోబోట్స్‌తో ఎలాంటి పనినైనా.. ఇన్‌టైమ్‌లో కచ్చితంగా చేయగలమని చెప్పేందుకు వార్టన్ టెక్ సొల్యూషన్స్‌తో కలిసి ఈ నమూనా తయారు చేశామని తెలిపింది సమీర్ టీమ్.